Senior Actress Tulasi: ఎన్నో సినిమాల్లో వైవిధ్యమైన పాత్రల్లో నటించిన సీనియర్ నటి తులసి యాక్టింగ్‌కు గుడ్‌బై చెప్పేసారు. ఈ ఏడాది డిసెంబర్ 31వరకు మాత్రమే నటిస్తానని.. ఆ తర్వాత ఇక సినిమాల్లో కనిపించనని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ప్రకటించారు. వచ్చే ఏడాది నుంచి తాను ఎంతో ఇష్టపడే సాయి బాబా సేవలోనే సంతృప్తిని సంతోషాన్ని వెతుక్కుంటానని తెలిపారు. మిస్టర్ పర్‌ఫెక్ట్, శ్రీమంతుడు వంటి సినిమాలతో పాటు తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించారు తులసి. తాను సాయి బాబా భక్తురాలినని.. పోయిన జన్మలో తాను సాయి బాబాకు తల్లినని చాలా ఇంటర్వ్యూలలో తెలిపారు.
శివమణి అనే కన్నడ దర్శకుడిని తులసి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరూ కలుసుకున్న మరుసటి రోజే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. వీరికి సాయి అనే కుమారుడు ఉన్నాడు. తులసి సోదరుడు చనిపోయినప్పుడు అతని చావుకి కారణం సాయి బాబానే అనుకుని ఆయన ఫోటోను విసిరికొట్టారట. ఇంతగా పూజిస్తే తన సోదరుడిని తీసుకుపోయాడు అని ఎప్పుడూ తిట్టుకుంటూ ఉండేవారట. ఓసారి నిద్రలో స్వయంగా బాబానే తన దగ్గరికి వచ్చి తల నిమిరి నీ సోదరుడిని చంపింది నేను కాదు.. నీ సోదరుడు నీ కొడుకు రూపంలో మళ్లీ పుడతాడు అని చెప్పారట. ఆయన చెప్పిన సమయానికే, చెప్పిన తేదీకే తనకు కొడుకు పుట్టాడని అందుకే సాయి అని పేరుపెట్టుకున్నానని తులసి తెలిపారు.
సాయి బాబా ఆశీస్సులతో తాను జాతకాలు కూడా చెప్తున్నానని.. ఎవరి నుంచి కూడా రూపాయి తీసుకోకుండా సాయం కోసం తన వద్దకు వచ్చిన వారికి తనకున్న జ్ఞానంతో వారి భవిష్యత్తుని చెప్పగలుగుతున్నానని.. చాలా మందికి తాను చెప్పింది చెప్పినట్లు జరిగినందుకు సంతోషంగా ఉందని తెలిపారు. అయితే సినిమాల కారణంగా ఈ వృత్తికి తాను పూర్తిగా సమయం కేటాయించలేకపోయానని కూడా అన్నారు. తులసి సహాయ పాత్రలో నటించిన కృష్ణ లీల సినిమా త్వరలో రిలీజ్ కానుంది.





