Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్‌కు గాయాలయ్యాయి. ప్రస్తుతం మార్క్ సింగపూర్‌లోని ఓ స్కూల్‌లో చదువుకుంటున్నాడు. ఆ స్కూల్‌లో అగ్నిప్రమాదం జరిగిన కారణంగా మార్క్ చేతులకు, కాళ్లకు గాయాలు అయ్యాయి. అదే విధంగా ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లిపోవడంతో ఇబ్బందులకు లోనయ్యాడు. మార్క్ శంకర్‌ను స్థానిక హాస్పిటల్‌కి తరలించి వైద్యం అందిస్తున్నారు. ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు జిల్లా పర్యటనలో ఉన్న పవన్ కల్యాణ్‌కి విషయం తెలీడంతో ఆయన ఈ పర్యటను క్యాన్సిల్ చేసుకోవాలని అధికారులు, ఇతర నేతలు సూచించారు.
కానీ ఆయన అరకు సమీపంలోని కురిడి గ్రామం సందర్శిస్తానని ఆ గ్రామ గిరిజనులకు నిన్న మాట ఇచ్చానని… కాబట్టి ఆ గ్రామం వెళ్ళి వారితో మాట్లాడి అక్కడి సమస్యలు తెలుసుకొంటానని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. అదే విధంగా అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభానికి ఏర్పాట్లు చేసినందున వాటిని పూర్తి చేసి వెళ్తానని తెలిపారు. మన్యంలో పర్యటన ముగించుకొని పవన్ కల్యాణ్ విశాఖ చేరుకుంటారు. అక్కడి నుంచి సింగపూర్ వెళ్ళేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆన్నా లెజ్నొవా, పవన్ దంపతులకు పుట్టిన బిడ్డే మార్క్ శంకర్ పవనోవిచ్. అకీరా నందన్, ఆద్య, మార్క్‌లతో పాటు.. ఆన్నాకు తన మొదటి భర్త ద్వారా పుట్టిన పాపను కూడా పవన్ సొంత బిడ్డగానే చూసుకుంటున్నారు.