Mohan Babu: రెబెల్‌స్టార్ ప్రభాస్ ఈరోజున తన 46వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. అన్ని పరిశ్రమలకు చెందిన సెలబ్రిటీల నుంచి రాజకీయనేతల వరకు అందరూ డార్లింగ్‌కి సోషల్‌మీడియా ద్వారా బర్త్‌డే విషెస్ చెప్తున్నారు. మన ప్రధాని నరేంద్ర మోదీ కూడా ప్రభాస్‌కు విషెస్ తెలిపారు. అయితే.. ప్రభాస్ బర్త్‌డే వచ్చిన ప్రతీసారి ఆయన నటిస్తున్న సినిమాల కంటే ఎక్కువగా పెళ్లి గురించే ఎక్కువ మంది చర్చిస్తూ ఉంటారు. కనీసం ఈ ఏడాదైనా పెళ్లి చేసుకో అన్నా అంటూ అభిమానులతో సమానంగా సెలబ్రిటీలు సరదాగా ఆటపట్టిస్తుంటారు.
అభిమానులతో పాటు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కూడా ప్రభాస్ పెళ్లి గురించే ఆలోచిస్తున్నట్లున్నారు. అందుకే ఆయన కూడా సోషల్ మీడియా వేదికగా విషెస్ చెప్తూ తన మనసులో మాట బయటపెట్టారు. “” మై డియర్ డార్లింగ్ బావా.. ఈ దేశానికే గర్వకారణమైన నువ్వు ఇలాగే వందల ఏళ్ల పాటు సంతోషకరమైన పుట్టినరోజు వేడుకలను జరుపుకోవాలని ఆశిస్తున్నాను. త్వరలో నువ్వు పెళ్లి చేసుకోవాలని అరడజను మంది పిల్లల్ని కని సంతోషకరమైన జీవితం గడపాలని ఆకాంక్షిస్తున్నాను. ఇట్లు ఎల్లప్పుడూ నీ మేలు కోరే నీ బావ “” అని విషెస్ తెలిపారు.
మోహన్ బాబు విషెస్ చెప్తూ వేసిన ట్వీట్ కింద అభిమానులు ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు. కనీసం మీ మాట వినైనా మా డార్లింగ్ ఈ ఏడాది పెళ్లి చేసుకుంటారని ఆశిస్తున్నాం మోహన్ బాబు గారూ అని కొందరు అంటుంటే.. మరికొందరేమో అసలు పెళ్లి చేసుకుంటే చాలు అని మేం అనుకుంటుంటే మీరు అరడజను పిల్లలు అంటారేంటి సార్ అని కామెంట్స్ చేస్తున్నారు. కన్నప్ప సినిమాలో ప్రభాస్ రుద్ర పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ప్రభాస్‌కు మంచు ఫ్యామిలీకి ఎన్నో సంవత్సరాలుగా మంచి అనుబంధం ఉంది.
అందుకే తాను రుద్ర పాత్రలో నటిస్తావా డార్లింగ్ అని అడగ్గానే ఆయన మరో మాట మాట్లాడకుండా ఒప్పేసుకున్నారని సినిమా షూటింగ్ జరుగుతున్నంత సేపూ ప్రభాస్ తనకు ఎంతో అండగా నిలబడ్డాడని మంచు విష్ణు తెలిపారు. ఇక ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ప్రభాస్ కొత్త సినిమాకు సంబంధించిన ఆసక్తికరమైన అప్డేట్ ఒకటి రిలీజ్ అయింది. ఆయన హను రాఘవపూడి డైరెక్షన్‌లో కలిసి నటిస్తున్న సినిమాకు ఫౌజీ అని టైటిల్ పెట్టినట్లు ప్రకటిస్తూ పోస్టర్‌ను రిలీజ్ చేసారు. దీంతో పాటు ఆయన రాజా సాబ్, సలార్ 2, కల్కి 2 సినిమాలతో బిజీగా ఉన్నారు.