The RajaSaab రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన ది రాజా సాబ్ సినిమా ఎట్టకేలకు ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఒక సినిమా రిలీజైనప్పుడు మిక్స్‌డ్ రివ్యూలు రావడం సహజం. కానీ ఇలాంటి సినిమాను ఎందుకు ఒప్పుకున్నావ్.. ఇలాంటి దర్శకుడికి ఎందుకు ఛాన్స్ ఇచ్చావ్ అంటూ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేయడం కాస్త చింతించాల్సిన విషయం. చాలా కాన్ఫిడెంట్‌గా దర్శకుడు మారుతి తన ఇంటి అడ్రెస్ ఇచ్చి మరీ సినిమా బాలేకపోతే అప్పుడు అడగండి అని ఛాలెంజ్ విసిరారు.
తీరా చూస్తే.. టీజర్, ట్రైలర్‌లో హైప్ పెంచిన సన్నివేశాలు.. ప్రభాస్ సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ (పోస్టర్‌లో ఉన్నట్లు) తో సన్నివేశాలు లేకపోవడంతో ప్రేక్షకులు హర్ట్ అయినట్లు ట్వీట్లను బట్టి చూస్తే అర్థమవుతోంది. ఒక అభిమాని అయితే.. సినిమా సెట్‌లో లైట్ మ్యాన్‌గా కూడా పనికిరాని వాడికి దర్శకుడిగా అవకాశాలు ఇస్తే ఇలాగే ఉంటుందన్నా అని ప్రభాస్‌ని ట్యాగ్ చేస్తూ ఇంకెప్పుడూ మారుతికి ఛాన్సులు ఇవ్వద్దని రిక్వెస్ట్ చేసారు.
సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్రభాస్ గురించి చెప్తూ.. బాహుబలికి ముందు ప్రభాస్ ఒక యావరేజ్ నటుడని.. బాహుబలి తర్వాతే ఆయన రేంజ్ ప్యాన్ ఇండియా అయ్యిందని చెప్పిన మారుతి.. రాజా సాబ్ సినిమాతో మళ్లీ ఆయన్ను మీడియం రేంజ్ నటుడ్ని చేసేసాడని ఇంకొందరు మండిపడుతున్నారు. సినిమా కాన్సెప్ట్ కొత్తగా ఉంటే దానిని నడిపించే విధానం కూడా కొత్తగానే ఉండాలి. అదీకాకుండా ప్రభాస్ ఈ మధ్యకాలంలో 30% యాక్టింగ్ చేస్తూ మిగతా 70% వీఎఫ్ఎక్స్ పెట్టించుకుంటున్నాడనే టాక్ ఉంది. ఈ సినిమాతో అది 100% నిజం అని తేలిపోయిందని సినిమాలోని సన్నివేశాలు చూస్తే చెప్పొచ్చని కొందరు నెటిజన్ల అభిప్రాయం.
అయితే.. ఎక్స్‌లో ఒక ఇంట్రెస్టింగ్ విషయంపై చర్చ జరుగుతోంది. R అనే అక్షరంతో ప్రభాస్ నటించిన సినిమాలన్నీ యావరేజ్, ఫ్లాప్ అయినవే అని.. ఇంకెప్పుడూ R అక్షరంతో ఉన్న సినిమాలు ఒప్పుకోవద్దని రిక్వెస్ట్ చేస్తున్నారు. ప్రభాస్ నటించిన రాఘవేంద్ర, రెబెల్, రాధే శ్యాం, ఇప్పుడు రాజా సాబ్ సినిమాలు R అక్షరంతో వచ్చినవే. రాఘవేంద్ర, రాధే శ్యాం డిజాస్టర్లు అన్న విషయం జీర్ణించుకోవాల్సిందే. రెబెల్ యావరేజ్ టాక్‌తో నడిచిపోయింది. ఇప్పుడు వచ్చిన రాజా సాబ్ ట్రోల్స్‌కి గురవుతోంది.





