Manchu Manoj మంచు కుటుంబంలో కొద్ది రోజులుగా జరుగుతున్న గొడవలను చూస్తూనే ఉన్నాం. ఆస్తుల విషయంలో ఇలా ఒక కుటుంబం అంతా రోడ్డు మీదకు వచ్చింది. ఆ వివాదం ఎంత దాకా వెళ్లిందంటే.. ఏం జరిగింది సార్ అని మీడియా వాళ్లు ప్రశ్నిస్తుంటే వారిపైకి దాడికి దిగేంతలా. నిన్న సీనియర్ నటుడు మోహన్ బాబు (Mohan Babu) జల్‌పల్లిలోని తన నివాసం వద్ద కవరేజ్ ఇస్తున్న మీడియా వాళ్లపై మైకుతో దాడి చేయడం సంచలనంగా మారింది. ఈ దాడిలో పలువురు మీడియా ప్రతినిధులు కాస్త తీవ్రంగానే గాయపడ్డారు.
నేను సారీ చెప్తున్నా
ఈ నేపథ్యంలో మోహన్ బాబుపై మీడియా సంఘం ధర్నాకు దిగింది. ఆయన మీడియాకు క్షమాపణలు చెప్పాలని.. మీడియా వర్గాలు తమ పని తాము చేసుకుంటేంటే కొట్టే హక్కు ఎవ్వరికీ లేదని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో మంచు మనోజ్ క్షమాపణలు చెప్పారు. తన తండ్రి తరఫున తాను క్షమాపణలు చెప్తున్నట్లు వెల్లడించారు.
“” నిన్న రాత్రి మీడియా జల్‌పల్లిలోని మా నివాసం ముందు నా కోసం నిలబడింది. నా కోసం నిజాన్ని బయటపెట్టాలని చూసిన జర్నలిస్టులపై మా నాన్న చేయిచేసుకున్నారు. అది నిజంగా బాధాకరం. ఆయన తరఫున నేను క్షమాపణలు చెప్తున్నాను. అన్ని విషయాలు నేను ఇప్పుడే చెప్పలేను. నాపై నాన్న బౌన్సర్లు దాడి చేసారు. కాలు బెణికింది. మెడ దగ్గర గాయమైంది. ఓపిక లేదు. నాకు ఏడు నెలల బిడ్డ ఉంది. ఈ సమయంలో నేను నా భార్యా పిల్లల దగ్గర ఉండాలి. అన్ని సమస్యలు తీరాక నేనే మీడియా ముందుకు వస్తాను. నాకు కాస్త సమయం ఇవ్వండి. నేను తాగుడుకి బానిసయ్యాను అని నాన్న అన్నారు. నేను ఎప్పుడు తాగాను? తాగి ఎవర్ని కొట్టాను? నా భార్యను కొట్టానా.. బిడ్డలను కొట్టానా.. మా అమ్మను కొట్టానా? నా ఇంట్లో సీసీ కెమెరాలు మిస్సయ్యాయి. అవి తెప్పిస్తే ఎవరు గొడవ చేసారో తెలుస్తుంది. ఈ సందర్భంగా మంచు విష్ణు (Manchu Vishnu) అన్నకు కూడా క్షమాపణలు చెప్తున్నా “” అంటూ మీడియా ముందు కన్నీరుపెట్టుకున్నారు.
అసలేం జరిగింది?
Manchu Manoj: ఉన్నట్టుండి రెండు రోజుల క్రితం మోహన్ బాబు మంచు మనోజ్‌లు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారని.. ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేసుకున్నారన్న విషయం సంచలనంగా మారింది. ఈ మేరకు మోహన్ బాబు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం.. మనోజ్ తాగుడుకు బానిసై పెళ్లాం మాటలు నమ్మి తమపై దాడి చేస్తున్నాడని.. అతని నుంచి ప్రాణ హాని ఉందని పేర్కొన్నారు. మరో పక్క మనోజ్.. గుర్తు తెలియని వ్యక్తులు తనపై చేయిచేసుకున్నారని.. తాను తాగడం లేదని.. తన బిడ్డను తన తల్లి దగ్గర ఉంచి ఓ ఆయాను నియమించానని.. ఆ ఆయాపై మోహన్ బాబు దగ్గర పనిచేస్తున్న వ్యక్తి ఒకరు అసభ్యకరంగా ధూషించాడని దాంతో కోపం వచ్చి తనపై చేయిచేసుకున్నానని అన్నారు. అతన్ని కొడితే తన తండ్రికి కోపం వచ్చి కన్న కొడుకునని కూడా చూడకుండా బౌన్సర్ల చేత కొట్టించాడని పేర్కొన్నారు. తన తండ్రి నుంచి అతని దగ్గర పనిచేసే వారి నుంచి తనకు ప్రాణ హాని ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు.
నా ఇంటి జోలికి వస్తే ఊరుకోను: మౌనిక
అయితే.. మంచు మనోజ్ పోలీసులను ఆశ్రయించి తనకు రక్షణ కల్పించాలని కోరగా.. పహాడీ షరీఫ్ ఇన్‌స్పెక్టర్ కొందరు పోలీసులను నియమించారు. నేను చూసుకుంటాను సార్ అంటూనే మనోజ్ ఇంటికి నుంచి వారు తప్పుకున్నారు. దాంతో మనోజ్ భార్య భూమా మౌనికా రెడ్డి (Bhuma Mounika Reddy) మండిపడ్డారు. ఇన్‌స్పెక్టర్‌కి ఫోన్ చేసి తనకు కానీ తన భర్తకు కానీ పిల్లలకు కానీ హాని జరిగితే మాత్రం ఊరుకోనని.. సెక్యూరిటీని ఎందుకు తీసేసారని ఫోన్ ద్వారా సంభాషించారు. మరో పక్క మనోజ్ విష్ణు, మోహన్ బాబులకు చెందిన మనుషులే తన దగ్గర సెక్యూరిటీగా ఉన్న వారిని బెదిరించి పంపేసారని ఆరోపిస్తున్నారు.
నిలకడగా మోహన్ బాబు ఆరోగ్యం
నిన్న జరిగిన గొడవలో మోహన్ బాబు ఆవేశానికి గురికావడంతో ఆయన బీపీ లెవెల్స్ పెరిగిపోయాయి. దాంతో విష్ణు ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో చేర్పించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది.