Maoist Leader Chalapati: మావోయిస్టులకు ఈరోజు బ్ల్యాక్ డే అనే చెప్పాలి. ఎవర్ని చూసుకుని రెచ్చిపోయి దాడులకు పాల్పడేవారో ఆ వ్యక్తి ఈరోజు జరిగిన ఎన్‌కౌంటర్‌లో చనిపోయాడు. అతనే చలపతి. పై ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తే అతను. జనవరి 19 నుంచి ఛత్తీస్‌గడ్, ఒడిశా సరిహద్దుల్లో పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 19 మంది మావోలు చనిపోగా.. అందులో చలపతి కూడా ఉన్నాడు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై (Chandrababu Naidu) అలిపిరిలో బాంబు దాడి చేసింది కూడా చలపతే. దాంతో అతనిపై కేంద్ర ప్రభుత్వం నిఘా వేసింది. అతనిపై రూ.1 కోటి రివార్డు కూడా ప్రకటించింది.
ఎవరీ చలపతి?
చలపతి అసలు పేరు జయరాం రెడ్డి. కానీ పోలీసులు నుంచి తప్పించుకునేందుకు జయరాం నుంచి చలపతి, రామచంద్రా రెడ్డి, అప్పారావు, రాము ఇలా ఎన్నో పేర్లు మార్చుకుని తిరిగాడు. కానీ ఇతన్ని అందరూ చలపతిగానే గుర్తించారు. చలపతి స్వస్థలం చిత్తూరులోని మదనపల్లె. పదో తరగతి వరకు చదువుకున్నాడు. ఆ తర్వాత పై చదువులు చదవలేకపోయాడు. చిన్నప్పటి నుంచి ఇతనికి మావో అవ్వాలని కోరిక ఉండేది. అది పదో తరగతిలో మరీ ఎక్కువైంది. ఇందుకు కారణం మదనపల్లెలో అప్పట్లో కనీస వసతులు లేకపోవడం, విద్యార్థులకు అవకాశాలు లేకపోవడం, కుల వివక్ష.
అలా మావోయిస్టుగా మారిన చలపతి.. తన చాకచక్య ధోరణి, నేతృత్వ లక్షణాలతో సెంట్రల్ కమిటీ సభ్యుడిగా మారాడు. ఏ ప్రాంతం మీదైతే ప్రభుత్వం చిన్న చూపు చూస్తుందో.. ఎక్కడైతే ప్రజలకు ప్రభుత్వం నుంచి అందాల్సినవి అందకుండా అన్యాయం జరుగుతోందో ఆ ప్రాంతాల్లో చలపతి ప్లాన్ వేసి దాడులకు పాల్పడేవాడు. చలపతి చెప్తే జీ హుజూర్ అనాల్సిందే. అతను ప్లాన్ వేస్తే అది పక్కా జరిగి తీరుతుందని నమ్మేవారు. చాలా సార్లు చలపతి వల్ల తమకు న్యాయం జరిగింది అంటూ కొందరు ప్రజలే ఆయన్ను పట్టించకుండా రక్షించేవారు. (Maoist Leader Chalapati)
బస్తర్ లాంటి దట్టమైన అడవుల్లో కూడా ఎక్కడెక్కడ తిరిగితే పోలీసుల నుంచి తప్పించుకోవచ్చో బాగా తెలిసిన వ్యక్తి చలపతి. ఇతని చుట్టూ 10 మంది గార్డులు ఉండేవారు. వారి చేతిలో AK-47s, SLR తుపాకీలు ఉండేవి. ఛత్తీస్‌గడ్‌లోని అబుజ్‌మడ్ ప్రాంతంలో తన భార్య అరుణతో కలిసి తిరుగుతుండే చలపతి.. అక్కడే ఉంటే సేఫ్ కాదని తెలిసి ఒడిశా సరిహద్దులో ఉన్న గరియాబంద్ అడవుల్లో తలదాచుకున్నాడు.
సెల్ఫీ పట్టించింది
ఓ రకంగా చలపతి మరణానికి కారణం అతను తన భార్యతో కలిసి తీసుకున్న సెల్ఫీనే. ఈ సెల్ఫీ మ్యాటర్ ఏంటంటే.. 2016 మేలో విశాఖపట్నంలోని కొయ్యూరు మండలంలో భద్రతా బలగాలు మావో నేత అయిన ఆజాద్‌ను మట్టుబెట్టారు. ఆ ఆజాద్ ఎవరో కాదు.. చలపతి భార్య అరుణ తమ్ముడే. ఆజాద్ చనిపోయినప్పుడు అతని నుంచి సేకరించిన వస్తువుల్లో ల్యాప్‌టాప్‌తో పాటు చలపతి, అరుణలు కలిసి తీసుకున్న సెల్ఫీ కూడా ఉంది. అప్పటివరకు చలపతి, అరుణ ఎలా ఉంటారో పోలీసులకు, భద్రతా సిబ్బందికి అంతగా తెలీదు. ఫోటోలు ఉన్నప్పటికీ వారి ముఖాలు క్లియర్‌గా కనిపించేవి కావు. కానీ ఆజాద్ దగ్గర దొరికిన సెల్ఫీలో మాత్రం క్లియర్‌గా వారి ముఖాలు కనిపించాయి. అప్పటి నుంచి చలపతిపై మరింత ఫోకస్ పెరిగింది. ఆ ఫోటోలను ప్రింట్ తీయించి అన్ని ప్రాంతాల్లో అంటించారు. అతన్ని పట్టిస్తే రూ.1 కోటి రివార్డు ఇస్తామని అన్నారు. (Maoist Leader Chalapati)
చంద్రబాబుని ఎందుకు చంపాలనుకున్నాడు?
చలపతిపై ఇంతటి భారీ రివార్డును ప్రకటించడానికి కారణం.. అతను అలిపిరిలో చంద్రబాబు నాయుడుపై బాంబు దాడి చేయడమే. 2003లో చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు.. మావోలకు వ్యతిరేకంగా పాలసీలు తీసుకొచ్చారు. తాను మావోలకు వ్యతిరేకినని.. ఏదైనా సూటిగా వచ్చి మాట్లాడే దమ్ముండాలని అనేవారు. దాంతో చలపతి చంద్రబాబును టార్గెట్ చేసాడు. మావోలకు వ్యతిరేకంగా గ్రే హౌండ్ బలగాలను రంగంలోకి దింపడంతో చలపతి పగ పెంచుకున్నాడు.
అప్పటివరకు ఎవరినైనా సులువుగా టార్గెట్ చేసి చంపేసే చలపతి అండ్ గ్యాంగ్ చంద్రబాబు పెట్టిన కొత్త రూల్స్ వల్ల కొందరు దొరికిపోవడం.. మరికొందరు ఎన్‌కౌంటర్లలో చనిపోవడం వంటి ఘటనలు జరిగాయి. చలపతి మాత్రం తప్పించుకోగలిగాడు. అదే సమయంలో అక్టోబర్ 1న చంద్రబాబు నాయుడు అలిపిరి వైపు నుంచి వెళ్తారని సమాచారం అందుకుని ఆ ప్రాంతంలో ల్యాండ్ మైన్స్ ఏర్పాటుచేయించాడు. చంద్రబాబు ప్రయాణిస్తున్న కారుతో పాటు మరో రెండు కార్లు పేలుడుకు గురయ్యాయి. చంద్రబాబు అదృష్టం బాగుండి ఆయన గాయాలతో బయటపడ్డారు. అప్పటి నుంచి చంద్రబాబుకు కమాండోల ద్వారా భద్రత కల్పిస్తున్నారు.
తెదేపా ఎమ్మెల్యేను కూడా
తెలుగు దేశం పార్టీకి చెందిన కిడారి సర్వేశ్వరరావు, మాజీ తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యే సివారి సోమాలను కాల్చి చంపింది కూడా చలపతి అండ్ గ్యాంగే. 2018లో వారు ఈ హత్యలకు పాల్పడ్డారు. అప్పటి నుంచి చలపతిపై నిఘా పెరిగింది. 2016లోనే చలపతి, అరుణలు ఎన్‌కౌంటర్‌లో చనిపోయారని వార్తలు సృష్టించారు. కానీ వారు అప్పుడు చావలేదు. మూడు రోజులుగా జరుగుతున్న ఎన్‌కౌంటర్‌లో మొత్తానికి చలపతి చనిపోవడంతో కేంద్రం ఊపిరి పీల్చుకుంది. అయితే ఆయన భార్య అరుణ మాత్రం తప్పించుకున్నారని తెలుస్తోంది. (Maoist Leader Chalapati)