Pahalgam Attack: యాప్ రూపొందించి.. శిక్ష‌ణ ఇప్పించి

Pahalgam Attack: ఎన్నో దేశాలు టెక్నాల‌జీని ఉప‌యోగించుకుని త‌మ దేశ ప్ర‌జ‌ల‌కు ఉద్యోగాలు స‌మ‌కూరుస్తూ.. ఎప్ప‌టిక‌ప్పుడు అభివృద్ధి వైపు ఎలా అడుగులు వేయాల‌ని ఆలోచిస్తుంటే.. పాకిస్థాన్ మాత్రం ఉగ్ర‌మూక‌ల‌కు ట్రైనింగ్ ఇస్తూ వారిని పెంచి పోషిస్తోంది. అమెరికా మెప్పు పొందేందుకే తాము ఉగ్ర‌వాదుల‌కు శిక్ష‌ణ ఇచ్చి ప‌లుమార్లు దాడులు చేయించాం అని పాక్‌కి చెందిన ఓ నేత ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో స్వ‌యంగా ఒప్పుకున్నాడు. ఇటీవ‌ల జ‌మ్మూ క‌శ్మీర్‌లోని ప‌హ‌ల్గాంలో జ‌రిగిన భీకర ఉగ్రదాడి ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఎంత‌టి సంచ‌ల‌నాన్ని సృష్టించిందో తెలిసిందే.

28 మంది భార‌తీయులు ఈ దాడిలో చ‌నిపోయారు. మీ మ‌తం ఏంటి అని అడిగి వెంబ‌డించి చంపేసిన ఆ ముష్క‌రుల అంతు చూసే వ‌ర‌కు భార‌త్ నిద్ర‌పోదు అని ఈ పాటికే ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ మాటిచ్చారు. అయితే.. అస‌లు ప‌హ‌ల్గాంలో భార‌త ప‌ర్యాట‌కులు ఉన్నార‌ని ఉగ్ర‌వాదుల‌కు ఎలా తెలిసింది అనే అంశంపై ఓ విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. వాళ్లు ప‌ర్యాట‌కుల‌ను క‌నుగొనేందుకు త‌మ ఫోనుల్లో ఓ యాప్ ఇన్‌స్టాల్ చేసుకున్నార‌ట‌. ఆ యాప్ పేరు ఆల్పైన్ క్వెస్ట్. ఈ యాప్ ద్వారానే టూరిస్ట్‌ల గురించి తెలుసుకుని వారిని అన్యాయంగా చంపేసార‌ని ఇంటెలిజెన్స్ వ‌ర్గాల‌కు స‌మాచారం అందింది.

గ‌తంలోనూ ఇదే యాప్‌ను ఉప‌యోగించి జమ్మూ అడ‌వుల్లో ఉగ్ర‌మూక‌లు దాడుల‌కు పాల్ప‌డ్డారు. ఈ యాప్‌ను కూడా పాకిస్థానీ ఆర్మీనే అన్ని ప్ర‌ణాళిక‌లు వేసుకుని మ‌న భార‌త ఇంటెలిజెన్స్ వ‌ర్గాల‌కు దొర‌క్కుండా ఉండేలా రూపొందించిందట‌. ఈ యాప్ రూపొందించాక ఉగ్ర‌మూక‌ల‌కు యాప్‌ను ఎలా వాడాలో కూడా కొంత‌కాలం పాటు ట్రైనింగ్ ఇప్పించారు. ఇంకొన్ని రోజుల్లో అమ‌ర్నాథ్ యాత్ర మొద‌లవుతుంది అన‌గా కావాల‌నే భార‌త్‌లో భ‌యాందోళ‌న ప‌రిస్థితుల‌ను క‌లిగించాల‌ని.. ప‌ర్యాట‌కులు జ‌మ్మూ కాశ్మీర్ వైపు రాకుండా చేయాల‌ని ల‌ష్క‌రే తైబా, జైషే మ‌హ్మ‌ద్ ఉగ్ర సంస్థ‌లు ఈ దాడికి పాల్ప‌డ్డాయి. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *