Saudi Arabia Accident: సౌదీ అరేబియాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 42 మంది హైదరాబాద్ వాసులు మృత్యువాతపడిన సంగతి తెలిసిందే. వీరంతా ఉమ్రా కోసం మక్కాకు వెళ్లి మదీనాకు బస్సులో తిరుగు ప్రయాణం అవుతుండగా ఆయిల్ ట్యాంకర్ వీరు ప్రయాణిస్తున్న బస్సును ఢీకొంది. దాంతో రెండు వాహనాలు పేలిపోయాయి. 42 మంది సజీవదహనం అవగా.. ఒక్కడు మాత్రం బతికి బయటపడ్డాడు. 24 ఏళ్ల మహ్మద్ అబ్దుల్ షోయబ్ అనే ప్రయాణికుడు నిద్ర పట్టకపోవడంతో డ్రైవర్ సీటు వద్దకు వెళ్లి అతనితో మాట్లాడుతూ కూర్చున్నాడట.
బస్సును ఆయిల్ ట్యాంకర్ ఢీకొనడానికి సెకన్ల ముందే షోయబ్‌తో పాటు డ్రైవర్ దూకేసారు. దాంతో షోయబ్ ప్రాణాలు కాపాడుకున్నాడు. ఉదయం 5:30 గంటల ప్రాంతంలో హైదరాబాద్‌లోని నాంపల్లిలో నివసిస్తున్న బంధువులకు ఫోన్ చేసి ప్రమాదం గురించి చెప్పాడట. ఉమ్రాకు షోయబ్‌తో పాటు అతని తల్లిదండ్రులు, తాతయ్య, నానమ్మ, మరికొందరు బంధువులు కూడా వెళ్లారు. వారంతా సజీవదహనం అయ్యారు. ఆ తర్వాత షోయబ్ నుంచి ఎలాంటి ఫోన్ రాలేదని.. ఆరా తీస్తే అతన్ని స్థానిక హాస్పిటల్‌కు తరలించారని తెలిసిందని కుటుంబీకులు తెలిపారు.
హైదరాబాద్‌కి చెందిన 35 ఏళ్ల సయ్యద్ రషీద్ అనే వ్యక్తికి మాత్రం జీర్ణించుకోలేని షాక్ తగిలింది. ఇతని కుటుంబానికి చెందిన 18 మంది మంటల్లో కాలిపోయారు. నవంబర్ 9న వారిని శంషాబాద్ విమానాశ్రయంలో దింపడానికి వెళ్లానని.. అదే చివరి చూపు అవుతుందని అనుకోలేదని కన్నీరుమున్నీరయ్యాడు. అప్పటికీ చిన్న పిల్లలతో కలిసి వెళ్లొద్దని వేడుకుంటూనే ఉన్నానని వారు వినిపించుకోలేదని అన్నాడు.






