Prudhvi Raj Laila Speech: ఎప్పుడు ఏం మాట్లాడాలో ప్రతి ఒక్కరికి తెలిసుండాలి. మరీ ముఖ్యంగా సెలబ్రిటీలు, రాజకీయ నాయకులకు. సంబంధం లేని చోట సంబంధం లేని విషయాలు మాట్లాడితే చివరికి వారే నవ్వుల పాలవుతారు. ఈ విషయం 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ రాజ్‌కు బాగా వర్తిస్తుంది. ఒకప్పుడు ఆయన వైఎస్సార్ కాంగ్రెస్‌లో ఉన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి ఛైర్మన్‌గా పనిచేసారు. ఆ తర్వాత ఆయన టిటిడిలో పని చేస్తున్న ఉద్యోగినితో అసభ్యకరంగా మాట్లాడాడని ఆరోపణలు రావడంతో ఆయన రాజీనామా చేసేసారు. తనను కావాలంటే ఇలాంటి ఆరోపణలు చేస్తూ ఇరికించారని వైసీపీపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఇలాంటి పార్టీలో ఉండను అని బయటికి వచ్చేసారు.
ఆ తర్వాత జనసేనలో చేరారు. ఆయన జనసేనలో చేరినప్పటి నుంచి కాస్త ఎక్కువ చేస్తున్నారు. ఎన్నికలకు ముందు వరకు రోజాపై, జగన్ మోహన్ రెడ్డితో పాటు ఇతర వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులను నోటికొచ్చినట్లు తిట్టేవారు. సరే.. ఆయనకు వ్యక్తిగతంగా వారిపై కక్ష ఉందని తిడుతున్నారు అనుకోవచ్చు. ఎన్నికల్లో జనసేన, తెలుగు దేశం, భారతీయ జనతా పార్టీ కూటమే గెలుస్తుందని పలుమార్లు అనేవారు. ఆయన అన్నట్లే.. జగన్ ఓడిపోయారు. జగన్ ఓడిపోయినప్పటి నుంచి పృథ్వీ ఎక్కడికి వెళ్లినా 11 సీట్లు అనే టాపిక్‌ను ప్రస్తావిస్తున్నారు. ఆయన రాజకీయ పరంగా ఈ వ్యాఖ్యలు చేస్తే అర్థం ఉంటుంది. కానీ సినిమాలకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్లకు వెళ్లి అక్కడ కూడా 11 సీట్లు అని ప్రస్తావిస్తున్నారు.
Prudhvi Raj Laila Speech విశ్వక్ సేన్ నటించిన లైలా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈరోజు జరుగుతోంది. ఈ ఈవెంట్‌కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా వచ్చారు. అయితే.. ఈ సినిమాలో కీలక పాత్రలో నటించిన పృథ్వీ.. చిరంజీవి ఉన్నారు కదా అని రెచ్చిపోతూ మళ్లీ 11 సీట్లు అనే టాపిక్ తెచ్చారు. సినిమాలో తన సన్నివేశం వచ్చినప్పుడు ఆ సన్నివేశంలో మేకలు ఉంటాయని.. ఎన్ని మేకలు ఉన్నాయని అడిగితే 150 మేకలు ఉంటాయని చెప్పారని.. ఆ తర్వాత సినిమా లాస్ట్ సీన్‌లో మళ్లీ మేకలను లెక్కేస్తే 11 ఉన్నాయని.. తనకు చాలా ఆశ్చర్యం వేసిందని అన్నారు. సందర్భం ఏంటో చూసుకోకుండా జగన్ పతనం గురించి మాట్లాడటం.. ఆ తర్వాత తనలో తాను నవ్వేసుకోవడం.. ఆ తర్వాత ఎవ్వరూ తనను సీరియస్‌గా తీసుకోవడంలేదు అనుకుని టాపిక్ సినిమా పైకి మార్చడం లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో జరిగాయి. ఇప్పటికైనా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంబంధం లేని విషయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గురించి కానీ రాజకీయాల గురించి కానీ మాట్లాడద్దు అని తన పార్టీ నేతలకు చెప్తే బాగుంటుంది. లేదంటే.. చివరికి వారే నవ్వుల పాలవుతారు. అది కాస్తా పార్టీకి నష్టాన్ని తెస్తుందే తప్ప అంతకు మించి ఏమీ జరగదు.