Attack On Saif Ali Khan: బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్‌పై నిన్న రాత్రి ఓ దుండగుడు కత్తితో దాడి చేసిన సంగతి తెలిసిందే. రాత్రి 2 గంటల సమయంలో ముంబైలోని బాండ్రాలో ఉంటున్న సైఫ్ నివాసంలోకి చొరబడిన దుండగుడు.. తనను పట్టుకోవడానికి వచ్చిన సైఫ్‌పై ఆరు కత్తిగాట్లు దింపాడు. ప్రస్తుతం దుండుగుడు పరారీలో ఉన్నాడు. సైఫ్ లీలావతి హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. అయితే.. ప్రధాన విచారణ ప్రకారం.. సైఫ్ ఇంట్లోకి బయటి నుంచి ఓ వ్యక్తి లోపలికి వెళ్తున్నట్లు సీసీ కెమెరాలో ఎక్కడా లేదట. అంటే ఇంట్లో వారి పనే అయ్యుంటుందని పోలీసులు అంచనాకి వచ్చారు. దాంతో ఇంట్లో పనిచేసే వారందరినీ అదుపులోకి తీసుకుని విచారణ చేపడుతున్నారు. వారి సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
2012లో ఏం జరిగింది?
సైఫ్ అలీ ఖాన్ 2012లో ఓ ఘర్షణలో ఇరుక్కున్నారు. ముంబైలోని వాసాబి రెస్టారెంట్‌లో సైఫ్ తన భార్య (అప్పుడు ప్రేయసి) కరీనా కపూర్‌తో పాటు క్లోజ్ ఫ్రెండ్స్ అయిన అమృతా అరోరా, మలైకా అరోరాలతో కలిసి డిన్నర్ చేస్తున్నారు. ఆ సమయంలో వారు గట్టి గట్టిగా నవ్వుకుంటూ మాట్లాడుకుంటున్నారు. అదే సమయంలో సౌతాఫ్రికాకు చెందిన వ్యాపారవేత్త ఇక్బాల్ శర్మ కూడా అదే రెస్టారెంట్‌లో ఉన్నారు. సైఫ్ అలీ ఖాన్ అలా గట్టిగా అరుస్తూ మాట్లాడటం ఇక్బాల్‌కు డిస్టర్బెన్స్‌గా అనిపించింది. దాంతో కాస్త నెమ్మదిగా మాట్లాడుకోండి అని ఇక్బాల్ సైఫ్‌ని రిక్వెస్ట్ చేసాడు. కానీ సైఫ్ అప్పటికే పెద్ద హీరో. దాంతో అతని ఈగో దెబ్బతింది. నన్నే మెల్లిగా మాట్లాడమంటావా అంటూ ఇక్బాల్‌తో గొడవేసుకున్నాడు. (Attack On Saif Ali Khan)
ఇక్బాల్‌కి ఒళ్లు మండి బూతులు మాట్లాడటంతో సైఫ్ అతన్ని కొట్టాడు. అది కాస్తా పోలీసుల వరకు వెళ్లింది. ముందు ఇక్బాల్ నోటికొచ్చినట్లు మాట్లాడాడని.. ఆడవాళ్ల ముందు అలా ప్రవర్తించినందుకు కొట్టానని సైఫ్ తెలిపాడు. కానీ ముందు కొట్టింది సైఫ్ కావడంతో అతనిపై అప్పట్లో సెక్షన్ 325 కింద కేసు నమోదైంది. అదే రోజు సైఫ్ అరెస్ట్ అవ్వడం.. ఆ తర్వాత రిలీజ్ అవ్వడం జరిగాయి. ఆ సమయంలో సెలబ్రిటీలు ఏం చేసినా చెల్లుతుందా అంటూ పెద్ద ఎత్తున ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేసారు. ఆ తర్వాత కొన్నేళ్ల పాటు ఈ కేసు కోర్టులో నడిచింది. ఆ తర్వాత ఇద్దరూ కోర్టు బయట సెటిల్‌మెంట్ చేసుకున్నారు. మనం తెలిసో తెలీకో బయటి వాళ్లతో గొడవలు పెట్టుకుంటే వారి నుంచి ఎప్పుడు ఏ ఆపద పొంచి ఉంటుందో తెలీదు. నిన్న రాత్రి సైఫ్‌పై జరిగిన దాడికి ఆ సౌతాఫ్రికా వ్యాపారవేత్త ఇక్బాల్ శర్మకు ఎలాంటి సంబంధం లేదు. కానీ ఇలాంటి దాడులు సెలబ్రిటీలపై జరిగినప్పుడు గతంలో వారు ఏం చేసారో పోలీసులు అన్నీ వెలికితీస్తారు.
ఆటోలో హాస్పిటల్‌కు
సైఫ్‌పై ఎటాక్ జరిగిందని తెలిసి ఆయన పెద్ద కుమారుడు ఇబ్రహీం అలీ ఖాన్ వెంటనే కారు డ్రైవర్‌కు ఫోన్ చేయగా.. అతను లిఫ్ట్ చేయలేదు. దాంతో రక్తమోడుతున్న సైఫ్‌ను మోసుకుని ఇబ్రహీం ఆటోలో లీలావతి హాస్పిటల్‌కు తరలించాల్సి వచ్చింది. లక్కీగా సైఫ్ ఉన్న ఇంటి నుంచి లీలావతి హాస్పిటల్ రెండు కిలోమీటర్ల దూరంలోనే ఉండటంతో తీవ్ర రక్తస్రావం జరగలేదట. ప్రస్తుతం ఆయనకు జరిగిన సర్జరీ సక్సెస్ అయ్యిందని వైద్యులు తెలిపారు. కత్తితో దాడి చేసినప్పుడు కొన్ని అంగుళాల సైజు ఉన్న కత్తి వెన్నెముకలో ఇరుక్కుంది. ఆరు కత్తిగాట్లలో అదే చాలా సీరియస్ అని ఇప్పుడు ఆయన ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం లేదని అన్నారు. ప్రస్తుతం ఆయన్ను ఐసీయూకి తరలించారు.
నిందితుడిని గుర్తించిన పోలీసులు
సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో ఉన్న కెమెరాల్లో ఎక్కడా దొంగ ఆచూకీ కనిపించలేదు. దాంతో ఆయన ఇంటి పక్కనే ఉన్న ఇంట్లోని సీసీ కెమెరా పరిశీలించగా.. సైఫ్ ఇంటి వెనుక భాగం నుంచి దొంగ లోపలికి చొరబడ్డాడని తెలిసింది. రాత్రే ఇంట్లోకి దూరిన దొంగ అక్కడే నక్కి.. తెల్లవారుజామున దోచుకుందామని అనుకున్నాడు. రాత్రి 2 గంటల సమయంలో సైఫ్ చిన్న కొడుకు జహంగీర్ బెడ్‌రూంలోకి చొరబడగా అక్కడే ఉన్న ఆయా కేకలు వేసింది. ఆమె నోరు మూయించేందుకు దొంగ కత్తితో దాడి చేయబోతుండగా సైఫ్ వెంటనే కిందకి వచ్చి దొంగను పట్టుకునేందుకు యత్నించాడు. ఇద్దరి మధ్య జరిగిన పోరులో సైఫ్‌కి కత్తిపోట్లు దిగాయి. తీవ్రంగా రక్తం కారుతుండడంతో సైఫ్ కుప్పకూలిపోయాడు. అదే అదనుగా చూసిన దొంగ ఫైర్ ఎగ్జిట్ నుంచి పారిపోయాడు. దాదాపు పది బృందాలు నిందితుడి కోసం గాలిస్తున్నాయి. అయితే.. సైఫ్ ఇంట్లో పనిచేసేవారికి ఆ నిందితుడు సుపరిచితుడే అని అందుకే ఇంటి వెనుక భాగం నుంచి సులువుగా లోపలికి రాగలిగాడని పోలీసులు తెలిపారు. (Attack On Saif Ali Khan)
ఎన్టీఆర్ దిగ్భ్రాంతి
సైఫ్‌పై జరిగిన దాడి పట్ల జూనియర్ ఎన్టీఆర్ (JR NTR) దిగ్భ్రాంతి వ్యక్తం చేసారు. సైఫ్ పట్ల ఇలా జరిగిందని తెలిసి షాకయ్యానని.. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు ట్వీట్ చేసారు. ఎన్టీఆర్ నటించిన దేవర సినిమాలో సైఫ్ కీలక పాత్రలో నటించారు. దేవర 2 లో కూడా సైఫ్ పాత్రకు సంబంధించి మరిన్ని కీలక సన్నివేశాలు ఉండనున్నాయి.