Maganti Sunitha: హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. BRS నేత మాగంటి సునీతపై కాంగ్రెస్ అభ్యర్ధి నవీన్ యాదవ్ 25 వేల ఓట్లకు పైగా మెజారిటీతో గెలిచారు. దీనిపై మాగంటి సునీత మీడియా ముందుకు వచ్చి తన ఓటమికి గల కారణాలను వెల్లడించారు. పబ్లిక్‌గా అందరు చూస్తుండగానే ప్రజలకు డబ్బులు ఇచ్చి కాంగ్రెస్ గెలిచిందని.. నిజానికి నైతికంగా గెలిచింది మాత్రం తానే అని సునీత అన్నారు. కాంగ్రెస్‌తో పాటు నాలుగైదు పార్టీలు కుమ్మక్కై తనపై పోటీ చేసినా.. తన భర్త, దివంగత నేత మాగంటి గోపీనాథ్‌కు వచ్చినంత మెజార్టీనే తనకూ వచ్చిందని అన్నారు. ఆడబిడ్డ అని కూడా చూడకుండా తన క్యారెక్టర్‌ను తప్పుగా చేసి మాట్లాడినప్పటికీ తాను ధైర్యంగా పోరాడానని.. ప్రజలకు డబ్బులు పంచుతూ.. రౌడీయిజంతో గెలిచిన గెలుపు అసలు గెలుపు కానేకాదని అన్నారు.
“” ప్రజాస్వామ్యంలో అప్రజాస్వామికంగా జరిగిన ఈ ఉప ఎన్నికలో రౌడీయిజంతో గెలిచారు నవీన్ యాదవ్. ప్రజలు నాకు చాలా వరకు సపోర్ట్ చేసారు. వారందరికీ నా ధన్యవాదాలు. ఈ ప్రజాస్వామ్యంలో ఇలా జరిగిన ఈ ఎన్నిక గురించి అనుకోవాల్సిన అవసరం లేదు. మొన్న 11న ఓటింగ్ రోజు అందరూ చూసారు. ఏం జరిగిందో అందరికీ తెలుసు. రిగ్గింగ్, రౌడీయిజాలు ఇవే పైకి వచ్చాయి. ఇవే గెలిపించాయి. అది కూడా ఒక మహిళ మీద. అది ఎంత వరకు న్యాయమో మీరే ఆలోచించండి. ప్రజలు కూడా ఆలోచించుకోవాలి. అంత భయాందోళనకు గురి చేసినా కూడా ఒకరు భయపడతారు మరొకరు ధైర్యంగా ఉన్నారు. ధైర్యంగా ఉన్నవారు నాకు ఓటు వేసారు. భయపడినవారు నవీన్‌కు ఓటేసారు. మావారు బతికున్నప్పుడు అణిగిమణిగి ఉన్నాడు నవీన్. ఆయన పోయాక ఎగిరి ఎగిరి గెలిచాడు. ఆ గెలుపు గురించి మాట్లాడటానికి కూడా సిగ్గుగా ఉంది. మేం కట్టుకున్న చీరలు కూడా వాడెవడో ఇచ్చిన చీర కట్టుకుని వచ్చారు అని కామెంట్స్ చేసారు. గతంలో ఉప ఎన్నికలు ఎలా జరిగాయో చూస్తే ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఎలా జరిగిందో మీకు అర్థమై ఉంటుంది. ఈ రౌడీయిజం చూస్తున్నారు కదా? 4 నెలలుగా బెదిరింపులకు పాల్పడుతున్నారు. నీ గెలుపు కూడా ఒక గెలుపు కాదు. నేను నైతికంగా గెలిచా. సింగిల్‌గా పోటీ చేసి మా వారు బతికుంటే ఎంత వచ్చేవో అంతే ఓట్లు వచ్చాయి నాకు“” అని తెలిపారు.





