Mark Shankar: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిన్నకుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ అగ్నిప్రమాదంలో చిక్కుకోవడంతో అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. ఎనిమిదేళ్ల మార్క్ ప్రస్తుతం సింగపూర్‌లో ఉంటూ విద్యనభ్యసిస్తున్నాడు. వేసవి సెలవులు కావడంతో సింగపూర్‌లోని 278 రివర్ వ్యాలీ రోడ్డులో ఉన్న టొమాటో కుకింగ్ స్కూల్‌లో కుకింగ్ క్లాసెస్ తీసుకుంటున్నాడట. ఇప్పుడు అగ్ని ప్రమాదం జరిగింది కూడా ఈ స్కూల్‌లోనే. ఇక్కడ పిల్లల్ని కుకింగ్ క్లాసెస్‌తో పాటు హాలిడే క్యాంప్స్‌కి కూడా తీసుకొస్తూ ఉంటారట.
ఈ నేపథ్యంలో సింగపూర్ కాలమానం ప్రకారం ఉదయం 9:45 గంటలకు స్కూల్‌లోని రెండు, మూడు అంతస్తుల్లో మంటలు వ్యాపించాయి. సైరన్ మోగడంతో సింగపూర్ సివిల్ డిఫెన్స్ ఫోర్స్ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలు అదుపు చేసారు. ఆ సమయంలో స్కూల్‌లో 15 మంది పిల్లలు ఉన్నారట. వారిలో మార్క్ శంకర్ ఒకరు. ఈ ఘటనలో ఒక బాలిక మృతిచెందింది. మార్క్ చేతులకు, కాళ్లకు గాయాలు కావడంతో పాటు.. దట్టమైన పొగ కారణంగా శ్వాస తీసుకోవడం కూడా ఇబ్బందిగా మారింది. ప్రస్తుతం స్థానిక హాస్పిటల్‌కు తరలించి పిల్లలకు వైద్యం అందిస్తున్నారు.
పవన్ తాను షెడ్యూల్ చేసుకున్న కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుని సింగపూర్ బయలుదేరారు. పిల్లాడి పరిస్థితిని ఎప్పటికప్పుడు ఆరా తీస్తూనే ఉన్నారు. అయితే.. 8 ఏళ్ల పిల్లాడికి కుకింగ్ క్లాసెస్ ఎందుకు అనే అభిప్రాయాలు వెలువడుతున్నాయి. ఏదో టైం పాస్ కోసం చేర్పించినప్పటికీ.. ఇంకా చాలానే యాక్టివిటీస్ ఉన్నాయి కదా కుకింగ్ క్లాసెస్ ఎందుకు అనే వాదనలు వినిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ మార్క్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిద్దాం.