Telangana Police: ఢిల్లీలో తెలంగాణ పోలీసులకు షాక్ తగిలింది. తమ అదుపులో ఉన్న ఓ సైబర్ నేరగాడు వారిని బురిడీ కొట్టించి పరారయ్యాడు. టాయిలెట్‌కు వెళ్తున్నానని చెప్పి పోలీసుల కళ్లుగప్పి నిందితుడు పారిపోయాడు. దీంతో ఏం చేయాలో తెలియక తెలంగాణ సీసీఎస్ ఢిల్లీ పోలీసులను ఆశ్రయించారు. అమాయకులను మోసం చేసిన ఉత్తరాదికి చెందిన సైబర్ నేరస్తుల ఆట కట్టించేందుకు సీసీఎస్ సీఐ నరేష్ నేతృత్వంలో ఢిల్లీ కేంద్రంగా ఏడుగురు సభ్యులతో కూడిన బృందం సైబర్ ముఠాను వేటాడే పనిలో ఉంది.
ఎట్టకేలకు ముఠాలో కీలకపాత్ర పోషిస్తున్న దినేశ్‌ను ఆదివారం రాత్రి పోలీసులు పట్టుకున్నారు. ఇతర రాష్ట్రాల్లో ఏ నేరస్తుడినైనా అదుపులోకి తీసుకుంటే ముందు అక్కడి న్యాయస్థానంలో హాజరు పరిచి, ట్రాన్సిట్ రిమాండ్ ద్వారా సొంత రాష్ట్రానికి తరలించాల్సి ఉంటుంది. కానీ అలా చేయకుండా అరెస్ట్ చేసి తెలంగాణ భవన్‌కు తీసుకొచ్చారు. దీంతో, అర్ధరాత్రి సమయంలో టాయిలెట్‌కు వెళ్లాలని చెప్పి, పోలీసుల కళ్లుగప్పి నిందితుడు పారిపోయాడు.