India vs Pakistan: అది 1998. అదే సంవత్సరంలో పాకిస్థాన్ న్యూక్లియర్ పవర్‌ను దక్కించుకుంది. అదే సమయంలో బెలూచిస్థాన్‌లోని చగాయ్ హిల్స్ ప్రాంతంలో ఐదు న్యూక్లియర్ పరీక్షలు నిర్వహించగానే పాకిస్థాన్‌కు న్యూక్లియర్ పవర్ దక్కేసింది. ఇప్పుడు ఈ విషయం ఎందుకు ట్రెండ్ అవుతోందంటే.. ఎప్పుడైతే పాకిస్థాన్ అణు పరీక్షలు నిర్వహించడం మొదలుపెట్టిందో అప్పుడే ఇజ్రాయెల్ దాని అంతు చూడాలనుకుంది. పాకిస్థాన్‌లో ఎలాంటి న్యూక్లియర్ కేంద్రాలు లేకుండా మొత్తం లేపేద్దాం అని నిర్ణయించింది. కానీ అప్పట్లో అమెరికా అడ్డుపడింది. పాక్ అణు కేంద్రాలపై కన్ను కూడా పడటానికి వీల్లేదు అనడంతో ఇజ్రాయెల్ తన ప్లాన్స్ విరమించుకుంది. కట్ చేస్తే.. ఇప్పుడు అణు ప్రయోగాలు, కేంద్రాల విషయంలో పాకిస్థాన్ భారత్‌ను దాటేసింది. ఇప్పుడు పాకిస్థాన్ దగ్గర 170 క్షిపణులు ఉన్నాయి. ఇవి ఈ సంవత్సరం చివరి నాటికి 200కు పెరగనున్నాయి. మరో పక్క ఈ న్యూక్లియర్ వార్‌హెడ్స్ విషయంలో మన భారత్ పాకిస్థాన్ కంటే వెనుకబడి ఉంది. ప్రస్తుతం మన దగ్గర 164 న్యూక్లియర్ వార్‌హెడ్స్ మాత్రమే ఉన్నాయి.
పాక్ సక్సెస్
ప్రాజెక్ట్ 706 పేరిట 1974లో పాకిస్థాన్ ప్రధాని జుల్ఫికర్ అలీ భుట్టో క్షిపణి పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. అప్పట్లో దివంగత ప్రధాని ఇందిరా గాంధీ నేతృత్వంలో భారత్ అణు ప్రయోగాలు చేసి సక్సెస్ అవ్వడంతో.. మేం కూడా చేసుకుంటాం అని పాకిస్థాన్ కూడా అణు ప్రయోగాలు చేయడం మొదలుపెట్టి సక్సెస్ అయ్యింది. 1980ల్లోనే అణు పరీక్షలకు కావాల్సిన అన్ని సధుపాయాలను, టెక్నాలజీని పాకిస్థాన్ సంపాదించుకుంది. అలా 1998 మేలో పాకిస్థాన్ అధికారికంగా అణు ప్రయోగాలు చేసే దేశంగా పేరొందింది. (India vs Pakistan)
ఇజ్రాయెల్ అభద్రతాభావం
అదే సమయంలో ఇజ్రాయల్ ఇరాక్‌కి చెందిన ఓ అణు కేంద్రంపై మెరుపుదాడి చేసి కూల్చేసింది. అప్పట్లో ఇజ్రాయెల్ ఏ ముస్లిం దేశాలు న్యూక్లియర్ సైట్స్ నిర్మిస్తున్నాయో తెలుసుకుని మరీ తమ దేశంపై ఎక్కడ తిరగబడతారో అని ముందు జాగ్రత్తతో వాటిని కూల్చివేసేది. అప్పట్లో సద్దాం హుస్సేన్ నేతృత్వంలో ఇరాక్‌లో అణు కేంద్రం నిర్మించిందని ఏ క్షణమైనా ఇజ్రాయెల్‌పై అణు దాడులు చేయొచ్చని భావించిన ఇజ్రాయెల్ ఆ న్యూక్లియర్ సైట్‌ను కూల్చేసింది. ఇజ్రాయెల్ పాలెస్తీనా మధ్య జరుగుతున్న వివాదం నేపథ్యంలో దాదాపు అన్ని ముస్లిం దేశాలు పాలెస్తీనాకే మద్దతు పలికేవి. దాంతో ఇజ్రాయెల్‌కు ముస్లిం దేశాలంటే ఒళ్లుమంట. అదే విధంగా ఎక్కడ తమ న్యూక్లియర్ సైట్లపై ఇజ్రాయెల్ కన్ను పడుతుందో అని పాకిస్థాన్ భయపడేది.
అమెరికా హెచ్చరిక
1979లోనే పాకిస్థాన్ న్యూక్లియర్ విషయంలో దూసుకెళ్లాలని కలలు కంటుంటే ఇజ్రాయెల్ వేసేద్దామనుకుంది. కానీ అప్పట్లో అగ్రరాజ్యం అయిన అమెరికా పాకిస్థాన్‌కు మిత్ర దేశం కావడంతో.. అప్పటి అమెరికా అధ్యక్షుడు రోనాల్డ్ రీగన్ ఇజ్రాయెల్‌ను బెదిరించాడు. పాక్‌పై ఇజ్రాయల్ కన్ను పడటానికి వీల్లేదని సూటిగా వార్నింగ్ ఇచ్చాడు. 1998లో పాకిస్థాన్ అణు ప్రయోగాలు చేసినప్పుడు ఎక్కడ ఇజ్రాయెల్ భారత్ సాయంతో తమ న్యూక్లియర్ సైట్లను నిర్మూలించేస్తుందో అని పాక్ తెగ వణికిపోయేది. ఓసారి పాకిస్థాన్ రాడార్లు తమ అణు కేంద్రాల్లో ఇజ్రాయెల్‌కి చెందిన F-16sలను గుర్తించాయి. దాంతో పాక్ భయం మరింత పెరిగింది. పాకిస్థాన్ బాధను చూసి భరించలేక.. మరోపక్క అమెరికా అధ్యక్షుడు వార్నింగ్ ఇవ్వడంతో ఇజ్రాయెల్ 1998లో ఓ ప్రకటన విడుదల చేసింది. ఇజ్రాయెల్ పాకిస్థాన్ న్యూక్లియర్ కేంద్రాలపై ఎలాంటి దాడులు చేయబోదని మాటిచ్చింది. ఆ తర్వాత ఈ అంశంపై ఐక్యరాజ్య సమితి వేదికగా పాకిస్థాన్, ఇజ్రాయెల్ డిప్లొమాట్లు కలిసి చర్చించుకున్నారు. అలా అమెరికా పుణ్యమా అని పాకిస్థాన్ అప్పట్లో తప్పించుకుని.. ఇప్పుడు అణు ప్రయోగాల విషయంలో భారత్‌ను మించిపోవాలని చూస్తోంది. (India vs Pakistan)