Ayyappa Vavar Swamy: ఎవ‌రీ వావ‌ర్ స్వామి.. అయ్య‌ప్ప‌కు సంబంధ‌మేంటి?

Ayyappa Vavar Swamy సినీ న‌టుడు రామ్‌చ‌ర‌ణ్ (Ram Charan) అయ్య‌ప్ప మాల వేసుకుని క‌డ‌ప‌లోని అజ్మేర్ ద‌ర్గాకు వెళ్ల‌డం ఎంత‌టి తీవ్ర దుమారానికి దారి తీసిందో అంద‌రికీ తెలిసిందే. అయ్య‌ప్ప మాల వేసుకుని మ‌సీదుకి ఎలా వెళ్తారంటూ ప‌లువురు హిందువులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ సోష‌ల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. అయితే.. అయ్య‌ప్ప‌కు వావ‌ర్ స్వామి అనే ఓ స్నేహితుడు ఉండేవాడ‌ని.. అత‌ను మ‌హ‌మ్మ‌దీయుడ‌ని కూడా ఓ క‌థ ప్ర‌చారంలో ఉంది. అస‌లు ఏంటీ వావ‌ర్ స్వామి క‌థ‌? అయ్య‌ప్ప స్వామికి ఆయ‌న‌కు ఏంటి సంబంధం? తెలుసుకుందాం.

ప్ర‌పంచంలోనే అత్యంత ప్ర‌సిద్ధి చెందిన ప్ర‌దేశాల‌లో శ‌బ‌రిమ‌ల ఒక‌టి. కేర‌ళ‌లో ఉన్న ఈ పుణ్య క్షేత్రంలో అయ్యప్ప స్వామి వెలిసారు. శ‌బ‌రిమ‌ల‌లో కొలువై ఉన్న అయ్య‌ప్ప స్వామి క్షేత్రం ద‌క్షిణ భార‌త దేశంలో ఎంతో గొప్ప పేరుంది. హ‌రిహ‌ర సుతుడు అయ్య‌ప్ప 18 కొండ మ‌ధ్య‌లోని శ‌బ‌రిగిరి శిఖ‌రంపై చిన్ముద్ర‌ధారిగా కొలువైన ఆ స్వామి ద‌ర్శ‌నం కోసం భ‌క్తులు దీక్ష చేప‌డ‌తారు. అయితే.. శ‌బ‌రిమ‌ల‌లో మ‌న‌కు వావ‌ర్ మ‌సీదు కూడా క‌నిపిస్తుంది. ముస్లిం అయిన వావ‌ర్‌కి స్వ‌యాన అయ్య‌ప్ప స్వామే శ‌బ‌రిమ‌ల‌లో మ‌సీదు క‌ట్ట‌మ‌ని చెప్పాడ‌ట‌.

అయ్య‌ప్ప అలా ఎందుకు చెప్పారు?

Ayyappa Vavar Swamy చుట్టూ ద‌ట్ట‌మైన అడ‌వుల‌తో ఉన్న ప్ర‌ఖ్యాతిగాంచిన పుణ్య‌క్షేత్రం శ‌బ‌రిమ‌ల‌. స‌హ‌జ సిద్ధ‌మైన ప్ర‌కృతి ఒడిలో పంపా న‌ది ఒడ్డున ప‌శ్చిమ క‌నుమ‌ల ప‌ర్వ‌త శ్రేణుల్లో ఉంది ఈ శ‌బ‌రిమ‌ల‌. ల‌క్ష‌లాది భ‌క్త జ‌నం మ‌ల‌యాళ క్యాలెండ‌ర్ ప్ర‌కారం మండ‌ల కాలం అయిన న‌వంబ‌ర్ నుంచి డిసెంబ‌ర్ వ‌ర‌కు ఈ క్షేత్రానికి త‌ర‌లి వ‌స్తుంటారు. భార‌త‌దేశ న‌లుమూల‌ల నుంచి భ‌క్తులు త‌మ మ‌తాల‌కు అతీతంగా .. ఆర్థిక స్థితిగ‌తుల‌కు అతీతంగా ఈ క్షేత్రానికి ఏటా వ‌స్తుంటారు. అయ్య‌ప్ప‌.. ఈ పేరు విన‌గానే చాలా మంది హిందువుల ఒళ్లు పుల‌క‌రిస్తుంది. దేవుడు అనే న‌మ్మ‌కం మిధ్య కాదు నిజం అన‌డానికి స‌జీవ సాక్ష్యంగా నిలిచే మ‌క‌ర జ్యోతి గురించి తెలిసిన ప్ర‌తి ఒక్క‌రికి అయ్య‌ప్ప స్వామి దీక్షా ఫ‌లం ఆయ‌న భ‌క్తి వాత్స‌ల్యం గురించి వేరే చెప్పాల్సిన అవ‌స‌రం లేదు.

అలాంటి మ‌హిమాన్వితుడు కొలువై ఉన్న శ‌బ‌రిమ‌ల‌లో కొన్ని వేల ఏళ్లుగా వావ‌ర్ మ‌సీదు పూజ‌లందుకుంటోంది. అయితే ఇప్ప‌టికీ చాలా మందికి అయ్య‌ప్ప‌కు మ‌త‌ప‌ర‌మైన శ‌బ‌రిమ‌ల‌లో ఇస్లాంకు సంబంధం ఏంటి అనేది తెలీదు. ఈ విష‌యంలో చ‌రిత్ర ప్ర‌కారం చూసిన‌ట్లైతే 12వ శ‌తాబ్దంలో పండ‌ల రాజ్యం రాజుకి అడ‌విలో మ‌ణికంఠుడు దొరికడం.. పులి పాల కోసం అడ‌వుల్లోకి వెళ్లి పులుల స‌మూహాన్ని త‌న వెంట తెచ్చి అయ్య‌ప్ప‌గా ఊరి ప్ర‌జ‌ల మెప్పు పొందిన విష‌యం తెలిసిందే. అలా అయ్య‌ప్ప‌ బాణం ప‌డిన చోటుని శాశ్వ‌త ధ్యానం కోసం ఏర్పాటు చేయ‌బ‌డిన మ‌ణిమండ‌పం శ‌బ‌రిమ‌ల పుణ్య‌క్షేత్రం ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత గాంచింది. అంత‌టి మ‌హోన్న‌త దేవుడైన హ‌రిహ‌ర సుతుడికి ఒక ఇస్లాం మ‌త‌స్థుడు ప్రాణ స్నేహితుడిగా మారిన వైనానికి స‌జీవ సాక్ష్యం ఈ వావ‌ర్ మ‌సీదు అని చెప్తుంటారు.

మ‌ణికంఠుడు త‌న బాల్యంలో అరివిర భ‌యంకరుడిగా ప్రేమ‌తో వాత్స‌ల్యంతో త‌న‌ను పెంచి పోషించిన రాజ కుటుంబాన్ని రాజ్య ప్ర‌జ‌ల‌ను అత్యంత ప్రేమానురాగాల‌తో పోషించేవాడు. ఒకానొక స‌మ‌యంలో రాజ్యంలోని పిల్ల‌ల‌ను త‌న ఆహారాన్ని పెట్టి ఆక‌లి తీర్చేవాడు. అంత‌టి ద‌యామ‌హుడు. అయితే ప‌రిపాలించ‌డం రాజ ధ‌ర్మం అయితే ప్ర‌జ‌ల‌ను కాపాడ‌టం కూడా దైవ ధర్మం అనే మాట‌కు చ‌క్క‌టి నిద‌ర్శ‌నం మ‌ణికంఠుడు. అయితే ఒక‌ప్పుడు వావ‌ర్ అనే ఇస్లాం మ‌తానికి చెందిన వ్య‌క్తి అయ్య‌ప్ప‌తో మూడు రోజుల పాటు యుద్ధం చేసార‌ట‌. యుద్ధంలో ఇద్దరూ సరిస‌మానంగా పోరాడుతుండడంతో అయ్య‌ప్ప‌ ఆయుధాన్ని ప‌డేసి వావ‌ర్‌ను కౌగిలించుకుని త‌న మిత్రుడిగా చేసుకున్నాడ‌ట‌. త‌ర్వాత కాలంలో వావ‌ర్ అయ్య‌ప్ప‌కు ప్ర‌ముఖ శిష్యుడైన‌ట్లు చెప్తుంటారు. వావ‌ర్ మ‌తుడు ఇస్లాం మ‌తం వీడి అయ్య‌ప్ప భ‌క్తుడిగా మారిపోవాల‌నుకున్నార‌ట‌. కానీ త‌ల్లిలాంటి మ‌తాన్ని మార్చ‌డం నేరం అని ప‌రిగ‌ణించిన మ‌ణికంఠుడు మ‌తం మార‌వ‌ద్ద‌ని చెప్పాడు.

త‌న ప్రియ భ‌క్తుడిగా వావ‌ర్‌ను స్వీక‌రించి ఆయ‌న‌కు గానూ ఎరిమిలిలో ఇస్లాం సంప్ర‌దాయం ప్ర‌కారం ఒక మ‌సీదుని నిర్మించ‌మ‌ని అయ్య‌ప్ప చెప్పార‌ని పురాణాలు చెప్తున్నాయి. అలా శ‌బ‌రిమ‌ల‌లో వావ‌ర్ మ‌సీదు ఏర్ప‌డింది. కాలం గ‌డుస్తున్న‌కొద్దీ వావ‌ర్‌ను వావ‌ర్ స్వామిగా పిలుస్తున్నారు. కానీ ఇస్లాం సిద్ధాంతం పూజ‌ల‌ను విగ్ర‌హారాధ‌న‌ల‌ను బోధించ‌దు కాబ‌ట్టి వావ‌ర్ మ‌సీదు రాను రాను వావ‌ర్ ద‌ర్గాగా ప్రాచుర్యం పొందింది. అలా స‌ర్వ జ‌గత్తుకి ఆధార‌భూతుడైన దైవ శ్రేష్ఠుడు ప‌రాయి మ‌త‌స్తుడైన వావ‌ర్‌ను అక్కున చేర్చుకుని ఉదార‌త్వాన్ని చాటుకున్న మ‌ణికంఠుడిని అయ్య‌ప్పగా కోట్లాది మంది భ‌క్త‌జ‌నం త‌మ ఇల‌వేల్పుగా పూజిస్తున్నారు.

అప్ప‌టి నుంచి శ‌బ‌రిమ‌ల‌ను ద‌ర్శించుకునేవారు అక్క‌డే ఉన్న వావ‌ర్ ద‌ర్గాను కూడా ద‌ర్శించుకోవ‌డం మొద‌లుపెట్టారు. వావ‌ర్ ఉనికిని చాటుతూ ఒంపు తిరిగిన ఒక శిల ఉంటుంద‌ట‌. అయితే అంద‌రూ వెళ్తార‌ని లేదు. కొంద‌రు మాత్ర‌మే అలా వెళ్తుంటారు. అలా వెళ్ల‌డం వెళ్ల‌క‌పోవ‌డం ఎవ‌రి ఇష్టం వారిది. అయితే.. వావర్ అనే వాడు లేనేలేడ‌ని.. ఇదంతా క‌ట్టు క‌థ అని కొట్టిపారేసేవారు లేక‌పోలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *