గ్రీన్‌ల్యాండ్ అంటే ఏంటి.. ట్రంప్ క‌న్ను దీనిపై ఎందుకు ప‌డింది?

Greenland అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ కొంప‌ముంచేలా ఉన్నాడు. కొంద‌రు దేశ నేత‌లు చెప్తున్న‌ట్లు ఊహ‌ల్లో బ‌తికేస్తున్నారు. అమెరికా గురించి ఆలోచించ‌మంటే ప‌క్క‌నున్న కూన దేశాల‌పై ప‌డి ఆక్ర‌మించేసుకోవాల‌ని అనుకుంటున్నాడు. ఈ క్ర‌మంలోనే వెనెజ్వెలా అధ్య‌క్షుడు నికోలా మ‌డురోను అదుపులోకి తీసుకున్నాడు. ఇప్ప‌టికే ట్రంప్ చేసిన ఈ ప‌నికి ఐక్య‌రాజ్య స‌మితి, నాటో గుర్రుమంటున్నాయి. ఇది చాల‌ద‌న్న‌ట్లు.. నాటోలోని ఇత‌ర దేశాల ఐక్య‌త‌ను దెబ్బ‌తీసే మ‌రో షాకింగ్ నిర్ణ‌యం తీసుకున్నాడు. అదేంటంటే.. గ్రీన్‌ల్యాండ్‌ను ఆక్ర‌మించుకోవ‌డం. 

ఈ గ్రీన్‌ల్యాండ్ ప్రపంచంలోనే అతిపెద్ద ద్వీపం. ఇది ఆర్కిటిక్ ప్రాంతంలో ఉంది. ఇక్క‌డ ఖనిజ వనరులు అత్య‌ధికంగా దొరుకుతాయి. ప్ర‌స్తుతానికైతే అమెరికా శ‌త్రు దేశాలుగా భావిస్తున్న‌ ర‌ష్యా, చైనా ఆర్కిటిక్‌ను ప‌డ‌వ‌లు, మిలిట‌రీ, రీసెర్చ్ ప‌నుల‌కు వాడుకుంటున్నాయి. జనాభా చాలా తక్కువ. సుమారు 56,000 మంది మాత్రమే నివసిస్తున్నారు. గ్రీన్‌ల్యాండ్‌లో దాదాపు 80% ప్రాంతం మంచు మాత్ర‌మే ఉంది. అయితే.. ఈ గ్రీన్‌ల్యాండ్‌ను ఖనిజ వనరులు అన్నీ అమెరికా వ‌ద్దే ఉండాలి.. వాటి కోసం ర‌ష్యా చైనాలు అమెరికాను భిక్ష‌మెత్తుకోవాల‌న్న ఉద్దేశంతో ట్రంప్ గ్రీన్‌ల్యాండ్‌పై క‌న్నేసాడు. కానీ మీడియాతో మాత్రం గ్రీన్‌ల్యాండ్ అమెరికా జాతీయ భద్రత కోసం అవసరం అని చెప్తున్నారు.

ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా, చైనా చురుకుగా వ్యవహరిస్తున్నాయని ఆర్కిటిక్ మార్గాలు భవిష్యత్తులో సైనిక, వాణిజ్య పరంగా కీలకమౌతాయి కాబ‌ట్టి గ్రీన్‌ల్యాండ్‌ను త‌న ఆధీనంలోకి తెచ్చుకోవాల‌నేది ట్రంప్ మాస్ట‌ర్ ప్లాన్. ఎందుకంటే. వాతావరణ మార్పుల కారణంగా మంచు కరుగుతుండటంతో ఖనిజ వనరులు నౌకా మార్గాలు మరింత ప్రాధాన్యం పొంద‌నున్నాయి. అయితే గ్రీన్‌ల్యాండ్ ప్రస్తుతం డెన్మార్క్‌కు చెందిన స్వయం పాలిత ప్రాంతం. రక్షణ, విదేశీ వ్యవహారాలు డెన్మార్క్ ఆధీనంలో ఉన్నాయి.

2019లోనూ ఇలాగే గ్రీన్‌ల్యాండ్‌ను కొనుగోలు చేయాలని ట్రంప్ ప్రయత్నించారు. 2025లో మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ నిర్ణ‌యాన్ని వెన‌క్కి తీసుకున్నారు. ఇప్పుడు మ‌రోసారి గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా నియంత్రణ అవసరమని చెప్తున్నారు. అవసరమైతే బ‌ల‌వంతంగా లాక్కుంటాను అన్న‌ట్లు కూడా సంకేతాలు ఇచ్చారు.

ట్రంప్ వ్యవ‌హారంపై డెన్మార్క్ ప్ర‌ధాని గ్రీన్‌ల్యాండ్ గ్రీన్‌ల్యాండర్లదే అని ధీటుగా చెప్పారు. అమెరికా, డెన్మార్క్ రెండూ నాటో సభ్య దేశాలు కాబ‌ట్టి గ్రీన్‌ల్యాండ్‌ను బలవంతంగా తీసుకుంటే నాటోకు భారీ ప్రమాదమ‌ని హెచ్చ‌రించారు. ఒక నాటో దేశం మరొక నాటో దేశంపై బెదిరింపులకు దిగితే నాటో ఐక్యత దెబ్బతింటుంది. పరస్పర నమ్మకం కోల్పోతుంది. ఇది నాటో భవిష్యత్తుకు ప్రమాదకర పరిస్థితుల‌కు దారి తీస్తుంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అంటున్నారు. పాపం గ్రీన్‌ల్యాండ‌ర్ల ప‌రిస్థితి ఎంత ద‌య‌నీయంగా ఉందంటే.. త‌మ‌కు డెన్మార్క్ పాల‌న నుంచి విముక్తి కావాల‌ని కోరుకుంటున్నారు. అలాగ‌ని అమెరికా వ‌ల్లో చిక్కుకోలేమ‌ని నొక్కి చెప్తున్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *