Ravi Shastri: మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెందుల్కర్ క్రికెట్ రికార్డుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన 25 ఏళ్ల క్రికెట్ కెరీర్లో మరో టీం క్రికెటర్లతో గొడవపడటం కానీ.. స్లడ్జింగ్ చేయడం కానీ.. గొడవల్లో ఇరుక్కోవడం కానీ ఒక్కకంటే ఒక్క మచ్చ లేని మారాజు సచిన్. అలాంటి సచిన్‌కి మాజీ క్రికెటర్ రవిశాస్త్రి ఆపేంత కోపం వచ్చిందంటే నమ్ముతారా? ఇది నిజం. ఈ విషయాన్ని రవిశాస్త్రే స్వయంగా వెల్లడించారు. క్రికెట్ ఆస్ట్రేలియన్ క్యాపిటల్ టెర్రిటరీ నిర్వహించిన సమ్మర్ ఆఫ్ క్రికెట్ లాంచ్ అనే కార్యక్రమంలో రవిశాస్త్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇప్పటివరకు తనకు సచిన్‌కి తప్ప ఇంకెవ్వరికీ తెలియని విషయాన్ని పంచుకున్నారు.
ఆస్ట్రేలియన్ క్రికెటర్లతో మ్యాచ్ అంటేనే మైదానంలో బండ బూతులు వినిపించడం కామన్ అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే ఆస్ట్రేలియన్లు స్లడ్జింగ్ చేసినంత ఇంకెవ్వరూ చేయరు అని అంటుంటారు. 1991 నుంచి 1992 మధ్య నైరోబీలో జరిగిన ICC ఛాంపియన్స్ ట్రోఫీలో సచిన్ కూడా ఆడారు. ఆయనకు అది తొలి ఆస్ట్రేలియా టూర్. అప్పుడు సచిన్ వయసు 18. సిడ్నీ, పెర్త్‌లో జరిగిన టెస్ట్ మ్యాచుల్లో రెండు సెంచరీలు బాది తానేంటో నిరూపించేసుకున్నాడు. ఆ మ్యాచ్‌లో రవిశాస్త్రి కూడా ఆడారు. రవిశాస్త్రి కూడా అదే మ్యాచ్‌లో డబుల్ సెంచరీ బాదేసాడు.
క్రికెట్లో అవతలి టీం బాగా ఆడుతుంటే ఆస్ట్రేలియాకు ఎక్కడలేని కోపం పొడుచుకు వచ్చేస్తుంది. ఆ రోజు కూడా అదే జరిగింది. రవిశాస్త్రి, సచిన్ తమ దేశంలో క్రికెట్ ఆడటానికి వచ్చి సెంచరీలు బాదేస్తుంటే చూసి ఓర్వలేకపోయారు. స్టీవ్ వాగ్, మార్క్ వాగ్లు కలిసి సచిన్‌ను పట్టుకుని నువ్వు అది నువ్వు ఇది అంటూ నోటికొచ్చినట్లు వాగారు. వీరితో పాటు 12వ సబ్‌స్టిట్యూట్ ప్లేయర్‌గా ఉన్న మార్క్ వైట్నీ కూడా జత కలిసి బూతులు తిట్టడం మొదలుపెట్టాడు. రవిశాస్త్రి సెంచరీ బాదిన తర్వాత అప్పటి ఆస్ట్రేలియన్ కెప్టెన్ ఆల్లన్ బోర్డర్ నోటికి పని చెప్పాడు. అప్పుడు మైక్ వైట్నీ కలగజేసుకుని నువ్వు క్రీజులోకి వెళ్లకపోతే తల పగలగొడతా అని వాగాడు. అప్పుడు రవిశాస్త్రి అన్న ఒక్క మాటకు అక్కడున్న ప్లేయర్లు అంతా షాకయ్యారు. చూడు మైక్.. నీకు నిజంగా అంత సీన్ ఉంటే నువ్వు 12వ సబ్‌స్టిట్యూట్ ప్లేయర్‌గా ఉండేవాడివి కావు అన్నాడు. అది విని మైక్‌కి తల ఎక్కడ పెట్టుకోవాలో అర్ధం కాలేదు. ఇది కెమెరాల్లో రికార్డ్ అయ్యింది. అయితే రవిశాస్త్రికి ఎలాంటి జరిమానా విధించలేదు. ఎందుకంటే ఆయన బూతులు మాట్లాడలేదు కాబట్టి.
ఇదంతా అక్కడే ఉండి గమనిస్తున్న సచిన్ ఉండబట్టలేక రవిశాస్త్రి దగ్గరికి వెళ్లాడు. నేను సెంచరీ బాదాక ఒక్కొక్కడి పని చెప్తా అన్నాడట కోపంతో. అప్పుడు రవిశాస్త్రి.. నువ్వు నోర్మూసుకుని ఉండు సచిన్. నువ్వు కాదు సమాధానం చెప్పాల్సింది. నీ బ్యాటు. అని సచిన్‌ని కూల్ చేసాడట. ఆ తర్వాత సచిన్ డబుల్ సెంచరీలు బాదడం.. ఆస్ట్రేలియన్ క్రికెటర్ల నోర్లు మూయించడం అన్నీ జరిగాయి. అయితే.. ఇంత జరిగిన తర్వాత కూడా ఆ సమయంలో ఒక అద్భుతం జరిగిందట. ఆట అయిపోయాక టీమిండియా ప్లేయర్లు డ్రెస్సింగ్ రూమ్‌లోకి వెళ్లిపోయాక.. వారితో కలిసి సెలబ్రేషన్స్ చేసుకోవడానికి ఆస్ట్రేలియన్ క్రికెటర్లు మందు సీసాలు పట్టుకుని వచ్చారట. క్రీడల్లో ఉండాల్సింది ఇలాంటి మనస్తత్వమే అంటూ అప్పుడు జరిగిన విషయాన్ని రవిశాస్త్రి అందరితో పంచుకున్నారు.





