Viral: రోడ్డుపై దొరికిన ప‌సికందు.. పెద్ద‌దై ప్రాణం తీసింది

Viral: క‌న్న‌త‌ల్లి భారం అనుకుని రోడ్డు మీద వ‌దిలేసి వెళ్లిపోయింది. కంటేనే త‌ల్లా అనుకుని ఓ మహిళ ఆ మూడు రోజుల ప‌సికందుని ద‌త్త‌త తీసుకుని అల్లారుముద్దుగా పెంచుకుంది. అదే ఆ మ‌హిళ పాలిట య‌మ‌పాశంలా మారింది. అయ్యో పాపం అని రోడ్డుపై దొరికిన బిడ్డ‌కు జీవితాన్ని ఇవ్వాల‌నుకుంటే.. ఇప్పుడు ఆ బిడ్డ పెద్ద‌దై పెంచిన త‌ల్లిని హ‌త‌మార్చింది. ఈ దారుణ ఘ‌ట‌న ఒడిశాలో చోటుచేసుకుంది.

వివ‌రాల్లోకెళితే.. 14 ఏళ్ల క్రితం రాజ‌ల‌క్ష్మి భ‌ర్త చ‌నిపోయారు. అప్ప‌టికే ఆమెకు పిల్ల‌లు లేరు. భ‌ర్త చ‌నిపోవ‌డంతో రెండో పెళ్లి చేసుకోవ‌డం ఇష్టం లేక అలాగే ఉండిపోయింది. ఈ నేప‌థ్యంలో రాజ‌ల‌క్ష్మి మార్కెట్‌కు వెళ్తుండ‌గా ఓ ప‌సికందు ఏడుపు వినిపించింది. వెతికి చూడ‌గా.. మూడు రోజుల బిడ్డ రోడ్డు ప‌క్క‌న కనిపించింది. వెంట‌నే ఆ బిడ్డ‌ను పోలీసుల వ‌ద్ద‌కు తీసుకెళ్లి త‌న‌కు భ‌ర్త, పిల్ల‌లు లేర‌ని తాను పెంచుకోవాల‌నుకుంటున్నాన‌ని చెప్పింది. ఇందుకు వారు కూడా ఒప్పుకోవ‌డంతో ఆ బిడ్డ‌ను రాజ‌ల‌క్ష్మికే అప్ప‌గించారు. ఎంతో అల్లారుముద్దుగా పెంచుకుంది. త‌న బిడ్డ బాగా చ‌దువుకోవాల‌న్న ఉద్దేశంతో ఎనిమిదో త‌ర‌గ‌తిలో కేంద్రీయ విద్యాల‌యంలో చేర్పించేందుకు వేరే జిల్లాకు వెళ్లి ఇల్లు అద్దెకు తీసుకుంది. ఇప్పుడు ఆ పాప వ‌య‌సు 13 సంవ‌త్స‌రాలు.

చ‌క్క‌గా చ‌దువుకుంటోంది అనుకుంటున్న సమ‌యంలో ఇన్‌స్టాగ్రామ్‌లో ఇద్ద‌రు అబ్బాయిల‌తో ప‌రిచ‌యం పెంచుకుంది. వారిలో ఒక‌రి వ‌య‌సు 26, మరొక‌రికి 23. పైగా ఆ ఇద్ద‌రితోనూ ప్రేమ‌లో ప‌డింది. ఈ విష‌యం రాజ‌ల‌క్ష్మికి తెలీడంతో త‌ప్ప‌మ్మా ముందు బాగా చ‌దువుకో అని న‌చ్చ‌జెప్పింది. అది ఆ పాప‌కు న‌చ్చ‌లేదు. ఈ విష‌యాన్ని త‌న ప్రియుళ్ల‌కు చెబితే.. అందులో ఓ దుర్మార్గుడు దారుణ‌మైన ప్లాన్ వేసాడు. రాజ‌లక్ష్మిని చంపేస్తే త‌మ ప్రేమ‌కు అడ్డు ఉండ‌ద‌ని.. పైగా ఆమె ఆస్తి కూడా ద‌క్కుతుంద‌ని చెప్పాడు. అత‌ని చెప్పుడు మాట‌లు విన్న ఆ అమ్మాయి ప్లాన్ ప్ర‌కారం రాజ‌ల‌క్ష్మికి నిద్ర‌మాత్ర‌లు క‌లిపిన పాలు తాగించింది. ఆమె అప‌స్మార‌క స్థితిలోకి వెళ్లగానే బంధువుల‌కు ఫోన్ చేసి హాస్పిట‌ల్‌కు తీసుకెళ్లేలా చేసింది. అప్ప‌టికే రాజ‌ల‌క్ష్మి చ‌నిపోయింద‌ని వైద్యులు చెప్పారు. వైద్యులు పోస్ట్ మార్టం చేయ‌లేదు. దాంతో అంతా హార్ట్ ఎటాక్‌తో చ‌నిపోయింద‌ని అనుకున్నారు.

రెండు వారాలు గ‌డిచాక రాజ‌ల‌క్ష్మి సోద‌రుడికి ఇంట్లో ఓ ఫోన్ దొరికింది. అది రాజ‌ల‌క్ష్మి కూతురిదే. ఫోన్ లాక్ చేసి లేక‌పోవ‌డంతో ఇన్‌స్టాగ్రామ్‌లో మ‌ర్డ‌ర్ ప్లాన్ గురించి జ‌రిగిన చాటింగ్‌లు చూసి కంగుతిన్నాడు. వెంట‌నే పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డంతో అస‌లు విష‌యం బ‌య‌ట‌ప‌డింది. మైన‌ర్ అమ్మాయితో పాటు ఆ ఇద్ద‌రు అబ్బాయిల‌ను పోలీసులు అరెస్ట్ చేసి కేసు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *