Kalvakuntla Kavitha: పార్టీ నుంచి బయటికి గెంటేసింది గాక ఇప్పుడు పదేళ్లలో ఎన్నడూ లేని విధంగా ఇంటి అల్లుడిపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ BRS ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధినేత్రి కల్వకుంట్ల కవిత ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇప్పటివరకు ఎన్నడూ తన భర్త పేరు రాజకీయాల్లో వినిపించలేదని.. ఇప్పుడు మాత్రం భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్ నేతలు తన భర్తను లాగుతున్నారని అన్నారు.
తన భర్త గురించి తప్పుడు వ్యాఖ్యలు చేసిన వారికి నోటీసులు పంపడం జరిగిందని.. వెంటనే పబ్లిక్‌గా క్షమాపణలు చెప్పకపోతే కోర్టుకు ఈడుస్తానని హెచ్చరించారు. తనను పార్టీ నుంచి వెళ్లగొట్టినా వారి కోరిక తీరలేదని.. ఇప్పుడు ప్రజలు తన వద్దకు వస్తున్నారని BRS ప్రభుత్వం చేసిన తప్పుల గురించి తనకు చెప్పుకుంటున్నారన్న కోపంతో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు.
తన తండ్రిలా తనకు ఓపిక సహనం లేవని.. తన జోలికి కానీ తన భర్త జోలికి కానీ వస్తే కాళ్లు విరగ్గొడతానని అన్నారు. ఎప్పుడో ఒకప్పుడు దేవుడి దయ వల్ల తాను ముఖ్యమంత్రి అయితే మాత్రం అప్పుడు ఒక్కొక్కడి లెక్కలు తేలుస్తానని తెలిపారు. దీనిని బట్టి చూస్తే వచ్చే ఎన్నికల్లో కవిత తెలంగాణ జాగృతి పార్టీ తరఫున పోటీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.





