Henna: ఫంక్షన్లకు, పెళ్లిళ్లకు, పండగల సమయంలో సరదాగా చేతికి పెట్టుకునే గోరింటాకు కాలేయానికి శ్రీరామరక్షా? అదేంటి.. ఇప్పుడు గోరింటాకును తినమంటారా ఏంటి అని తిట్టుకుంటున్నారా? కాదు కాదు. గోరింటాకు కాలేయానికి ఎంతో మంచిది. ఎంత మంచిదంటే.. చెడిపోతున్న చెడిపోయిన కాలేయాన్ని కూడా బాగు చేయగలదు. అదెలా సాధ్యమో తెలుసుకుందాం.
గోరింటాకును పెట్టుకున్నాక నారింజ రంగులో, ఎరుపు రంగులో పండుతూ ఉంటుంది. ఇది మనకు తెలిసిన విషయమే. ఆ రంగుని శాస్త్రీయ భాషలో లాసోన్ అంటారు. ఆ ఆకుని చేతికి పెట్టుకున్నాక ఊరిన రంగు కాలేయాన్ని కాపాడుతుందట. ఈ విషయాన్ని జపాన్‌కి చెందిన ఒసాకా మెట్రోపాలిటన్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు కనుగొన్నారు.
కాలేయం పాడైపోతే దానిని లివర్ ఫైబ్రోసిస్ అంటారు. సాధారణంగా కాలేయానికి ఎలాంటి సమస్య వచ్చినా దానంతట అదే ఎప్పటికప్పుడు రిపేర్ చేసుకుంటూ ఉంటుంది. కానీ తాగుడు వలనో లేదా ఫ్యాటీ లివర్ సమస్య వలనో కాలేయం చేతులెత్తేసినప్పుడు ఈ లివర్ ఫైబ్రోసిస్‌కి దారి తీస్తుంది. దీని వల్ల లివర్ పూర్తిగా చెడిపోతుంది. వెంటనే చికిత్స, కాలేయ మార్పిడి సర్జరీలు చేయకపోతే మరణాలు సంభవించే అవకాశం ఉంది. సాధారణంగా హెపాటిక్ స్టెలేట్ సెల్ (HSC) అనే ప్రత్యేక కణాలు కాలేయాన్ని కాపాడుతుంటాయి. కానీ ఆ కణాలు కానీ ఒక్కసారిగా యాక్టివేట్ అయితే మాత్రం అవి కొలాజెన్‌ని ఎక్కువగా ఉత్పత్తి చేస్తాయి.
దాంతో కాలేయం పూర్తిగా దెబ్బతింటుంది. ఇలా యాక్టివేట్ అయిన HSCలను అదుపు చేసే కెమికల్స్ ఏమున్నాయి అనే అంశంపై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తుండగా.. లాసోన్ బెస్ట్ అని నిర్ధారించారు. దాదాపు 1900 కెమికల్స్‌లో లాసోన్ కూడా ఉంది. ఆ 1900 కెమికల్స్‌లో లాసోన్ బెస్ట్ అని తేలింది. ఈ లాసోన్ వల్ల ఆ కణాలు శాంతంగా ఉంటున్నాయట. ఈ లాసోన్ సైటోగ్లోబిన్ అనే మంచి ప్రొటీన్‌ను కూడా విడుదల చేస్తోందట. ఈ లాసోన్‌ను ఎలకలపై ప్రయోగిస్తే మంచి ఫలితాలు వచ్చాయని యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు తెలిపారు. అలాగని అందరూ చేతులు, కాళ్లకు గోరింటాకు పెట్టుకుంటూ ఉండండి అని చెప్పలేరు కదా. అందుకే అదే యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు ఈ లసోన్ రసాయనంతో మందులు తయారుచేయాలని సన్నాహాలు చేస్తున్నారు.





