Chiranjeevi: సినిమా రంగాన్ని ఒక ఊపు ఊపి.. కోట్లాది మంది అభిమానులను గెలుచుకున్న తర్వాత ఏ నటుడైనా రాజకీయాల్లోకి వెళ్తే బాగుంటుంది అనుకుంటాడు. అందులో తప్పేం లేదు. కాకపోతే సినిమాలు చేసినంత ఈజీ కాదు కదా రాజకీయం చేయడం. సినిమా రంగంలోనైనా బతకచ్చేమో కానీ రాజకీయాల్లో నిలదొక్కుకోవాలన్నా.. నిలబడాలన్నా గుండె ధైర్యం చాలా కావాలి. ఎన్నో మాటలంటారు.. కుటుంబాలను రాజకీయాల్లోకి లాగి దుర్భాషలాడతారు.. వారంతట వారే రాజకీయాల నుంచి తప్పుకునేలా కుట్రలు పన్నుతారు.
ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవి విషయంలోనూ ఇదే జరిగింది. పాపం ఆయన రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు ఏదన్నా చేయాలనుకున్నారు. ఇందుకోసం 2008లో ప్రజారాజ్యం పార్టీని స్థాపించారు. సినిమాల్లో ఉన్నప్పుడు ప్రజలు తనను ఎంతగా ఆదరించారో.. రాజకీయాల్లోనూ తనను అంతే ఆదరిస్తారని ఆశపడ్డారు. కానీ పాపం మెగాస్టార్ ఆశలు అడియాసలయ్యాయి. సొంత నియోజకవర్గంలోనే కుట్రలు పన్ని తనను గెలవనివ్వకుండా చేసారని ఓసారి చిరంజీవే స్వయంగా వెల్లడించారు. ఆ తర్వాత ఇంకెప్పుడూ రాజకీయాల్లోకి రాకూడదని నిర్ణయించేసుకున్నారు. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసేసి యాక్టివ్ పాలిటిక్స్‌కి దూరంగా ఉన్నారు. (Chiranjeevi)
కమలం నుంచి పిలుపు
ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ కన్ను చిరంజీవిపై పడింది. ఆల్రెడీ ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్ తన అన్నలా కాకుండా గెలిచి చూపిస్తానని చెప్పి మరీ జనసేన పార్టీని నిలబెట్టుకున్నారు. రెండు స్థానాల్లో పోటీ చేస్తే ఆ రెండింట్లోనూ ఓడిపోయిన ఆయన.. మొన్న జరిగిన ఎన్నికల్లో పోటీ చేసిన సీట్లన్నింటిలో గెలిచి తన సత్తా నిరూపించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి స్థానంలో రాజకీయాల్లో కీలక పరిణామాలకు శ్రీకారం చుట్టుతున్నారు. అయితే.. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు దేశం, జనసేన, భారతీయ జనతా పార్టీలు కూటమిగా పోటీ చేసి గెలిచిన సంగతి తెలిసిందే. జనసేన సపోర్ట్ కూడా భారతీయ జనతా పార్టీకే ఉంది. ఇదే అదనుగా చూసి ప్రధాని నరేంద్ర మోదీ మెల్లిగా చిరంజీవిని కూడా కమలంలోకి ఆహ్వానించాలని ప్లాన్ వేస్తున్నారు.
కాశీకి పోయాడు కాషాయం మనిషైపోయాడు అనుకున్నారా.. అన్నది చిరంజీవి పవర్ఫుల్ డైలాగ్. అప్పుడెప్పుడో ఇంద్ర సినిమాలో చెప్పిన ఈ డైలాగ్ ఇప్పుడు చిరంజీవి వేస్తున్న పొలిటికల్ స్టెప్స్‌కు సరిగ్గా సరిపోతుంది. కాశీకి వెళ్లకున్నా కాషాయం కప్పుకోవడం మాత్రం దాదాపు ఖాయమనే అంటున్నారు. కాకపోతే ఇది రాజకీయ కషాయం. ఇక వారణాసిలో బతకున్నా తన రాజకీయ వరస మాత్రం మార్చుకోబోతున్నారట. గడిచిన కొద్ది రోజులుగా మెగాస్టార్ వేస్తున్న అడుగులు చూస్తుంటే అవి BJP వైపు పడుతోందనే అంటున్నారు పొలిటికల్ పండిట్స్. తన తమ్ముడు పొత్తు పెట్టుకున్న భారతీయ జనతా పార్టీతో దోస్తానా వెనక అసలు కథేంటి అన్న చర్చ జరుగుతోంది. ఈ మధ్యకాలంలో ఎక్కడా బహిరంగంగా రాజకీయాలు మాట్లాడకున్నా BJP నిర్వహించే కార్యక్రమాలన్నింటిలో ఆయన పాల్గొంటున్నారు.
దీనిని బట్టి ఆయన పొలిటికల్ రీఎంట్రీ ఇవ్వబోతున్నారని అంటున్నారు పరిశీలకులు. సొంత పార్టీ పెట్టుకుని చేరుకోలేని లక్ష్యాన్ని తమ్ముడు పొత్తు పెట్టుకున్న పార్టీలో చేరి సాధించాలని చిరు అనుకుంటున్నారా? అన్నది ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో పొలిటికల్ హాట్ టాపిక్. ఇటీవల బీజేపీ నిర్వహిస్తున్న కార్యక్రమాలకు చిరు హాజరవడం.. అటు ప్రధాని మోదీ కూడా పవన్‌తో పాటు చిరంజీవితో కూడా సఖ్యతగా ఉంటున్నారు. దాంతో ఇక మెగాస్టార్ కాషాయ పార్టీలోకి వెళ్లబోతున్నారనే రూమర్స్ ఎక్కువైపోయాయి. (Chiranjeevi)
తన సొంత పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసాక ఆ పార్టీ తరఫున కేంద్ర మంత్రి అయ్యారు చిరు. ఇక కాంగ్రెస్ అధికారం నుంచి దూరం అవ్వగానే ఆయన కూడా దశలవారీగా దూరం అవుతూ వచ్చారు. ఇటీవల కాలంలో అయితే అసలు కాంగ్రెస్ కార్యక్రమాల్లో పాల్గొనడం కానీ ఆ పార్టీ కూడా ఆయన్ను పిలిచిన దాఖలాలు లేవు. పవన్ ఏపీలో యాక్టివ్ అయ్యాక కాంగ్రెస్ చిరుని కార్యక్రమాలకు పిలిచింది లేదు. ఇక పవన్ కళ్యాణ్ కూటమిలో భాగస్వామి అయ్యాక చిరు కాంగ్రెస్ వైపు చూడటం పూర్తిగా మానేసారట. కొన్నాళ్లు సినిమాలపై దృష్టి పెట్టిన చిరు.. ఇప్పుడు తిరిగి పాలిటిక్స్ వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆయన అడుగులు బీజేపీ వైపు పడుతున్నాయా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే.. ఇది ఎప్పుడు.. ఎలా ఉంటుంది.. అన్న విషయంలో మాత్రం ఇప్పటికీ క్లారిటీ లేదు. కానీ తమ్ముడు పవన్ కళ్యాణ్‌కి అండగా ఉంటానని సందర్భం వచ్చిన ప్రతీసారి చెప్పకనే చెప్తున్నారు చిరు.