Garikapati Narasimha Rao వైకుంఠ ఏకాద‌శి రోజు ద‌ర్శ‌నం అవ‌స‌ర‌మా?

Garikapati Narasimha Rao వైకుంఠ ఏకాద‌శి రోజున శ్రీవారిని ఉత్త‌ర ద్వారం నుంచి ద‌ర్శించుకునేందుకు ల‌క్ష‌లాది మంది భ‌క్తులు నిన్న తిరుప‌తికి చేరుకోవ‌డం.. నిన్న రాత్రి జ‌రిగిన తొక్కిస‌లాట‌లో ఆరుగురు దుర్మ‌ర‌ణం చెంద‌డం ఎంతో క‌ల‌చివేస్తోంది. ఈ ఘ‌ట‌న‌పై ప్ర‌ముఖ ప్ర‌వ‌చ‌న‌క‌ర్త గ‌రిక‌పాటి న‌ర‌సింహారావు స్పందించారు. వైకుంఠ ఏకాద‌శి రోజేనే శ్రీవారిని ద‌ర్శించుకోవాలా? అలా ద‌ర్శించుకోకపోతే విష్ణుమూర్తికి మీపై కోపం వ‌స్తుందా అని ఆయ‌న భ‌క్తుల‌ను ప్ర‌శ్నించారు.

“” ముక్కోటి ఏకాద‌శి వ‌చ్చేస్తోంది. వెంట‌నే అదే రోజున శ్రీవారిని ద‌ర్శించేసుకోవాలి. ఆ రోజున దేశంలోని ఏ ఆల‌యంలో చూసినా భ‌క్తుల తాకిడే. ఎక్క‌డా కూడా ఖాళీ ఉండ‌దు. పైగా ఆరోజున మ‌హా పుణ్యం.. చేసిన పాపాల‌న్నీ పోతాయి. అంటే అన్ని పాపాలు చేసారా? అస‌లు ముందు ఇలాంటి వాటిని పాపాత్ములుగా గుర్తించాలి. ముక్కోటి ఏకాద‌శి నాడు ప‌నిగ‌ట్టుకుని ద‌ర్శ‌నానికి వెళ్తున్నాడంటే ఇంత‌టి పాపాత్ముడ మ‌రొక‌డు లేడు. పాపం చేయ‌ని వాడు అస‌లు వెళ్లాల్సిన అవ‌స‌రం లేదు. ఎవ‌రి ఇంట్లో వాళ్లు ఉంటారు. నేను ఏ పుణ్య‌క్షేత్రానికి, ఏ పుణ్య తీర్థానికి, ఏ పుణ్య తిథికి అస్స‌లు వెళ్ల‌ను. ఎందుకంటే నేనేమీ పాపం చేయ‌లేదు. చేయ‌ను. అలాంటప్పుడు నాకు ఏకాద‌శి రోజు వెళ్లి ద‌ర్శ‌నం చేసుకునే అవ‌స‌ర‌మే లేదు. ఈ పిచ్చి వ‌దులుకోండి ద‌య‌చేసి. ఎందుకంటే ప్ర‌మాదాలు అక్క‌డే జ‌రుగుతున్నాయి. ఒకే క్షేత్రం.. ఒకే రోజు.. ఒకే స‌మ‌యం.. గోదావ‌రి పుష్క‌రాలు 30 మంది ఎందుకు చ‌నిపోయారో అంద‌రికీ తెలుసు.

అదే రోజు అదే ముహూర్తం.. అలాగే జ‌రుగుతాయి. ఏవిటా పిచ్చి? ఏవిటా వెర్రి? ముక్కోటి ఏకాద‌శి నాడు ద‌ర్శ‌నం అవ‌స‌ర‌మా? రెండు మూడు రోజుల త‌ర్వాత వెళ్లండి. అదే రోజు వెళ్ల‌క‌పోతే విష్ణుమూర్తి మీపై కోప‌డ‌తాడా? ఉత్త‌ర ద్వారం నుంచి వెళ్లాలి.. త‌లుపులు బ‌ద్ధ‌లైపోవాలి అనుకుంటే ఇదిగో ఇలాంటి సంఘ‌ట‌న‌లే జ‌రుగుతాయి. బాగా మ‌న‌సు నిండా.. బుర్ర నిండా మ‌ట్టి పెట్టేసుకుని అదే రోజున ద‌ర్శ‌నం చేసుకోవాలి అనుకుంటే ప్ర‌మాదాలే జ‌రుగుతాయి. చివ‌రికి ప్ర‌మాదం వ‌ల్ల హిందూ ధ‌ర్మానికి నష్టం క‌లుగుతోంది. దేవుడిపై దుష్ప్ర‌చారం జరుగుతోంది. ఇత‌ర మ‌తాల వారు అలుసుగా తీసుకుంటున్నారు. మీ మతంలో ఏం జ‌రుగుతోందో చూడండి అని అడుగుతుంటే వారికి స‌మాధానాలు చెప్ప‌లేక‌పోతున్నాం. పుణ్య‌క్షేత్రాలు, తీర్థాలు, తిథులు.. ఇవేమీ ముఖ్యం కాదు. శ‌రీరాన్ని మించిన క్షేత్రం లేదు.. మ‌న‌సును మించిన తీర్థం లేదు. స‌త్ప్ర‌వ‌ర్త‌న క‌లిగి ఉంటే నీకు నువ్వే పుణ్య‌క్షేత్రం. అటువంటి మాన‌వ‌త్వాన్ని నింప‌డానికి సాటి మ‌నుషుల ప‌ట్ల సానుభూతితో ప్ర‌వ‌ర్తించ‌డానికి ప‌రోప‌కార‌మే జీవించే బ‌త‌క‌డానికి నా ప్ర‌సంగం ఏ మాత్రం ఉప‌యోగ‌ప‌డినా నేను ధ‌న్యుడిని. నాకు ఈ నాలుగు మాట‌లు నేర్పిన మా అమ్మ ధ‌న్యురాలు “” అని వెల్ల‌డించారు.  (Garikapati Narasimha Rao)

అయితే.. ఆయ‌న నిన్న తిరుప‌తిలో జ‌రిగిన తొక్కిస‌లాట ఘ‌ట‌న గురించి ఈ విధంగా మాట్లాడారా..లేక స‌హ‌జంగా ఇలాంటి స‌మ‌యాల్లోనే ప్ర‌మాదాలు జ‌రుగుతాయ‌ని ఊహించి ఇంత‌కుముందే ఇలాంటి వ్యాఖ్య‌లు చేసారా అనేది తెలియాల్సి ఉంది. ఏది ఏమైన‌ప్ప‌టికీ గ‌రిక‌పాటి చెప్పింది ముమ్మాటికీ నిజం అంటూ భ‌క్తులు కూడా కామెంట్స్ పెడుతున్నారు. నిన్న జ‌రిగిన ఘ‌ట‌న‌తోనైనా మ‌నుషుల్లో మార్పు వ‌స్తుంద‌ని.. ప్ర‌మాదం జ‌రిగిపోయాక ఎవ‌ర్ని నిందించి ఏమీ లాభం లేదని అంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *