Pushpa 2 – ఆస్కార్స్‌కి పుష్ప

Pushpa 2 తొలి సినిమాలో ఏ గెట‌ప్ వేస్తే వీడేంట్రా ఆడంగోడిలా అని వెక్కిరించారో.. అదే గెట‌ప్‌తో ఈరోజు బాక్సాఫీస్ వ‌ద్ద వసూళ్ల వ‌ర్షం కురిపిస్తున్నాడు. తెలుగు సినీ చ‌రిత్ర‌లో ఏ న‌టుడికీ ఒక జాతీయ అవార్డే లేదే అని బాధ‌ప‌డుతుంటే.. ఆగండి నేను తెస్తాను అని సాధించి చూపించాడు. అది సార్ నా బ్రాండు అని నోటికొచ్చిన‌ట్లు వాగిన వారి నోళ్లు మూయించాడు. పుష్ప పార్ట్ 1 రిలీజ్ కానంత వ‌ర‌కు ఇదేం లుక్ రా బాబూ… ఆ భుజమేంట్రా బాబూ అని వెక్కిరించిన వారు లేక‌పోలేదు.

ఆ సినిమా రిలీజ్ అయ్యాక అంత‌ర్జాతీయ స్థాయిలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) వేసిన స్టెప్స్‌కి ఏ రేంజ్‌లో క్రేజ్ వ‌చ్చిందో ప్ర‌త్యేకించి చెప్ప‌న‌క్కర్లేదు. ఇప్పుడు పుష్ప 2 (ది రూల్)తో ఫైర్ నుంచి వైల్డ్ ఫైర్.. నేష‌న‌ల్ నుంచి ఇంట‌ర్నేష‌న‌ల్ లెవెల్‌కి వెళ్లిపోయాడు. క‌చ్చితంగా సినిమా ఫ్లాప్ అవుతుంది అని అన్న‌వారు కూడా ఏం యాక్ట్ చేసాడురా అనిపించుకున్నాడు బ‌న్నీ.  టాలీవుడ్‌లో అగ్ర హీరోల్లో ఒక‌రైన అల్లు అర్జున్ చీర క‌ట్టుకుని యాక్ట్ చేస్తాడ‌ని ఎవ్వ‌రూ ఊహించ‌లేదు. ఒక స్థాయిలో గుర్తింపు వ‌చ్చాక ఎందుకొచ్చిన రిస్క్ రా బాబూ అని అలాంటి పాత్ర‌లు చేసేందుకు కూడా సాధారణంగా హీరోలు ఒప్పుకోరు. కానీ బ‌న్నీ నేను చేసి చూపిస్తా అని తెలుగు సినిమాని మ‌రో స్థాయికి తీసుకెళ్లాడు.

Pushpa 2 పుష్ప 1తో జాతీయ అవార్డు సాధించిన బ‌న్నీ.. ఇక పుష్ప 2తో ఆస్కార్ కొట్టాల‌ని గ‌ట్టిగా ప్ర‌య‌త్నిస్తున్నాడు. ఆల్రెడీ మ‌న‌కు జ‌క్క‌న్న (రాజ‌మౌళి) RRR సినిమాకు గానూ ఆస్కార్ తెచ్చేసారు. ఇప్పుడు రెండో ఆస్కార్‌ని పుష్ప 2కి తీసుకురావాల‌ని చిత్ర బృందం గ‌ట్టిగా ప్ర‌య‌త్నిస్తోంది. దీని గురించి ఆల్రెడీ అల్లు అర్జున్.. ద‌ర్శ‌కుడు సుకుమార్‌తో చ‌ర్చించార‌ట‌. ఆస్కార్ అవార్డుకు కావాల్సిన అన్ని హంగులు పుష్ప 2 లో ఉన్నాయి.  హాలీవుడ్ ఇన్‌ఫ్లుయెన్స‌ర్ల‌కు పుష్ప ఫీవ‌ర్ ఎక్కేసేలా ఈ సినిమాకు సంబంధించిన స్పెష‌ల్ షోలు వేయాల‌ని టీం నిర్ణ‌యించుకుంది. హాలీవుడ్‌లో అగ్ర హీరోలు కానీ ద‌ర్శ‌కులు కానీ నిర్మాత‌లు కానీ ఇన్‌ఫ్లుయెన్స‌ర్లు కానీ ఒక సినిమాకు హైప్ ఇస్తున్నారంటే అది క‌చ్చితంగా ఆస్కార్ క‌మిటీ దృష్టికి వెళ్తుంది.

ఇదే కాకుండా కాస్త మ‌న సైడ్ నుంచి కూడా పెయిడ్ ప్ర‌మోష‌న్స్ ఉండాలి. RRR సినిమాకి కూడా రాజ‌మౌళి కొన్ని కోట్లు ఖ‌ర్చు పెట్టి ప్ర‌మోష‌న్స్ చేయించారు. ఒక భార‌తీయ సినిమాకి.. మ‌రీ ముఖ్యంగా ఒక తెలుగు సినిమాకి ఆస్కార్ రావాలంటే చిన్న విష‌యం కాదు. హాలీవుడ్ సినిమాల‌కు రేటింగ్స్‌ని నామినేష‌న్ల‌ను బ‌ట్టి అవార్డులు ఇస్తుంటారు. కానీ ఇప్ప‌టికీ హాలీవుడ్‌కి మ‌న భార‌తీయ చ‌ల‌న చిత్రం అంటే చిన్న చూపే. ఏదో పొగిడితే మ‌న సినిమాలో అవ‌కాశాలు ఇవ్వ‌క‌పోరా అని వాళ్లు మ‌న‌కు బిస్కెట్స్ వేస్తుంటారు కానీ లోప‌ల వేరే క‌థ ఉంది. అందుకే అల్లు అర్జున్ కూడా త‌న వంతు కొంత మొత్తం ఖ‌ర్చు పెట్టి సినిమాను ఎలాగైనా ఆస్కార్స్‌కు తీసుకెళ్లాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నారు. ఉత్త‌మ న‌టుడు, ఉత్త‌మ చిత్రం కేట‌గిరీల్లో సినిమాను ఆస్కార్స్‌కు పంపాల‌ని నిర్ణ‌యించుకున్నారు.

దీపం ఉండ‌గానే ఇల్లు చెక్క‌బెట్టుకోవాల‌న్న‌ట్లు.. జాతీయ అంత‌ర్జాతీయ స్థాయిలో వైర‌ల్ అయిన‌ప్పుడే సినిమాను ఆస్కార్స్ స్థాయికి తీసుకెళ్లాల‌ని బ‌న్నీ బ‌లంగా నిర్ణ‌యించుకున్నారు. ఇప్పుడు ఈ అవకాశం వ‌దులుకుంటే ఇక భ‌విష్య‌త్తులో ఇలాంటి సినిమా మ‌ళ్లీ వ‌స్తుందో రాదో అనుకుని ఆస్కార్‌పై ఫోక‌స్ పెట్టాడన్న టాకైతే బాగా వినిపిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *