Tirumala Stampede: అదే శాపంగా మారిందా?

Tirumala Stampede ఎంత దారుణం.. ఎవ్వ‌రూ ఊహించి కూడా ఉండ‌రు. 2025 సంవ‌త్స‌రంలో ఎప్ప‌టి మాదిరిగానే ఈసారి కూడా శ్రీవారిని వైకుంఠ ఏకాద‌శి నాడు ఉత్త‌ర ద్వారం నుంచి ద‌ర్శించుకోవాల‌ని అనుకున్నారు పాపం ఆ భ‌క్తులు.  వైకుంఠ ద్వార ద‌ర్శ‌నానికి టికెట్లు ఇస్తున్నాం అని తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం ఛైర్మ‌న్ బీఆర్ నాయుడు స్వ‌యంగా ప్ర‌కటించ‌డంతో హైద‌రాబాద్, త‌మిళ‌నాడు, విశాఖ ప‌ట్నం, క‌ర్ణాట‌క‌కు చెందిన భక్తులు తండోప‌తండాలుగా బారులు తీరారు. తిరుప‌తిలో దాదాపు 8 కేంద్రాల వ‌ద్ద స్లాటెడ్ ద‌ర్శ‌న టోకెన్ల‌ను జారీ చేసేందుకు తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం నిర్ణ‌యించింది. గురువారం ఉద‌యం 5 గంట‌ల‌కు ల‌క్షా 20వేల టోకెన్లు జారీ చేస్తామ‌ని ప్ర‌క‌టించ‌డంతో ల‌క్ష‌లాది మంది భారీ సంఖ్య‌లో భ‌క్తులు తిరుప‌తికి చేరుకున్నారు. బుధ‌వారం రాత్రి నుంచే టోకెన్ల కోసం ప‌డిగాపులు కాసారు.

నిన్న రాత్రి స‌మ‌యంలో బైరాగిప‌ట్టెడ ప్రాంతంలోని రామానాయుడు స్కూల్ వ‌ద్ద తొక్కిస‌లాట జ‌రిగింది. దాంతో ఉద‌యం నుంచి భ‌క్తులు భారీగా త‌ర‌లి వ‌స్తుండ‌డంతో వారిని స్థానిక ప‌ద్మావ‌తి పార్కులోకి అనుమ‌తించి అక్క‌డ వేచి ఉండాల‌ని పోలీసులు చెప్పారు. ఇద‌లా ఉండ‌గా.. నిన్న రాత్రి 8:15 గంట‌ల స‌మ‌యంలో ఓ వ్య‌క్తి అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యాడు. అత‌నికి వైద్య సేవ‌లు అందించాలంటే గేటు తీయాల్సిందే. ఇక చేసేదేమీ లేక అక్క‌డే ఉన్న డీఎస్పీ ఒక‌రు కేవ‌లం అత‌న్ని చికిత్స‌కు త‌ర‌లించేందుకు మాత్ర‌మే గేటు తీసారు. టోకెన్ల కోసం గేట్లు తీసార‌నుకుని ఒక్క‌సారిగా అంద‌రూ ఉరుకులు ప‌రుగులు తీసారు. అలా తొక్కిస‌లాట జ‌రిగింది. ఈ ఘ‌ట‌న‌లో మొత్తం ఐదుగురు ఆడ‌వాళ్లు ఒక వృద్ధుడు చ‌నిపోయాడు. మ‌రో 38 మంది తీవ్రంగా గాయాల‌య్యాయి. వారిని స్థానిక రుయా, స్విమ్స్ హాస్పిటల్స్‌కి త‌ర‌లించారు.

YSRCP ఏమంటోంది?

Tirumala Stampede: ఎప్పుడెప్పుడు అధికారంలో ఉన్న ప్ర‌భుత్వంపై నింద‌లు వేద్దామా? ఎక్క‌డ ఏ త‌ప్పు దొరికితే ప‌ట్టుకుని ఊదిపారేద్దామా అని ప్ర‌తి ప్ర‌తిప‌క్ష పార్టీ ఎదురుచూస్తుంటుంది. అందులోనూ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప్ర‌స్తుతం ప్ర‌తిప‌క్షంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇలాంటి సంఘ‌ట‌న‌లు జ‌రిగిన‌ప్పుడు అస్స‌లు వ‌దిలిపెట్ట‌దు. తిరుప‌తిలో ఇంత ఘోర ఘ‌ట‌న జ‌రిగిందన‌గానే.. ఈరోజు ఉద‌యం నుంచి ఒక్కో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత మీడియా ముందుకు వచ్చి కూట‌మి ప్ర‌భుత్వాన్ని ఏకిపారేస్తున్నారు.  ముందుగా వైఎస్సార్ కాంగ్రెస్ ప్ర‌భుత్వం అధికారంలో ఉన్న‌ప్పుడు తితిదే ఛైర్మ‌న్‌గా ఉన్న భూమన క‌రుణాక‌ర్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టారు. ఇంత వ‌ర‌కు చంద్ర‌బాబు నాయుడు అండ్ కో త‌మ‌పై తమ పార్టీపై త‌ప్పుడు ప్ర‌చారాలు చేయ‌డం.. చేయ‌ని త‌ప్పుకు బాధ్యులను చేసి వేధించ‌డం త‌ప్ప ఏమీ చేయ‌లేద‌ని.. ఈరోజు తిరుప‌తిలో జ‌రిగిన త‌ప్పిందానికి క‌చ్చితంగా కూట‌మి ప్ర‌భుత్వం బాధ్య‌త తీసుకోవాల‌ని అన్నారు.

ఆ త‌ప్పే శాపంగా మారింది

తిరుప‌తి ఘ‌ట‌న‌పై వైఎస్సార్ కాంగ్రెస్ నేత గుడివాడ అమ‌ర్నాథ్ మాట్లాడారు. చంద్ర‌బాబు నాయుడు హ‌యాంలో తిరుప‌తిలో వెయ్యి కాళ్ల మండ‌పం ఉంటే.. దానిని ఆయ‌న అప్ప‌ట్లో కూల్చేసార‌ని.. అది చాలా త‌ప్ప‌ని చిన‌జీయ‌రు స్వామి కూడా బాధ‌ప‌డ్డార‌ని అన్నారు. అయినా చంద్ర‌బాబు వినిపించుకోకుండా కూల్చేయ‌డంతోనే అలిపిరిలో ఆయ‌న‌పై బాంబుల దాడి జ‌రిగింద‌ని చెప్పారు. మొన్న తిరుమ‌ల ల‌డ్డు విష‌యంలో లేనిపోని ఓవ‌రాక్ష‌న్ చేసి రాజ‌కీయ రంగు పూసి ప్ర‌జ‌ల నుంచి నాలుగు మార్కులు కొట్టేద్దామ‌న్న ఉద్దేశంతో చేసిన త‌ప్పుడ ప్ర‌చారాల వ‌ల్లే ఈరోజు అది శాపంగా మారి ఆరుగురిని బ‌లితీసుకుందేమో అని అభిప్రాయ‌ప‌డ్డారు. చెప్పాల్సిందంతా చెప్పేసి.. ఇలా తాను అనుకోవ‌డం లేద‌ని బ‌హుశా ప్ర‌జ‌లు అనుకుంటున్నారేమో అని త‌ప్పించుకున్నారు.

చంద్ర‌బాబు లెగ్ మ‌హిమ‌

చంద్ర‌బాబు నాయుడు రాష్ట్రానికి ముఖ్య‌మంత్రి అయ్యాడు అంటేనే ఆ ఐర‌న్ లెగ్ వ‌ల్ల ఎలాంటి ఘోరాలు జ‌రుగుతాయో అని భ‌య‌ప‌డుతూ బ‌త‌కాల్సి వ‌స్తోంద‌ని అన్నారు మాజీ మంత్రి రోజా.  ఆయ‌న సీఎం అయ్యాకే విజ‌య‌వాడ‌లో వ‌ర‌ద‌లు రావ‌డం… ఇళ్ల‌ను ముంచెత్త‌డం వంటి ఘ‌ట‌న‌లు జ‌రిగాయి.. పుష్క‌రాల స‌మ‌యంలో త‌నకున్న ప‌బ్లిసిటీ పిచ్చితో మీడియాని ర‌ప్పించేసుకుని ఫోటోల‌కు పోజులివ్వాల‌న్న ఉద్దేశంతో చేసిన హ‌డావిడి వ‌ల్ల దాదాపు 20 మంది దాకా చ‌నిపోయార‌ని అన్నారు. ఇప్పుడు అధికారంలోకి వ‌చ్చి ఇంకొన్ని నెల‌ల్లో ఏడాది కావొస్తోందన‌గా తిరుప‌తి చ‌రిత్ర‌లోనే ఎన్న‌డూ జ‌ర‌గ‌న‌టువంటి తొక్కిస‌లాట జ‌రిగి ఆరుగురు ప్రాణాలు కోల్పోయారని అన్నారు.

ఇంత జ‌రిగితే నిర్ల‌క్ష్యంగా జ‌రిగిన వారిపై యాక్ష‌న్ తీసుకోకుండా ఇది ప్ర‌మ‌ద‌వ‌శాత్తు జ‌రిగిన ఘ‌ట‌న మాత్ర‌మే అని పోలీసుల‌కు ఫిర్యాదు చేసార‌ని మండిప‌డ్డారు. చంద్ర‌బాబు నాయుడు అధికారంలో ఉన్న‌ప్పుడు ఏద‌న్నా మంచి జ‌రిగితే అదంతా తామే చేసామ‌ని చెప్పుకుంటార‌ని.. ఇలాంటి ఘ‌ట‌న‌లు జ‌రిగితే మాత్రం దైవేచ్ఛ‌.. ప్ర‌మాద‌వ‌శాత్తు జ‌రిగింద‌ని భుజాలు దులుపుకుని వెళ్లిపోతార‌ని అన్నారు. అదే వైఎఎస్సార్ కాంగ్రెస్ అధికారంలో ఉన్న‌ప్పుడు ఇలాంటి జ‌రిగితే అది ముమ్మాటికీ ప్ర‌భుత్వ వైఫ‌ల్య‌మే అని ఈపాటికి ఊద‌ర‌గొట్టేసేవార‌ని అన్నారు. ఒక‌రేమో డీఎస్పీ గేటు తీసాడ‌ని అంటున్నారని.. మ‌రోప‌క్క తితిదే ఛైర్మ‌న్ బీఆర్ నాయుడు తాను ఎస్పీకి చెప్పాను అంటున్నాడ‌ని.. మ‌రి ఎస్పీ చెప్తేనే డీఎస్పీ గేటు తీస్తాడు కానీ డీఎస్పీ సొంత నిర్ణ‌యం తీసుకోడు క‌దా అని ప్ర‌శ్నించారు. ఎస్పీ మీద ఫిర్యాదు చేయ‌కుండా డీఎస్పీపై ఎలా ఫిర్యాదు చేస్తార‌ని నిల‌దీసారు. ఇంకా నయం పోలీస్ కానిస్టేబుల్‌పై తోసేయ‌లేదు అని చుర‌క‌లంటించారు. ఇప్ప‌టికైనా బాధ్య‌త వ‌హించి క్ష‌త‌గాత్రుల‌ను ఆదుకుని.. మృతుల కుటుంబాల‌కు కాస్త ఎక్కువ పారితోషికం ఇవ్వాల‌ని ఈ సంద‌ర్భంగా రోజా డిమాండ్ చేసారు. (Tirumala Stampede)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *