HHVM Success Meet: పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్ నటించిన హరిహర వీరమల్లు దాదాపు ఐదేళ్ల పాటు సెట్స్‌పై ఉండి ఈరోజే థియేటర్ ముఖం చూసింది. తొలి రోజే మంచి వసూళ్లు రాబట్టింది బ్లాక్ బస్టర్ అంటూ చిత్రబృందం సక్సెస్ మీట్ నిర్వహించింది. ఎప్పుడూ లేనిది పవన్ ఈ సినిమాకు ప్రమోషన్స్ చేయడమే కాదు.. సక్సెస్ మీట్‌కు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన సినిమా కోసం ఎంత కష్టపడ్డారో వివరించారు. తనకు ఇలా వేడుకలకు, ప్రమోషన్లకు అటెండ్ అవ్వడం అలవాటు లేదని.. కానీ ఈ సినిమాలో సనాతన ధర్మం గురించి చెప్పిన విధానాన్ని నలుగురికీ చెప్పాలన్న ఉద్దేశం నచ్చింది కాబట్టి సినిమా పరంగా అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకున్నానని తెలిపారు.
పవన్ మాట్లాడుతుండగా హీరోయిన్ నిధి అగర్వాల్‌కు ఆయనకు మధ్య ఆసక్తికర సన్నివేశం జరిగింది. తనకు కలెక్షన్ల పట్ల పెద్దగా ఇంట్రెస్ట్ లేదని చెప్తూ.. ఈ సినిమా కలెక్షన్ల గురించి ఏదో మాట్లాడబోయి ఆగిపోయారు. అప్పుడు వెనకే ఉన్న నిధి కలెక్షన్ల విషయంలో ఏదో నెంబర్ చెప్పడంతో.. మీరు కలెక్షన్లు ట్రాక్ చేస్తూ కూర్చున్నారా.. నటన మానేసి అంటూ సెటైర్ వేసారు. దాంతో నిధి సిగ్గు పడుతూ ఓ చిరునవ్వు విసిరింది.
ఆ తర్వాత మీడియా మధ్యలో నిలబడి ఉన్న ఓ అమ్మాయిని పవన్ ప్రత్యేకంగా పలకరించి… మీరే కదమ్మా ఓ పాత్రలో నటించారు.. జట్టు పట్టుకుని లాగినప్పుడు బాగా నొప్పి కలిగి ఉంటుంది కదా అని అడిగారు. ఆమెను స్టేజ్‌పైకి పిలవగా.. తను వెళ్లి నేరుగా పవన్ కాళ్లు పట్టుకుంది. దాంతో పవన్ ఎప్పుడూ ఇలా కాళ్లు పట్టుకోకూడదు అని స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. ఆ తర్వాత ఆమె ఒక ఫోటో తీయించుకుంటానని చెప్పి చెయ్యి పట్టుకోవచ్చా అని అడిగింది. ఇందుకు పవన్ సిగ్గుపడుతూ వద్దులే అన్నట్లుగా చూసినప్పటికీ ఆమె పవన్ చెయ్యి పట్టుకోవడంతో పవన్ ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్‌కు అక్కడున్నవారంతా పగలబడి నవ్వుకున్నారు. నిధిగారు.. ఈమె మన సినిమాలో నటించారండి అందుకే ఇక్కడికి వచ్చారు అంటూ పవన్ నవ్వులు పూయించారు.