Best way to clean out clogged arteries ఈ మధ్యకాలంలో చాలా మంది కాస్త ఛాతీలో నొప్పి రాగానే అమ్మో గుండెపోటేమో (Heart Attack) అని భయపడిపోతున్నారు. రోజూ ఎవరో ఒకరు వయసుతో సంబంధం లేకుండా ఉన్నట్టుండి గుండెపోటుతో చనిపోయాడు అని వస్తున్న సంఘటనల ద్వారా ఏర్పడిన భయం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పచ్చు. ఇక రెండోది నిజంగానే గుండె సమస్యలు ఉండటం వల్ల వస్తున్న నొప్పి కూడా కావచ్చు.
గుండె విషయంలో తాత్సారం చేయలేం కాబట్టి చిన్న నొప్పి వచ్చినా హాస్పిటల్‌కి పరుగులు పెడుతున్నారు. వైద్యులు పరీక్షలన్నీ చేసి అబ్బే గుండె నొప్పి కాదండీ.. గ్యాస్ సమస్య అంతే అని చెప్తున్నారు. దాంతో జనాలు ఊపిరి పీల్చుకుంటున్నారు. ప్రస్తుతం రోజూ ఇలాంటివి చాలా కేసులు వస్తున్నాయి. గుండెపోటుకు సంబంధించిన విషయాల గురించి మరింత లోతుగా తెలుసుకునేముందు అసలు గుండె పోటుకి.. గ్యాస్ వల్ల ఏర్పడే నొప్పికి సంబంధం ఏంటో తెలుసుకోవాలి. ఇలాంటి విషయాలపై అవగాహన లేకపోతే లేనిపోని భయాల వల్ల ఒత్తిడికి గురై ఇతర అనారోగ్య సమస్యలు కొని తెచ్చుకున్నట్లు అవుతుంది.
గుండెపోటు అంటే ఏంటి?
గుండెపోటు అంటే గుండెకు రక్త సరఫరా తగ్గిపోయినప్పుడు లేదా ఆగిపోయినప్పుడు గుండెకు సంబంధించిన కండరాలు, కణజాలాలు ఆక్సిజన్ లేక పనిచేయడం ఆగిపోతాయి. దాని వల్ల గుండెపోటు ఏర్పడుతుంది. దీనిని మయోకార్డియల్ ఇన్‌ఫార్‌క్షన్ (Myocardial Infarction) అని కూడా అంటారు. రక్తంలో ఎక్కువ కొలెస్ట్రాల్, కాల్షియం వంటి ఇతర మలినాలు గుండెకు రక్తాన్ని సరఫరా చేసే కరోనరీ దమనాల్లోని గోడలకు (coronary arteries) అతుక్కుపోయినప్పుడు అది పోటుకు దారితీస్తుంది. దీన్ని అథెరోస్క్లెరోసిస్ (Atherosclerosis) అంటారు.
గుండెపోటు సంభవించే ముందు లేదా నొప్పి వస్తున్న సమయంలో కొన్ని ముఖ్యమైన లక్షణాలు కనిపిస్తాయి. గుండెపై ఎవరో బండరాయి పెట్టినప్పుడు బరువుగా అనిపించడం… మెడ, ఎడమ చేయ్యంతా లాగేయడం.. కడుపు భాగంలో విపరీతమైన నొప్పి రావడం..శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, అలసటగా ఉండటం.. శరీరం చల్లగా అయిపోయి ఒళ్లంతా చెమటలు పట్టేయడం.. వికారంగా అనిపించడం. ఇవన్నీ ప్రధాన లక్షణాలు. అయితే.. ప్రతి ఒక్కరిలో ఇవే లక్షణాలు కనిపిస్తాయని చెప్పలేం. 90% ఇవే లక్షణాలు ఉంటాయి. కాకపోతే.. మహిళలు, వృద్ధులు, మధుమేహం ఉన్నవారిలో లక్షణాలు కాస్త భిన్నంగా ఉంటాయి.
గుండెపోటుకు ప్రధాన కారణాలేంటి?
గుండెపోటుకు కారణాలు అనేకం. కానీ కొన్ని ప్రధాన కారణాలు మాత్రం ఇవే
అధిక కొవ్వు, చక్కెర, ప్రాసెస్డ్ ఆహారం ఎక్కువగా తీసుకోవడం.
శరీరానికి తగినంత వ్యాయామం లేకపోవడం. తిని అలాగే కూర్చుండిపోయినా, పడుకున్నా, శరీరానికి అసలు పని చెప్పకపోయినా చాలా రిస్క్. ఎందుకంటే దీని వల్ల అవయవాల చుట్టూ కొవ్వు పేరుకుపోయే ప్రమాదం ఉంటుంది. ఇది చాలా డేంజరస్.
ధూమపానం చేసేవారిలో రక్తనాళాలు మాడిపోయి, గట్టిపడిపోతాయి. ఇది కూడా రిస్కే.
అధిక బరువు గుండెపై ఒత్తిడిని పెంచుతుంది.
పైన చెప్పినవి సహజంగా వైద్యులు చెప్పే ప్రధాన కారణాలు. కానీ కొందరికి వంశంలో ఈ సమస్య ఉంటుంది. ఉదాహరణకు కన్నడ కంఠీరవగా పిలిచే అలనాటి నటుడు రాజ్‌కుమార్ గుండెపోటుతో చనిపోయారు. ఆ తర్వాత ఆయన చిన్న కుమారుడు పునీత్ కుమార్ కూడా మూడేళ్ల క్రితం గుండెపోటుతో చనిపోయారు. పునీత్ మరణానికి కారణం గుండెపోటు అని వైద్యులు వెల్లడించినప్పుడు చాలా మందిలో ఓ సందేహం వచ్చింది. పునీత్ ఎంతో ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ.. రోజూ వ్యాయామం చేస్తుంటారు. అలాంటి వ్యక్తికి కూడా గుండెపోటు రావడం ఏంటి అని. దీనినే వంశ సమస్యగా చెప్తారు. వంశంలో ఇలాంటి గుండె సమస్యలు ఉంటే అది తరువాతి తరం వారికి కూడా వచ్చే అవకాశం ఉంటుంది.
రక్తనాళాల్లో పూడికలంటే ఏంటి?
గుండెపోటు వచ్చినప్పుడు హాస్పిటల్‌కి తీసుకెళ్తే వైద్యులు సహజంగా చెప్పే మాట పూడికలు ఉన్నాయి అని. వీటినే క్లాగ్డ్ ఆర్టరీస్ (Clogged Arteries) అంటారు. మన ఇంటి ముందు ఉండే డ్రైనేజీలో చెత్తాచెదారం ఎక్కువైపోయి ఎలా పూడుకుపోతుందో.. అలా కొవ్వు, కాల్షియం గుండె ధమనాల్లోని రక్తనాళాల గోడలకు పట్టేస్తే అది మెల్లిగా పూడుకుపోతుంది. ఆ సమయంలో రక్తం సరఫరా అవ్వడం క్లిష్టంగా మారుతుంది. పూడికల వల్ల రక్త సరఫరా జరిగే సమయంలో ఆ రక్తనాళం ఒత్తిడిని తట్టుకోలేక పగులుతుంది. అదే గుండెపోటుకు దారితీస్తుంది. అందుకే మన శరీరంలో రక్తాన్ని సరఫరా చేసే ధమనాలు (ఆర్టరీ) ఆరోగ్యకరంగా ఉండాలి. ఆరోగ్యకరమైన ఆర్టరీలు మృదువుగా ఉంటాయి. కాబట్టి రక్తం సులభంగా ప్రవహిస్తుంది. కానీ, కొందరి ఆహారపు అలవాట్లు, వ్యాయామ లోపం, ధూమపానం వంటి కారణాలతో లేదా వారసత్వ లక్షణాల వలన రక్తనాళాలు పూడుకుపోతాయి.
మరి పూడికలు ఉన్నట్లు మనకు ఎలా తెలుస్తుంది అనే సందేహం మీకు రావచ్చు. ఒకవేళ మన గుండెలో పూడికలు ఉన్నాయని తెలియజేసేందుకు మన శరీరమే కొన్ని సిగ్నల్స్ ఇస్తుంది. కానీ మన బిజీ లైఫ్‌లో ఏమీ పట్టించుకోకుండా లైట్ తీసుకుంటూ ఉంటాం. ఒకవేళ మీ గుండెలో పూడికలు ఉన్నాయంటే ఈ లక్షణాలు కనిపిస్తాయి. అవేంటంటే..
గుండెపోటు కాకపోయినా ఛాతిలో అప్పుడప్పుడూ నొప్పి వస్తూ ఉంటుంది. దీనినే యాంజినా (Angina) అంటారు.
అప్పుడప్పుడు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటుంది.
పూడికలు ఉండటం వల్ల గుండెకు సక్రమంగా జరగాల్సిన రక్త సరఫరా జరగదు కాబట్టి విపరీతమైన నీరసం ఉంటుంది.
ఇవి ప్రధాన కారణాలు. ఇలాంటి లక్షణాలు మీలో ఉంటే వెంటనే కార్డియాలజిస్ట్‌ని సంప్రదించండి. ముందే పరీక్షలు చేయించుకుంటే మంచిది.
పూడికలను మనమే శుభ్రం చేసుకోవచ్చా?
మనలో చాలా మంది సొంత వైద్యులు ఉన్నారు. అంటే ప్రొఫెషనల్ వైద్యుల దగ్గరికి వెళ్తే ఎక్కడ బిల్లులు తడిసి మోపెడవుతాయో అని భయపడి వారికి వారే నేచురల్ విధానాల్లో వైద్యం చేసుకుంటూ ఉంటారు. అయితే అన్ని సందర్భాల్లోనూ సొంత వైద్యం మంచిది కాదు. సొంత వైద్యం అయితే చేసుకోలేం కానీ మంచి ఆహారం అయితే తీసుకోగలం కదా..! కాబట్టి ఆహారంపై దృష్టి పెట్టడం బెటర్. గుండెలోని పూడికలు సులువుగా శుభ్రం అయిపోవడానికి కొన్ని ఆహార పదార్థాలు ఉపయోగపడతాయని నిపుణులు అంటున్నారు. అందులోనూ అందులోనూ మామూలు రకమైన ఆహార పదార్థాలు కాదు. నలుపు రంగులో ఉండే పండ్లు, కూరగాయలు ఇంకా బెటరంట..! అవేంటో తెలుసుకుందాం.
బ్లాక్ బీన్స్
బ్లాక్ బీన్స్ అనేవి ముఖ్యంగా లాటిన్ అమెరికన్ వంటల్లో విరివిగా ఉపయోగిస్తుంటారు. వీటిలో పీచు (ఫైబర్) అధికంగా ఉండటంతో ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, ముఖ్యంగా యాన్తోసైనిన్లు ఉంటాయి. ఇవి రక్తనాళాల్లో పూడికలు ఏర్పడనివ్వకుండా దోహదపడతాయి. ఈ బ్లాక్ బీన్స్‌ని సలాడ్స్, సూప్స్, బరిటోస్ వంటి వంటలలో వాడుకుంటే మంచిది. మనం రోజూ తినే భోజనంలో ఏదో ఒకలా ఈ బ్లాక్ బీన్స్‌ని చేర్చుకున్నా సరిపోతుంది.
నల్ల వెల్లుల్లి
మనకు తెలిసింది ఒకటే వెల్లుల్లి. అదే తెల్ల వెల్లుల్లి. ఎక్కువగా వంట్లోనూ అదే వాడుకుంటాం. కానీ వెల్లుల్లిలో నల్లరకం కూడా ఉంది. ఈ నల్ల వెల్లుల్లి మామూలు వెల్లుల్లితో పోలిస్తే కాస్త తియ్యగా ఉంటుంది. దీనిలో ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ను తగ్గించే యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటే మన శరీరంలో ఫ్రీ ర్యాడికల్స్ (అస్థిర అణువులు) యాంటీఆక్సిడెంట్ల మధ్య అసమతుల్యత ఏర్పడినప్పుడు కలిగే ఒత్తిడి. ఫ్రీ ర్యాడికల్స్ శరీరంలో సహజంగా జరిగే మెటాబోలిజం ప్రక్రియ ద్వారా ఉత్పత్తి అవుతాయి. కాలుష్యం, UV కిరణాలు, ధూమపానం వల్ల కూడా ఏర్పడుతుంటాయి.
శరీరంలో ఫ్రీ ర్యాడికల్స్ యాంటీఆక్సిడెంట్ల కంటే ఎక్కువగా ఉంటే,ఆక్సిడేటివ్ స్ట్రెస్ పెరుగుతుంది, ఇది కణజాలకు నష్టం కలిగిస్తుంది. ఈ ఫ్రీ ర్యాడికల్స్ ఏర్పడ్డాయంటే మన DNAను సైతం మింగేస్తుంది. ఈ ఫ్రీ ర్యాడికల్స్ వల్లే క్యాన్సర్, గుండెజబ్బులు, డయాబెటిస్, అల్జీమర్స్ వంటి ప్రాణాంతక వ్యాధులకు దారి తీస్తుంది. నల్ల వెల్లుల్లిలో రక్తపోటును తగ్గించడంతో పాటు మంచి కొవ్వును మెరుగుపరచడంలో దోహదపడే యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయని పలు పరిశోధనల్లో వెల్లడైంది. ఈ నల్ల వెల్లుల్లిని రోజూవారి వంటలలో చేర్చుకోవచ్చు.
బ్లాక్‌బెర్రీలు
బ్లాక్‌బెర్రీల్లో విటమిన్స్ C, K, పీచు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తనాళాల్లో మలినాలను అడ్డుకోవడంలో గుండె సంబంధిత సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి. ఇవి రక్తనాళాలను నాజూకుగా ఉంచి పూడికలను నివారించడంలో దోహదపడతాయి. బ్లాక్‌బెర్రీలను రోజూ గుప్పెడు తినగలిగితే ఎన్నో ప్రయోజనాలు శరీరానికి అందుతాయి. రోజూ కుదరకపోతే వారంలో ఒక రోజు తీసుకునేందుకు ప్రయత్నించండి.
బ్లాక్ చియా సీడ్స్
చియా సీడ్స్‌లో పోషకాలు పోషకాలు మెండుగా ఉంటాయి. వీటిలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉండటం వల్ల ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. వీటిలో పీచు కూడా అధికంగా ఉంటుంది కాబట్టి ఎక్కువగా ఉన్న చెడు కొలెస్ట్రాల్ తగ్గడంలో సాయపడుతుంది. చియా సీడ్స్‌ని స్మూతీలు, సలాడ్స్‌పై వేసుకుని తినచ్చు. లేదంటే ఒక గ్లాసు నీటిలో ఒక స్పూన్ చియా సీడ్స్ వేసి గంట సేపు నానబెట్టి తాగేయండి.
నల్ల నువ్వులు
నల్ల నువ్వులు మనకు తెలిసిన పదార్థమే. వీటిలో మెగ్నీషియం, కాల్షియం వంటి ఖనిజాలు ఉంటాయి. ఇవి రక్తపోటును నియంత్రణలో ఉంచుతాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి కాబట్టి ఒత్తిడి దరిచేరదు. నల్ల నువ్వులతో లడ్లు ఇంట్లోనే తయారుచేసుకుని రోజూ ఒకటి తింటే మంచిది.
బ్లాక్ టీ
బ్లాక్ టీలో ఫ్లేవనాయిడ్లు ఉంటాయి. ఇవి రక్తనాళాల పనితీరును మెరుగుపరచడంలో సహాయపడతాయి. దీనివల్ల రక్తనాళాలు శుభ్రంగా ఉంటాయి కాబట్టి గుండె ఆరోగ్యంగా ఉంటుంది. బ్లాక్ టీని రోజూ ఒక కప్పు తాగచ్చు. మెరుగైన ప్రయోజనం కోసం చక్కెర లేకుండా తాగడం మంచిది.
DISCLAIMER: పైన చెప్పినవన్నీ కేవలం సాధారణ అవగాహన కోసం మాత్రమే అందించబడింది. వైద్య సలహా, నిర్ధారణ లేదా చికిత్స కోసం ఇది ప్రత్యామ్నాయమేమీ కాదు. ఆరోగ్య సంబంధిత సమస్యలు, చికిత్సలు, లేదా జీవనశైలి మార్పులు కోసం ఎల్లప్పుడూ క్వాలిఫైడ్ హెల్త్ ప్రొఫెషనల్‌ను సంప్రదించాలి.