WHO ఏం తిన్నా ఎంత తిన్నా ఉన్నంత కాలం హాయిగా బతికేసి పోవడానికే కదరా..! ఈ మాట మనం తరచూ వింటూనే ఉంటాం. అది నిజమే కానీ.. బతికున్నంత కాలం ఆరోగ్యంగా బతకడం కూడా అవసరమే కదా. అనారోగ్యంతో బతికి ఉండి.. అవసరాలకు పక్కన వారిపై ఆధార పడి వారిని ఇబ్బందులకు గురిచేస్తూ మనమూ నరకం అనుభవిస్తూ బతకలేం కదా. అందుకే బతికున్నంత కాలం కాస్త ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం ఎంతో అవసరం.
ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం.. ఆగ్నేయ ఆసియాలో ప్రతి 8 నిమిషాలకు ఒకరు మరణిస్తున్నారట. ఇలా మరణించేవారిలో ఎక్కువగా గుండె సంబంధిత వ్యాధులతో మరణిస్తున్నవారే ఎక్కువట. ఆ గుండె సంబంధిత వ్యాధులకు దారి తీస్తున్న మూడు హానికారక భయంకరమైన అలవాట్ల గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెప్తోందో తెలుసుకుందాం.
ఆ మూడు అలవాట్లు ఏంటంటే.. పొగ తాగడం, అధిక ఉప్పు వినియోగం. ఈ మూడు మనకు తెలిసినవే.. అయినా చాలా మంది వాటిని తగ్గించడంలో నియంత్రించడంలో విఫలమవుతున్నారు. ఈ మూడు అలవాట్లను నియంత్రించుకుంటే గుండె సంబంధిత వ్యాధులు చాలా వరకు తగ్గుముఖం పడతాయని నిపుణులు చెప్తున్నారు. ఇప్పుడున్న సమాజంలో కేవలం డబ్బున్నవారు మాత్రమే ఏదన్నా జబ్బు పడితే ప్రైవేట్ హాస్పిటల్స్‌లో మెరుగైన చికిత్స చేయించుకునే పరిస్థితులు కళ్ల ముందే ఉన్నాయి. మధ్య తరగతి కుటుంబాలు అనారోగ్యానికి గురైతే హాస్పిటల్‌లో చేరే పరిస్థితుల్లో కూడా లేరనే చెప్పాలి. ఇక పేద వాడి కష్టం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
పోనీ ఆరోగ్య బీమాలు తీసుకుందామంటే వాటిలో కూడా మోసాలు జరుగుతున్న పరిస్థితులు. కాబట్టి.. బతికినంత కాలం అనారోగ్యం పాలవకుండా ఉండేందుకే మనం ప్రయత్నించాలి. ఎలాంటి చెడు అలవాట్లు లేనివారికి కూడా ప్రాణాంతక వ్యాధులు వస్తున్నాయి. కొందరు ఈ పాయింట్ మీద కూడా వితండ వాదం చేస్తుంటారు. చెడు అలవాట్లు లేనివారికి కూడా వ్యాధులు వచ్చి పోతున్నప్పుడు ఇక ఇంత డైట్ మెయింటైన్ చేయడం ఎందుకు అని ప్రశ్నలు వేస్తుంటారు. అలాంటివారికి ఏం సమాధానం చెప్తాం చెప్పండి. ఈ వాదన ఎలా ఉంటుందంటే.. మనిషి ఎప్పుడో ఒకప్పుడు మరణించక తప్పదు కాబట్టి ఇప్పుడే చనిపోవడం బెటర్ అన్నట్లుగా లేదూ..!