Shani Dev మీరెప్పుడైనా గమనించారా? శని భగవానుడిని ఫోటోల్లో విగ్రహాల్లో చూసినప్పుడు ఒక కాలే కనిపిస్తుంటుంది. చాలా మంది ఆయన కాలు మడిచి కూర్చోవడం వల్ల ఒకే కాలు కనిపిస్తుందని అనుకుంటారు కానీ నిజానికి శని దేవుడికి ఉన్నది ఒకటే కాలు. దీని వెనుక చాలా కథలు ఉన్నప్పటికీ సాధారణంగా చెప్పుకునే ఆసక్తికరమైన కారణం ఒకటి ఉంది. అదేంటో తెలుసుకుందాం.
మేఘనాథుడు పుట్టడానికి ముందు అతన్ని ఏ శక్తీ అడ్డుకోలేనంత వాడిని చేయాలని అనుకుంటాడు తండ్రి రావణాసురుడు. ఇందుకోసం మేఘనాథుడు జన్మించకముందే పెద్ద పెద్ద జ్యోతిష్య సమవుజ్జీలను పిలిపించి అన్ని గ్రహాలు తమ స్థానాల్లో మేఘనాథుడికి అనుకూలంగా ఉండేలా ఆదేశిస్తాడు. ఈ గ్రహాల్లో శని భగవానుడు కూడా ఉంటాడు.
రావణాసురుడు చేస్తున్నది తప్పు అని భావించిన నారదుడు వెంటనే ఈ విషయాన్ని విష్ణుమూర్తి చెవిన వేస్తాడు. రావణాసురుడి ప్లాన్ దెబ్బ తీయాలని భావించిన విష్ణు వెంటనే శని భగవానుడి వద్దకు వెళ్లి.. నువ్వు నీ స్థానంలోనే ఉండు కానీ మేఘనాథుడు పుట్టే సమయానికి నీ కాలు తీసి పక్క స్థానంలో పెట్టు అని ఐడియా ఇస్తాడు.
ఆయన మాటను జవదాటని శని మేఘనాథుడు పుట్టే సమయానికి కాలు తీసి పక్క స్థానంలో పెడతాడు. అది చూసిన రావణాసురుడు శని కాలు నరికేస్తాడు. కానీ అప్పటికే పక్క స్థానంలో శని కాలు పెట్టేయడంతో మేఘనాథుడు అత్యంత శక్తిమంతుడు అవుతాడు కానీ చిరంజీవుడు మాత్రం కాలేకపోయాడు.
శని కాకినే తన వాహనంగా ఎందుకు ఎంచుకున్నాడు?
శని భగవానుడి వాహనం కాకి అన్న విషయం మనకు తెలిసిందే. ఇన్ని పక్షులు, జంతువులు ఉండగా ఆయన కాకినే ఎంచుకోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. అవేంటంటే…. కాకికి జ్ఞాపకశక్తి ఎక్కువ. ఎవ్వరినీ మర్చిపోదు. పైగా ఒకే చోట అలాగే వాలి గమనించడం దాని ప్రత్యేకత. అంతేకాదు.. ఒకే ప్రదేశానికి మాటిమాటికీ వస్తుంటుంది. శని కర్మకారకుడు కాబట్టి.. కాకి మాదిరిగానే కర్మ అనేది కూడా దాని ఫలితాన్ని అదివ్వడం మర్చిపోదు.
శని దేవుడు అష్టకష్టాలు పెడుతుంటాడని చాలా మంది తిట్టుకుంటూ ఉంటారు. మీరు గమనించినట్లైతే కాకి పడేసిన అన్నం ముద్దలు, వదిలేసిన ఆహారంపై మాత్రమే ఆధారపడుతుంది. అంటే.. అణిగిమణిగి ఉండాలి అని దాని అర్థం. అందుకే శని దేవుడు కర్మానుసారం కష్టాలు ఇచ్చి దాని నుంచి ఎలా పైకి లేవాలి అనే గుణపాఠాన్ని నేర్పుతాడు.





