Kalki 2898 AD: నాగ్ అశ్విన్ తెరకెక్కించిన బ్లాక్‌బస్టర్ కల్కి 2898 ఏడి సినిమాకు రెండో భాగం రాబోతున్న సంగతి తెలిసిందే. మొదటి భాగంలో ప్రభాస్, దీపిక పదుకొణె నటించారు. రెండో భాగంలోనూ దీపిక పదుకొణె హీరోయిన్‌గా నటిస్తుందని అనుకున్నారు. కానీ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ ఈ విషయానికి సంబంధించి షాకింగ్ ప్రకటన చేసింది. ఈ కల్కి 2లో దీపిక పదుకొణె ఉండబోదని.. మొదటి సినిమాలో ఆమెతో కలిసి పనిచేసినప్పటికీ ఆమెతో సరైన సత్సంబంధం ఏర్పరచుకోలేకపోవడం దురదృష్టకరం అని తెలిపింది. కల్కి లాంటి సినిమా కోసం పనిచేయాలంటే కమిట్మెంట్, డెడికేషన్ అనేవి చాలా ముఖ్యం అని.. దీపిక మున్ముందు మంచి సినిమాల్లో నటించాలని కోరుకుంటున్నట్లు వెల్లడించింది.
దీపిక పదుకొణెపై గతంలోనూ ఇలాంటి విమర్శలు వచ్చాయి. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న స్పిరిట్ సినిమాలో దీపిక ప్రభాస్ జంటగా నటించాల్సి ఉంది. కానీ దీపిక కేవలం 8 గంటలే సెట్స్‌లో ఉంటానని.. రూ.20 కోట్లు పారితోషికంతో పాటు సినిమాకు వచ్చిన కలెక్షన్స్‌లో తనకు షేర్ కావాలని డిమాండ్ చేయడంతో సందీప్ ఆమెను తప్పించారు. ఆమె స్థానంలో యానిమల్ ఫేం తృప్తి డిమ్రిని తీసుకున్నారు. అయితే.. తనను సినిమా నుంచి తప్పించడంతో దీపిక స్పిరిట్ సినిమాకు సంబంధించిన స్టోరీని తన పీఆర్ టీంతో లీక్ చేయించిందని ఇది ఒక పేరొందిన హీరోయిన్‌కు ఉండాల్సిన బుద్ధి కాదని ఆరోపించారు. స్పిరిట్ సినిమా నుంచి తప్పించగానే దీపికకు తమిళ దర్శకుడు అట్లీ అవకాశం ఇచ్చారు. అట్లీ ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో దీపిక హీరోయిన్‌గా నటిస్తున్నారు.