Pahalgam: పో.. మోదీకి చెప్పు ఏం జ‌రిగిందో.. ఉగ్ర‌వాది క‌ర్క‌శ‌త్వం

Pahalgam: జ‌మ్మూ క‌శ్మీర్‌లోని ప‌హ‌ల్గామ్ జిల్లాలో నిన్న ప‌ర్యాట‌కుల‌పై జ‌రిగిన ఉగ్ర‌దాడి సంచ‌ల‌నంగా మారింది. దాదాపు 30 మంది ప‌ర్యాట‌కుల్ని వారి మ‌తం ఏంటో అడిగి మ‌రీ దారుణంగా కాల్పులు జ‌రిపి చంపేసారు. పై ఫోటోలో క‌నిపిస్తున్న వ్య‌క్తి కూడా ప్రాణాలు కోల్పోయాడు. ఇత‌ని పేరు మంజునాథ్‌. క‌ర్ణాట‌క‌లోని శిమోగాకు చెందిన రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారి. ఇత‌ను ఏప్రిల్ 19న త‌న భార్య ప‌ల్లవి, 18 ఏళ్ల కుమారుడితో క‌లిసి ప‌హ‌ల్గామ్‌కు ప‌ర్యట‌న నిమిత్తం వెళ్లారు. నిన్న మంజునాథ్ కొడుకు ఏమీ తిన‌లేద‌ని ఏద‌న్నా ఆహారం తీసుకొస్తాన‌ని ప‌క్క‌నే ఉన్న షాప్‌కి వెళ్లాడు. అదే స‌మ‌యంలో తుపాకీ పేలిన శ‌బ్దం వినిపించింది. ప‌ల్ల‌వి ఆర్మీ అధికారులు తుపాకీ కాల్పులు జ‌రుపుతున్నార‌ని అనుకుంది.

అదే స‌మ‌యంలో జ‌నాలు భ‌యాందోళ‌న‌కు గురై పారిపోతుండ‌గా.. బ‌య‌టికి వ‌చ్చి చూసేస‌రికి మంజునాథ్ ర‌క్త‌పు మ‌డుగుల్లో ప‌డి ఉన్నాడు. ప‌ల్ల‌వి త‌న కుమారుడు ప‌రిగెత్తుకుంటూ అత‌ని మృత‌దేహం వ‌ద్ద‌కు వెళ్ల‌గా త‌ల‌కు బుల్లెట్ గాయం ఉంది. దాంతో ప‌ల్ల‌వి, కుమారుడు హ‌తాశుల‌య్యారు. అక్క‌డే ఉన్న ఉగ్ర‌మూక‌ల‌ను నోటికొచ్చిన‌ట్లు తిడుతూ.. నా భ‌ర్త‌ను చంపేసారు న‌న్ను కూడా చంపండి అని ప‌ల్ల‌వి కేక‌లు వేసింది. ఆమె కుమారుడు కూడా కుక్క‌ల్లారా మ‌మ్మ‌ల్ని కూడా చంపండి అని అరిచాడు. కానీ ఇందుకు వారు ఒప్పుకోలేదు. మేం మిమ్మ‌ల్ని చంపం.. వెళ్లి ఏం జ‌రిగిందో మోదీకి చెప్పుకోండి అని అరుచుకుంటూ వెళ్లిపోయారు.

ఈ దాడి జ‌రిగిన స‌మ‌యంలో ప‌హ‌ల్గాంలో దాదాపు 500 మంది భార‌తీయ ప‌ర్యాట‌కులు ఉన్నారు. ఉగ్ర‌మూక‌లు కేవ‌లం హిందూ మ‌గ‌వారిని మాత్ర‌మే చంపుతూ వారితో పాటు ఉన్న వారిని వ‌దిలేస్తున్న‌ట్లు ప‌ల్ల‌వి తెలిపింది. త‌మ స్వ‌గ్రామానికి తిరిగి వెళ్లాలంటే త‌మ‌తో పాటు త‌మ భ‌ర్త‌ను కూడా హెలికాప్ట‌ర్‌లో పంపించాల‌ని.. ముగ్గురం క‌లిసే వ‌చ్చాం కాబ‌ట్టి క‌లిసే వెళ్తామ‌ని ప‌ల్ల‌వి క‌న్నీరుమున్నీర‌వుతోంది. మంజునాథ్ చ‌నిపోయిన విష‌యం ఇంకా అత‌ని త‌ల్లికి చెప్ప‌లేదు. ఆమె అనారోగ్యంతో ఉన్నార‌ట‌. దాంతో ఆయ‌న‌కు కేవ‌లం గాయాల‌య్యాయ‌ని.. త్వ‌ర‌లో వ‌చ్చేస్తార‌ని చెప్తున్నార‌ట‌. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *