Bhogi: భోగి.. సంక్రాంతి.. కనుమ.. ఈ పండుగ మనకు ఏటా వస్తుంది. కానీ ఈసారి 13వ తారీఖున రాబోయే భోగి మామూలు రోజు కాదు. దాదాపు 110 ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు రాబోతున్న అద్భుతమైన రోజు. ఆ విషయాలేంటో తెలుసుకుందాం. సాధారణంగా భోగి అంటే.. ఆ రోజున చలిమంటలు వేసుకుంటారు. చిన్న పిల్లల తలపై భోగి పండ్లు (రేగి పండ్లు) పోస్తుంటారు. కానీ రేగి పండ్లే ఎందుకు? మనకు రకరకాల పండ్లు ఉన్నాయి కదా? ఈ సందేహం చాలా మందికి వచ్చే ఉంటుంది. రేగి పండ్లకు.. సూర్య భగవానుడికి ఓ సంబంధం ఉంది.
జ్యోతిష్య శాస్త్రంలో ఒక్కో పండుకి ఒక్కో గ్రహానికి.. ఒక్కో రంగుకి ఒక్కో గ్రహానికి సంబంధం ఉంటుంది. చిన్నపిల్లలు వారికి ఉన్న సమస్యలను చెప్పుకోలేరు. కానీ భగవానుడి అనుగ్రహం ఉంటే వారికి ఎలాంటి సమస్యలు రాకుండా చేయచ్చు. సూర్య అనుగ్రహం ఉంటే పిల్లలకు అనారోగ్య సమస్యలు రావు అంటారు. అందుకే కొన్ని రేగి పండ్లు తీసుకుని.. శుభ్రంగా కడిగి.. ఆదిత్య హృదయ పఠనం చేస్తూ పిల్లలపై పోయాలి. ఆదిత్యుడు ఆరోగ్యానికి కారకుడు. అందుకే పిల్లలకి భోగి పండ్లు వేయడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది. అదీకాకుండా ఈసారి భోగి రోజున పౌర్ణమి తిథి వస్తోంది. అందులోనూ ఆరుద్ర నక్షత్రంలో కలిపి వస్తోంది. ఇలాంటి అరుదైన కలయిక 110 సంవత్సరాల క్రితం వచ్చిందట. మళ్లీ ఈసారి రాబోతోంది. ఆరోజున చంద్రబలం బాగా ఉంటుందని జ్యోతిష్యులు అంటున్నారు. (Bhogi)
చిన్నపిల్లలకి పౌర్ణమి నాడు పరిహారాలు చేస్తే బాగా ఫలిస్తాయి. దిష్టి తగలడం వంటివి ఉంటే ఆ దోషాలు కూడా పోతాయి. అపమృత్యు దోషాలు కూడా పోతాయి. అంటే దెబ్బలు తగలకుండా ఉండటం.. ప్రాణాంతకమైన వ్యాధులు రాకుండా కూడా ఉంటాయి. పిల్లల చేత సూర్య నమస్కారాలు కూడా చేయిస్తే మంచిది. ఇక ఈ భోగి పండ్లను పిల్లలపై ఎప్పుడు పోస్తే మంచిదంటే.. ఉదయం 11 గంటల లోపు కానీ సాయంత్రం 5:30 నుంచి 6:30 మధ్యలో కానీ పోస్తే మంచిది. శివయ్యకు బాగా ప్రీతికరమైన నక్షత్రం ఏదన్నా ఉందంటే అది ఆరుద్ర నక్షత్రం. సోమవారం కూడా కలిసి వచ్చింది. ఇది భోగి రోజున ఏర్పడుతోందంటే.. ఇంకా మంచిది.
పుష్య మాసం.. పౌర్ణమి తిథి.. సోమవారం.. ఆరుద్ర నక్షత్రం కలిసొచ్చిందంటే.. కార్తీక మాసంలో శ్రవణా నక్షత్రం సోమవారం కలిసొస్తే కోటి సోమవారాలు అంటారు. కానీ మనకు ఎప్పుడైనా కానీ పౌర్ణమి.. సోమవారం.. ఆరుద్ర నక్షత్రం కలిసి వస్తే అది శివముక్కోటి అవుతుంది. కోటి సోమవారాలు వేరు శివ ముక్కోటి వేరు. 13న రాబోయేది శివ ముక్కోటి. 1940 నుంచి 2050 వరకు అద్భుతమైన యోగ మాలిక ఈ రాబోయే భోగి రోజు ఉంది. సహజంగా.. మనకు పౌర్ణమి సోమవారం కలిసి వచ్చిన రోజులు దాదాపుగా 1940 నుంచి 2050 వరకు చూస్తే 18 సార్లు మాత్రమే.
ఈ 13న శివయ్యకు అభిషేకం చేస్తే వచ్చే పుణ్యం అంతా ఇంతా కాదు. వేరే రోజుల్లో శివయ్యకు అభిషేకం చేస్తే ఆయన కోరికలు నెరవేర్చడా అని కొందరు వెధవ ప్రశ్నలు వేస్తుంటారు. ఇక్కడ పాయింట్ అది కాదు. ఆరుద్ర అంటే రుద్రుడి నక్షత్రం. ఆయనకు ఇష్టమైన ఆరుద్ర నక్షత్రం రోజున అభిషేకం చేసి ఏదైనా కోరుకుంటే అది ఇంకాస్త తొందరగా నెరవేరుస్తాడు అని అర్థం. ఆరుద్ర నక్షత్రం రోజున పౌర్ణమి వచ్చింది కాబట్టి శివాలయంలో లింగానికి అన్నం రుద్దుతారు. మరికొందరు శివయ్యకు నైవేద్యం పెట్టే అన్నాన్ని అన్నదానంగా పెడుతుంటారు. ఆ రోజున గోవులకు గోధుమ పిండి, బెల్లం కలిపి తినిపిస్తే మొట్టమొదటిగా మానసిక ఒత్తిడి తగ్గడం.. ఏలినాటి శని దోషాలు ఉంటే పోవడం.. కొన్ని పనులు వాయిదా పడుతుంటే అవి త్వరగా అయిపోవడం వంటి లాభాలు ఉంటాయి.
ఇక నియమాల విషయానికొస్తే.. భోగి, సంక్రాంతి, కనుమ అనే కాకుండా.. పండగ ఉన్నా లేకపోయినా ఇంట్లో పూజ గదిలో కూర్చున్నాం అంటే మొదట మన మనసు అన్నీ అక్కడే ఉండాలి. పూజ చేసేటప్పుడు దైవం కళ్లు మనపైనే ఉంటాయి. మనం ఏం ఆలోచిస్తున్నాం.. ఏ ఆలోచనతో ఉన్నాం వంటివి అన్నీ చూస్తుంటారు. మనసు, బుద్ధి పూజపై లేకపోతే మాత్రం ఏం చేసినా అది ఫలించదు అని మాత్రం గుర్తుంచుకోండి. మీరు ఎన్ని పిండి వంటలను నైవేద్యంగా పెట్టి ఎన్ని గంటలు పూజ చేసినా భక్తి శ్రద్ధలు ఆ పూజపై లేకపోతే మాత్రం ఆ పూజకు ఫలితం ఉండదు. ఆలోచనలు ఎటు వెళ్లినా మళ్లీ ఆ మనసును చేసే పూజపై దైవంపై నిలిచేలా చేసుకుంటూ ఉండాలి. (Bhogi)