Sheikh Hasina: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు మరణశిక్ష పడింది. బంగ్లాదేశ్‌కు చెందిన ఢాకా అంతర్జాతీయ క్రైమ్స్ ట్రిబ్యూనల్ హసీనాకు మరణశిక్ష విధించాలని తీర్పు వెలువడించడం సంచలనంగా మారింది. ఆమె బంగ్లాదేశ్ ప్రధానిగా ఉండగా మానవత్వానికి వ్యతిరేకంగా ఎన్నో అరాచకాలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ పలు కేసులు నమోదైన నేపథ్యంలో ట్రిబ్యూనల్ మరణశిక్ష ఖరారు చేసింది. తన హయాంలో తాను తీసుకునే నిర్ణయాలకు ఎవరు వ్యతిరేకంగా వ్యవహరించినా వారిని చంపేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.
గత ఏడాది ఆగస్ట్‌లో ఆమె తీసుకున్న నిర్ణయాల వల్ల అల్లర్లు చోటుచేసుకుని దాదాపు 1400 మంది చనిపోయారు. దాంతో బంగ్లా ప్రజలు హసీనా పాలనపై తిరగబడ్డారు. ఆమె కట్టుబట్టలతో వెంటనే అధికారిక విమానంలో తప్పించుకుని భారత్ రాజధాని ఢిల్లీలో ల్యాండ్ అయ్యారు. ఇప్పటివరకు కూడా ఆమె ఢిల్లీలోనే తలదాచుకున్నారు. ఈలోగా ట్రిబ్యూనల్ వాదోపవాదాలు విని ఆమెకు, బంగ్లాదేశ్ మాజీ హోంమంత్రి అసదుజ్జమాన్ ఖాన్‌కు మరణశిక్ష విధించింది. తీర్పుకు ముందు వరకు తనను అల్లా పుట్టించాడనే అల్లానే తన ప్రాణాలు తీసుకుంటాడని చెప్పిన హసీనా.. ఉన్నట్టుండి తనకు మరణశిక్ష పడిందని తెలీగానే ట్రిబ్యూనల్‌ను తప్పుబట్టారు. ఈ నేపథ్యంలో గతంలో ఇలాంటి నేరాలకు, అరాచకాలకు పాల్పడి మరణ శిక్ష పొందిన ప్రధాన మంత్రుల వివరాలను ఓసారి పరిశీలిద్దాం.
జుల్ఫికర్ అలీ భుట్టో – 1973 నుంచి 1977 వరకు పాకిస్థాన్ ప్రధానిగా ఉన్న భుట్టోకి కూడా మరణ శిక్ష పడింది. కాకపోతే.. పలు హత్యలకు పాల్పడిన నేపథ్యంలో అక్కడి న్యాయస్థానం భుట్టోకు ఉరిశిక్ష విధించగా.. 1979 ఏప్రిల్ 4న ఉరితీసారు.
ఐయాన్ అంటోనెస్క్యూ – 1940 నుంచి 1944 వరకు రొమేనియా ప్రధానిగా పనిచేసిన ఐయాన్‌కు కూడా ఉరిశిక్ష పడింది. 1946 జనవరి 1న ఉరి తీయకుండా కాల్పులు జరిపి మరణ శిక్ష విధించారు.
అద్నాన్ మెండెరెస్ – 1950 నుంచి 1960 వరకు టర్కీ ప్రధానిగా వ్యవహరించిన అద్నాన్‌కు 1961 సెప్టెంబర్ 17న ఉరిశిక్ష విధించారు.
బెనిటో ముస్సోలిని – 1922 నుంచి 1943 వరకు ఇటలీ ప్రధానిగా వ్యవహరించిన బెనిటోకు 1945 ఏప్రిల్ 28న కాల్పులు జరిపి మరణ శిక్ష అమలు చేసారు.
హిడెకి టోజో – 1941 నుంచి 1944 వరకు జపాన్ ప్రధాన మంత్రిగా వ్యవహరించిన హిడెకిని 1948 డిసెంబర్ 23న ఉరి తీసారు.
ఇమ్రే నాగీ – 1953 నుంచి 1956 వరకు హంగేరీ ప్రధానిగా పనిచేసిన ఇమ్రేని 1958 జూన్ 16న ఉరి తీసారు.
ప్యాట్రిస్ లుముంబా– 1960లో కాంగోకి ప్రధానిగా పనిచేసిన ప్యాట్రిస్‌ని 1961 జనవరి 17న కాల్పులు జరిపి మరణ శిక్ష విధించారు.
విడ్కున్ క్విస్లింగ్ – 1942 నుంచి 1945 వరకు నార్వేకి అధ్యక్షుడిగా వ్యవహరించిన ఈయన్ని 1945 అక్టోబర్ 24న కాల్పులు జరిపి మరణ శిక్ష విధించారు.
ఆమిర్ అబ్బాస్ హోవేడా – 1965 నుంచి 1977 వరకు ఇరాన్ ప్రధానిగా ఉన్న ఆమిర్‌ని 1979 ఏప్రిల్ 7న కాల్పులు జరిపి మరణ శిక్ష విధించారు.





