YSRCP next generation leaders: వార‌సులు సిద్ధం

YSRCP next generation leaders: 2029 ఎన్నిక‌ల‌కు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇప్ప‌టినుంచే న‌డుం బిగించింది. ఎప్ప‌టిక‌ప్పుడు కూట‌మి ప్ర‌భుత్వం చేస్తున్న అరాచ‌కాల‌ను ఎండ‌గ‌డుతూ గ్రౌండ్ లెవెల్‌లో యాక్టివ్‌గా ఉంటోంది. సోష‌ల్ మీడియాలోనూ కూట‌మి ప్ర‌భుత్వం చేస్తున్న ఆరోప‌ణ‌లు, విమ‌ర్శ‌ల‌న ఎప్ప‌టిక‌ప్పుడు తిప్పి కొట్టే ప్ర‌య‌త్నం చేస్తోంది. 2029లో మ‌ళ్లీ వ‌చ్చేది మేమే అని ఇప్ప‌టికే పార్టీ అధినేత‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ మాజీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప‌లుమార్లు చెప్పారు. అయితే.. పార్టీకి చెందిన న‌లుగురు కీల‌క నేత‌లు మాత్రం 2029 నాటికి క్రియాశీల రాజ‌కీయాల‌కు స్వ‌స్తి ప‌లికి త‌మ పిల్ల‌ల్ని బ‌రిలోకి దించాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నారు, ఇందుకోసం వార‌సుల‌ను ఇప్ప‌టినుంచే సిద్ధం చేస్తున్నారు. వారెవ‌రంటే..

పేర్ని నాని – పేర్ని కిట్టు

2013లో కాంగ్రెస్ నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన పేర్ని వెంక‌ట్రామ‌య్య‌ అలియాస్ పేర్ని నాని.. రాజ‌కీయాల‌కు స్వ‌స్తి ప‌ల‌క‌నున్న‌ట్లు ఎప్పుడో చెప్పారు. వ‌య‌సు ఆరోగ్యం రిత్యా ఇక త‌న రాజ‌కీయ బాధ్య‌త‌ల‌ను త‌న కుమారుడు పేర్ని కృష్ణ‌మూర్తి అలియాస్ పేర్ని కిట్టుకి అప్ప‌గించాల‌నుకుంటున్నారు. ఇందుకోసం త‌న కుమారుడిని ఇప్ప‌టి నుంచే అన్నీ నేర్పిస్తూ సన్న‌ద్ధం చేస్తున్నారు. మ‌చిలీపట్నంలో పేర్ని నాని కుటుంబానికి మంచి పేరు, రాజ‌కీయ‌పరంగా మంచి ప‌ట్టు ఉన్నాయి.

గ‌త ప్ర‌భుత్వంలో పేర్ని నాని ర‌వాణా శాఖ, స‌మాచార శాఖ‌ మంత్రిగా బాధ్య‌త‌లు చేపట్టారు. 2029 ఎన్నిక‌ల్లో పేర్ని కిట్టుకి టికెట్ వ‌చ్చేలా ఇప్ప‌టి నుంచే అన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు. ప్ర‌స్తుతానికి పేర్ని నాని మాత్రం యాక్టివ్‌గా ప్రెస్ మీట్లు పెడుతూ అందుబాటులో ఉంటున్నారు. ఎన్నిక‌ల స‌మ‌యానికి మాత్రం త‌న కుమారుడికే అన్ని బాధ్య‌త‌లు అప్ప‌గించే సన్నాహాలు చేస్తున్నారు.

భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డి – భూమ‌న అభిన‌య్ రెడ్డి

2019 ఎన్నిక‌ల్లో తిరుప‌తి ఎమ్మెల్యేగా పోటీ చేసి నెగ్గిన భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డి కుమారుడు అభిన‌య్ రెడ్డి 2029 ఎన్నిక‌ల్లో తిరుప‌తి నుంచి పోటీ చేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది. అభినయ్ ఇప్ప‌టికే రాజ‌కీయాల్లో యాక్టివ్‌గా ఉన్నారు. 2021లో తిరుప‌తి డిప్యూటీ మేయర్‌గా కూడా బాధ్య‌త‌లు చేప‌ట్టారు. త‌న తండ్రి అడుగుజాడ‌ల్లో నడుస్తూ త‌న గ్రౌండ్‌ని ప్రిపేర్ చేసుకుంటున్నారు. 

బొత్స స‌త్య‌నారాయ‌ణ‌- అనూష‌

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో అత్యంత సీనియ‌ర్ నాయ‌కుల్లో బొత్స ఒక‌రు. బొబ్బిలి నుంచి ఎంపీగా.. విజ‌య‌న‌గ‌రం జిల్లా చీపురుప‌ల్లి నుంచి ఎమ్మెల్యేగా నెగ్గారు. గ‌త ప్ర‌భుత్వంలో ఆయ‌న‌కు అర్బ‌న్ డెవ‌ల‌ప్‌మెంట్, మున్సిప‌ల్ అడ్మినిస్ట్రేష‌న్ శాఖ‌ను అప్ప‌గించారు. 2029 ఎన్నిక‌ల్లో బొత్స రాజ‌కీయాల‌కు గుడ్‌బై చెప్పి త‌న కూతురు అనూష‌ను దించాల‌ని యోచిస్తున్నారు. ఇప్ప‌టికే ప‌లు కార్య‌క్ర‌మాల‌కు త‌న కుమార్తెనే పంపుతున్నారు. 2029 ఎన్నిక‌ల్లో చీపురుప‌ల్లి నుంచి అనూష పోటీ చేసే అవ‌కాశం ఉంది.

చెవిరెడ్డి భాస్క‌ర్ రెడ్డి- మోహిత్ రెడ్డి

తిరుప‌తికి చెందిన చెవిరెడ్డి భాస్క‌ర్ రెడ్డి కూడా త‌న కుమారుడు మోహిత్ రెడ్డి చేత 2029 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటీ చేయించ‌నున్నారు. నిజానికి గ‌త ఎన్నిక‌ల్లోనే చంద్ర‌గిరి నియోజ‌క‌వ‌ర్గం నుంచి మోహిత్ రెడ్డి పోటీ చేసాడు కానీ తెలుగు దేశం పార్టీ నేత వెంక‌ట మ‌ణి ప్ర‌సాద్ చేతిలో ఓడిపోయారు. అప్ప‌టికి మోహిత్ రెడ్డికి గ్రౌండ్‌లో అంత ప‌ట్టు లేద‌నే టాక్ ఉండేది. అందుకే 2029 ఎన్నిక‌ల్లో ఎలాగైనా గెల‌వాలి అన్న క‌సితో ఆయ‌న మ‌రింత యాక్టివ్‌గా ఉంటున్నారు.

అలా ఆనారోగ్య స‌మ‌స్య‌ల కార‌ణంగానో ఇత‌ర కార‌ణాల చేత‌నో పేరున్న నేత‌లు త‌మ వార‌సుల చేత వ‌చ్చే ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటీ చేసేలా స‌న్నాహాలు చేస్తున్నారు. ఇప్పుడు ఉన్న జ‌న‌రేష‌న్ కూడా యువ‌త‌ను ఎక్కువ ఆక‌ర్షించే విధంగా ఉండాల‌న్న నేప‌థ్యంలో అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కూడా నేత‌ల వార‌సుల‌కు టికెట్లు ఇచ్చేందుకు సుముఖ‌త చూపుతున్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *