RGV Arrest – వ‌ర్మ అరెస్ట్‌కు రంగం సిద్ధం

RGV Arrest – వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ త‌ర‌ఫున ప్ర‌చారం చేస్తూ.. తెలుగు దేశం, జ‌న‌సేన పార్టీల‌కు సంబంధించిన కీల‌క నాయ‌కుల ఫోటోలు మార్ఫ్ చేసి సోష‌ల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టార‌న్న నేప‌థ్యంలో ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ‌పై కేసు న‌మోదైన సంగ‌తి తెలిసిందే. ఈ నెల 10న ఒంగోలులోని మ‌ద్దిపాడు పోలీస్ట్ స్టేష‌న్‌లో వ‌ర్మ‌పై ఎఫ్ఐఆర్ న‌మోదైంది. ఈ నేప‌థ్యంలో పోలీసులు విచార‌ణ‌కు హాజ‌రు కావాల‌ని రెండు వారాల క్రితం నోటీసులు పంప‌గా.. వ‌ర్మ రాలేదు. దాంతో పోలీసులు ఈరోజు విచార‌ణ‌కు హాజ‌రుకావాల‌ని మ‌రోసారి నోటీసులు పంపారు.

అయినా కూడా ఆయ‌న రాలేదు. అస‌లు ఇంట్లో ఉన్నారా లేరా అనే సందేహాలు కూడా వ్య‌క్తం అవుతున్నాయి. త‌న‌కున్న బిజీ షెడ్యూల్‌లో విచార‌ణ‌కు రావ‌డంలో కాస్త ఆల‌స్యం అవుతుంద‌ని వ‌ర్మ పోలీసుల‌కు చెప్పారు. ఇక త‌ప్ప‌క వ‌ర్మ‌ను అరెస్ట్ చేయాల్సిన ప‌రిస్థితి త‌లెత్తింది. ఏ క్ష‌ణానైనా వ‌ర్మ‌ను అరెస్ట్ చేసే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది. దాంతో పోలీసులంతా వ‌ర్మ నివాసం వ‌ద్దకు చేరుకున్నారు. వ‌ర్మ త‌ర‌ఫు లాయ‌ర్ స్పందిస్తూ.. వ‌ర్మ భ‌య‌ప‌డే వ్య‌క్తి కాద‌ని.. భార‌త‌దేశంలో ఎవ‌రు ఫిర్యాదు చేసినా పోలీసుల‌కు ఎఫ్ఐఆర్ న‌మోదు చేసే హ‌క్కు ఉంటుంద‌ని.. అదే విధంగానే వ‌ర్మ‌పై ఎఫ్ఐఆర్ న‌మోదైంద‌ని.. దీనికి ఎలా బ‌దులు చెప్పాలో తాము చూసుకుంటామ‌ని అన్నారు.

RGV Arrest వ‌ర్మ ప్ర‌స్తుతానికి హైద‌రాబాద్‌లోని త‌న నివాసంలో లేర‌ని సిబ్బంది చెప్తున్నారు. లేదు ఇంట్లోనే ఉన్నారు.. అందుకే పోలీసులు వ‌చ్చార‌నే అవ‌కాశం ఉంద‌ని మ‌రికొంద‌రి వాద‌న. వ‌ర్మ ఉంటే ఏం జ‌రుగుతుంది.. ఒక‌వేళ ఆయ‌న అందుబాటులో లేక‌పోతే ఏం చేయ‌బోతున్నారు అనే ఉత్కంఠ నెల‌కొంది. నిజంగానే లేడ‌ని తెలిసిన‌ట్లైతే మ‌రో నోటీసును వ‌ర్మ సిబ్బందికి కానీ ఆయ‌న లాయ‌ర్‌కు కానీ ఇస్తారు. వాళ్లు కూడా నోటీసు తీసుకోక‌పోతే మ‌రో నోటీస్‌ని ఇంటి గోడ‌కు అంటించి వెళ్లే అవ‌కాశం ఉంది. సిబ్బంది నోటీసు తీసుకునేందుకు రెడీగా ఉన్నారు. వ‌ర్మ అనుకోకుండా బ‌య‌టికి వెళ్లారు అని సిబ్బంది అంటున్నారు. అంతేకానీ పోలీసులు వ‌స్తార‌నే భ‌యంతో ఆయ‌న వేరే రాష్ట్రానికి వెళ్లారు అనే దాంట్లో నిజం లేద‌ని అన్నారు.

క్వాష్ పిటిష‌న్‌పై రేపు విచార‌ణ‌

ఈ నేప‌థ్యంలో వ‌ర్మ త‌ర‌ఫు న్యాయ‌వాది తెలంగాణ హైకోర్టులో రెండు పిటిష‌న్లు వేసారు. ఒక‌టి.. ఈ కేసును కొట్టి వేయాలంటూ క్వాష్ పిటిష‌న్.. మ‌రొక‌టి ముందస్తు బెయిల్ ఇవ్వాల‌న్న పిటిష‌న్. దీనిపై రేపు విచార‌ణ జ‌ర‌గ‌నున్న‌ట్లు తెలిపారు.

వ‌ర్మ వివాదం ఏంటి?

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ ప్ర‌భుత్వం అధికారంలో ఉన్న‌ప్పుడు ఆ పార్టీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి మ‌ద్ద‌తు ఇస్తూ తెలుగు దేశం పార్టీ నేత‌లైన చంద్ర‌బాబు నాయుడు, నారా లోకేష్‌.. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ల ఫోటోలు అభ్యంత‌క‌రంగా మార్ఫింగ్‌లు చేసి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసారు వ‌ర్మ‌. అప్ప‌ట్లో వైఎస్సార్ కాంగ్రెస్ ప్ర‌భుత్వం అధికారంలో ఉండటంతో బాధిత పార్టీ నేత‌లు ఫిర్యాదులు చేసినా ఎవ్వ‌రూ ప‌ట్టించుకోలేదు. ఇప్పుడు తెలుగు దేశం కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి రావ‌డంతో వ్య‌క్తిగ‌త ధూష‌ణ‌లు చేస్తూ కామెంట్స్, మార్ఫింగ్ ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేసిన వారిపై కొర‌డా ఝ‌ళిపిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో మ‌ద్దిపాడులో తెలుగు దేశం పార్టీకి చెందిన కొంద‌రు వ్య‌క్తులు వ‌ర్మ‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాలంటూ ఫిర్యాదు చేసారు.

వ‌ర్మ త‌గ్గుతాడా?

ఇప్ప‌టికే వైఎస్సార్ కాంగ్రెస్ త‌ర‌ఫున ప్ర‌చారం చేస్తూ మ‌ద్ద‌తు ఇస్తూ తెలుగు దేశం, జ‌న‌సేన పార్టీల‌కు చెందిన నేత‌ల కుటుంబీకుల‌పై అస‌భ్య‌క‌రంగా మాట్లాడిన శ్రీరెడ్డి, పోసాని కృష్ణ‌మురళిల‌పై చ‌ర్య‌లు తీసుకున్నారు. దాంతో వారిద్ద‌రూ కాళ్ల‌బేరానికి వ‌చ్చారు. అన్నా లోకేష్ అన్నా.. ఇంకెప్పుడూ మీ జోలికి రామన్నా అని శ్రీరెడ్డి సోష‌ల్ మీడియా వేదిక‌గా క్ష‌మాప‌ణ‌లు చెప్పింది. ఆ త‌ర్వాత ఊరికే మీడియా ముందుకొచ్చి నేను చెప్పేవ‌న్నీ నిజాలే అంటూ నోరుపారేసుకునే పోసాని కూడా ఇక‌పై రాజ‌కీయాల గురించి ఈ జ‌న్మ‌లో ప్రెస్‌మీట్లు పెట్ట‌న‌ని.. అస‌లు రాజ‌కీయాల గురించే మాట్లాడ‌న‌ని అనేసారు. వీరిద్ద‌రూ ఇప్పుడున్న కూట‌మి ప్ర‌భుత్వానికి భ‌య‌ప‌డ్డారు. మ‌రి వర్మ కూడా అలాగే అపాల‌జీ రిలీజ్ చేస్తారా లేదా అనేది వేచి చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *