Magha Pournami: మనకు మాఘ, వైశాఖ, ఆషాఢ, కార్తీక పౌర్ణమి అని నాలుగు పౌర్ణములకు చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది. మనకు కార్తీక మాసంలో శివకేశవులను ఎలాగైతే కొలుస్తామో మాఘమాసంలో కూడా శివ కేశవులను కొలవాలి. ఎందుకంటే మాఘ మాసం ప్రత్యేకించి విష్ణువుకు సంబంధించినది. ఆ మాఘ మాసంలోనే శివుడికి సంబంధించిన శివరాత్రి వస్తుంది. కాబట్టి కార్తీక మాసంలో కూడా దామోదర ద్వాదశి చాలా విశేషమైనది. ఎక్కువగా సాలగ్రామ దానం చేస్తుంటారు. పౌర్ణమికి చాలా విశిష్టత ఎందుకు అంటే.. మనది చాంద్రమాన ప్రకారం నడిచేది. కాబట్టి చంద్రుడు ఎప్పుడైతే బలంగా ఉంటాడో ఆ రోజున విశేషమైనది అని చెప్పబడింది.
అందుకే ఏ కార్యం చేసినా స్వస్తశ్రీ చాంద్రమాణ వ్యవహారీక అంటారు. ఈ పౌర్ణమి రోజున చంద్రుడు సంపూర్ణమైన కళతో భాసిల్లుతుంటాడు. చంద్రుడు ఎంత బలంగా ఉంటే ఆ ముహూర్తానికి అంతటి బలం వస్తుంది. ఈ పౌర్ణమి రోజున సాక్షాత్తు అమ్మవారికి సంబంధించినది అని చెప్పబడింది. అయితే మనకు పురాణాంతర్గతంగా గౌరీ దేవి జన్మదినం కూడా ఈ మాఘ పౌర్ణమి రోజే. అందుకే పౌర్ణమి నాడు ఎక్కువగా చండీ హోమాలు, లలితా సహస్రనామ పారాయణాలు ఎక్కువగా చేస్తుంటారు. కానీ ఈ మాఘ పౌర్ణమికి మాత్రం ప్రధానంగా స్నానానికి సంబంధించిన విశిష్టత చెప్పబడింది. సముద్ర, నది స్నానాలు చేయాలని అంటుంటారు.
Magha Pournami పిల్లలకు సంబంధించిన రోజని చెప్తుంటారు. అదేంటంటే.. మనకు శివ పురాణంలో ఒక గాథ కూడా ఉంది. మాఘ పురాణంలో కూడా చెప్పారు ఇది. మనకు పూర్వం.. గృస్నమద మహర్షి, జన్హు మహర్షి మధ్య సంవాదం జరిగింది. గృస్నమద మహర్షి.. జన్హు మహర్షిని ఒకటి అడుగుతాడు. అదేంటంటే.. మనం ఉన్న కాలం అయితే చాలా అనుకూలమైనది.. ధర్మం సాక్షాత్తు ఉన్నటువంటి కాలం.. కానీ రాబోయే కలియుగంలో మానవులంతా కూడా అల్పషులుగా ఉంటారు.. ముఖ్యంగా సంతానం ఉన్నటువంటి వారు భవిష్యత్తులో ఆ సంతానానికి గండాలు లేకుండా ఉండాలి అంటే బాలారిష్ట దోషాలు తొలగిపోవాలన్నా.. ఇక్కడ బాలారిష్ట దోషాలంటే మనిషి పుట్టినప్పటి నుంచి 8, 16, 24, 32 సంవత్సరాల వరకు ఈ దోషాలు వెంటాడుతుంటాయి.
ఈ దోషాలు లేకుండా వాళ్ల వంశం అక్కడితో ఆగిపోకుండా వంశం ముందుకు వెళ్లాలి.. ఆ వంశాన్ని ముందుకు తీసుకువెళ్లే వ్యక్తి పురుషుడే కాబట్టి అటువంటి మగ పిల్లలు పుట్టిన తల్లిదండ్రులు.. ఆ పిల్లల కోసం ఆయురారోగ్యాల కోసం ఏదైనా దానం చేస్తుంటారు. పూర్వం.. ఒక బ్రాహ్మణుడు కాశీ నగరం నందు నివసిస్తున్నాడు. దంపతులకు ఇద్దరికీ కూడా సంతానం లేక చాలా బాధపడుతున్నారు. అలా ఆ భార్య ఒక రోజు చాలా బాధ పడుతూ ఎంతో గొప్పగా తపస్సు చేస్తున్నావ్ కదయ్యా.. అయినా దైవం ఎందుకు కరుణించడం లేదు… నీతి నియమాలు ఉన్నాయి.. బ్రాహ్మణ ధర్మాన్ని పాటిస్తున్నాం.. మరి మనకు ఎందుకు పిల్లలు కలగడం లేదు అని బాధపడుతుంది. అప్పుడు ఒక రోజున నిశ్చయం చేసుకుని నేను బయలుదేరతాను.. భగవంతుడినే ప్రశ్నిస్తాను అంటూ ఆ భర్త వెళ్లిపోతాడు. ఇక్కడ సంతానం కలగాలంటే విష్ణు అనుగ్రహం కలగాలి. ఆ విష్ణువు కోసం తపస్సు చేయగా.. ఆయన ప్రత్యక్షం అయ్యి ఏం కావాలి అని అడుగుతాడు.
Magha Pournami పున్నామ నరకం నుంచి తప్పించే అబ్బాయి కావాలి అని కోరుకుంటాడు. అప్పుడు ఆయన తథాస్తు అని చెప్తాడు. ఆ తర్వాత ఆ భర్త ఇంటికి వెళ్లిపోతాడు. ఒక శుభ ముహూర్తాన భార్య జన్మనిస్తుంది. ఇక డోలారోహణం.. అంటే ఈ నామకరణం ఇవన్నీ చేస్తుంటాం కదా.. ఆ సమయంలో నారదులు ఆ ఇంటి ముందు నుంచి వెళ్తూ ఆ ఇంట్లోకి వెళ్లి.. ఆ నవ్వుతున్న బిడ్డను చూసి ఈ బాలుడికి 12 సంవత్సరాలు వచ్చిన తర్వాత గండం ఉంది.. అంత వరకు ఆయుష్షు అని చెప్తాడు. ఇంకా నామకరణమే చేయలేదు.. సాక్షాత్తు నారదుల వారు వచ్చి బిడ్డ చనిపోతాడు అని చెప్పడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతారు.
బిడ్డను ఇచ్చినట్లే ఇచ్చి అల్పాయుష్షు ఇచ్చిన ఆ మహా విష్ణువునే అడుగుదాం అని ఆ భర్త మళ్లీ తపస్సు చేసి స్వామిని ప్రత్యక్షమయ్యేలా చేస్తాడు. ఏంటి తండ్రీ ఇలా చేసావు. నీ అనుగ్రహంతోనే నా భార్య పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఇప్పుడు నారదుల వారు వచ్చి నా బిడ్డ చనిపోతాడు అంటున్నాడు. ఎందుకిలా అని ఏడుస్తుంటే.. అప్పుడు విష్ణు మూర్తి.. అది నీ పూర్వ జన్మలో చేసుకున్న పాపం ఇప్పుడు కర్మలా తగలబోతోంది అని చెప్తాడు. జ్ఞానశర్మగా గత జన్మలో జన్మించి.. ఇప్పుడున్న భార్యనే పూర్వ జన్మలో నీ భార్యగా ఉంది. ఇద్దరూ అన్యోన్యంగా ఉంటూ జీవితాన్ని గడుపుతూ నా వ్రతాన్ని కూడా ఆచరించారు.. ఆ తర్వాత విష్ణు పూజ కూడా చేసారు.
ఆ తర్వాత మాఘ పౌర్ణమి రోజున దైవానుగ్రహం పొందడం కోసం నీవు నీ భార్యకు ఒక విష్ణు పూజ చేయమని చెప్పి ప్రసాదాన్ని నైవేధ్యంగా పెట్టమని చెప్పి వెళ్లావు.. కానీ కొన్ని కారణాల వల్ల చుట్టుపక్కల వారు రావడంతో ఆమె ఆ పూజ, నైవేధ్యం మర్చిపోయింది. అలా నీ భార్య రెండు దోషాలు చేసింది. ఒకటి భర్త మాట జవదాటింది. రెండోది ఆ మాఘ పౌర్ణమి రోజున చేయాల్సిన దానం కూడా చేయలేదు. అందు వల్లే ఈ జన్మలో మీరు భార్యాభర్తలుగా పుట్టి నా అనుగ్రహం వల్ల సంతానాన్ని పొంది.. మళ్లీ అల్పాయుష్షు ఉన్న సంతానాన్ని పొందారు.
Magha Pournami గత జన్మలో చేయకుండా ఉన్న పని ఉందో ఇప్పుడు మీరు పూర్తి చేయండి.. అప్పుడు మీ బిడ్డకు సంపూర్ణమైన ఆయుష్షు ఉంటుంది అని చెప్తాడు. అప్పుడు ఆ దంపతులు మాఘ పౌర్ణమి కోసం ఎదురుచూసారు. మాఘ పౌర్ణమి రాగానే విష్ణు భగవానుల వారు చెప్పినట్లుగా.. విష్ణు ప్రీతి కోసం పూజ చేసి.. నైవేధ్యం పెట్టి.. దానం కూడా చేసారు. తద్వారా సంతానం పొందిన వారంతా మాఘ పౌర్ణమి రోజున ఇలాగే చేయడం మొదలుపెట్టారు. ఈ సంప్రదాయాన్ని ఇప్పటికీ పాటిస్తూ వస్తున్నామన్నమాట..!
కాబట్టి ఈ మాఘ పౌర్ణమి రోజున చక్కగా ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేసుకుంటే ఎంతో మంచిది. పూజలో మగ పిల్లలు ఉంటే వారిని తప్పనిసరిగా కూర్చోపెట్టండి. ఈ పూజ చేసిన వారికి సంతానప్రాప్తి కలుగుతుంది.. మగ పిల్లలు కావాలనుకునేవారికి కూడా మగ సంతానం కలుగుతుంది అని చెప్తారు. అంటే ఇక్కడ ఆడపిల్లలను తక్కువ చేస్తున్నట్లు కాదు. ఆడపిల్ల అత్తారింటికి వెళ్లిపోతుంది. అక్కడ తన భర్తతో వంశాన్ని వృద్ధి చేస్తుంది. అంతే తప్ప ఆడపిల్లలను తక్కువ చేస్తున్నట్లు మాత్రం కాదనేది గుర్తుంచుకోవాలి.