Virat Kohli Anushka Sharma ఈ మధ్యకాలంలో సినీ పరిశ్రమలో విడాకుల పర్వం కొనసాగుతోంది. అదేదో ప్రకటనలో ఏం నడుస్తోంది అని అడిగితే.. ఫాగ్ నడుస్తోంది అన్నట్లు.. ఏం జరుగుతోంది అని సోషల్ మీడియా ఓపెన్ చేస్తే ఎవరో ఒక సెలబ్రిటీ విడాకులను ప్రకటంచే పర్వం కొనసాగుతోంది. ఈరోజు ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ (AR Rahman) తన భార్య సైరా భానుతో (Saira Bhanu) విడిపోతున్నట్లు ప్రకటించి అందరినీ షాక్‌కు గురిచేసారు. నెల రోజుల క్రితం ప్రముఖ తమిళ నటుడు జయం రవి తన భార్య ఆర్తితో విడిపోతున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత ఆర్తి తాను విడాకులకు ఒప్పుకోలేదని.. తన అనుమతి లేకుండానే రవి విడాకుల గురించి ప్రకటించేసారని ఆరోపించారు.
విరాట్ అనుష్క విడాకులా?
ఇవన్నీ సరే.. మరి విరాట్ కోహ్లీ.. (Virat Kohli) అనుష్క శర్మ (Anushka Sharma) ఈ టాపిక్‌లోకి ఎందుకు వచ్చారు అనుకుంటున్నారా? దీనికి ఓ కారణం ఉంది. సాధారణంగా విడాకులు ప్రకటించే సమయంలో సెలబ్రిటీలు ఒక ఫార్మాట్ ఫాలో అవుతారు. ఒక ప్లెయిన్ పేజీపై తాము విడిపోతున్నామని చల్లగా చావు కబురు చెప్పినట్లు చెప్తుంటారు. ఈరోజు రెహమాన్ కూడా అలాగే ప్రకటించారు. అయితే.. ఈరోజు విరాట్ కోహ్లీ ఓ పోస్ట్ పెట్టారు. ఆ పోస్ట్‌లో తన దుస్తుల బ్రాండ్ అయిన రాంగ్ (Wrogn) గురించి ప్రస్తావించారు.
బ్రాండ్ ప్రమోషన్లు చేసేటప్పుడు సెలబ్రిటీలు మంచి దుస్తులు వేసుకుని బాగా ప్రమోట్ చేస్తుంటారు. కానీ విరాట్ అలా చేయలేదు. తన బ్రాండ్‌ని ప్రమోట్ చేసుకునే క్రమంలో పెట్టిన పోస్ట్ కాస్తా అది విడాకుల పోస్ట్‌లా మారిపోయింది. దాంతో నెటిజన్లు కనీసం అందులో ఏమని రాసుందో కూడా చూసుకోకుండా అనుష్క, విరాట్ విడాకులు అంటూ పొరబడ్డారు. ఆ తర్వాత అందులో ఉన్న విషయం ఏంటో చదివి ఊపిరి పీల్చుకున్నారు. ఇలాంటి ఫార్మాట్‌లలో కేవలం విడాకుల గురించే ప్రకటనలు చేస్తారని.. బ్రాండ్ ప్రమోషన్లు.. ఇతర ప్రకటనలు చేయాలంటే వేరే రకంగా కూడా ప్రమోట్ చేసుకోవచ్చని విరాట్‌కి నెటిజన్లు సలహాలు ఇస్తున్నారు. ఆ పోస్ట్ చూసి ఒక్క క్షణం గుండె ఆగిపోయిందంటూ డై హార్డ్ ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు.
రెహమాన్ విడాకులకు కారణమేంటి?
ఏఆర్ రెహమాన్‌ది పెద్దలు కుదిర్చిన వివాహమే. 1993లో ఆయన సైరాను వివాహం చేసుకున్నారు. 26 ఏళ్ల వయసులో తనకు ఓ మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేయాలని రెహమాన్ తన తల్లిని కోరారు. అలా సైరా, రెహమాన్‌ల వివాహం జరిగింది. వీరికి ముగ్గురు పిల్లలు. అసలు రెహమాన్ విడాకులు తీసుకోవడమేంటి అని చాలా మంది ఇప్పటికీ షాక్‌లో ఉన్నారు. ఎందుకంటే రెహమాన్‌కి తన భార్య పట్ల ప్రేమ, గౌరవం ఎంతున్నాయో ఎప్పుడూ చెప్తుంటారు. అలాంటిది ఉన్నట్లుండి ఏమైంది అనే ప్రశ్నలు తలెత్తున్నాయి. అయితే.. రెహమాన్ విడాకులు ప్రకటించిన నేపథ్యంలో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. రెహమాన్ బ్యాండ్‌లో బేసిస్ట్ (బేస్ వాయించే వారు) గా చేస్తున్న మోహిన్ డేయ్ కూడా విడాకులు ప్రకటించారు. మోహిని భర్త మార్క్ హార్ట్‌సచ్ సాక్సోఫోనిస్ట్‌గా పనిచేస్తున్నారు. ఈరోజు వీరిద్దరూ విడిపోతున్నట్లు ప్రకటించడంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.