Anil Ravipudi: ఒరేయ్ బాబూ.. ఇదేం క్రింజ్ కామెడీ రా నాయనా.. ఈ అనిల్ రావిపూడి సినిమాల్లో కంటెంట్ తక్కువ క్రింజ్ ఎక్కువ. F3 సినిమా వరకు అనిల్ రావిపూడి గురించి సోషల్ మీడియాలో వచ్చే ట్రోలింగ్స్ ఇవే. సెన్స్ ఆఫ్ హ్యూమర్ అనేది ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది. చాలా మందికి శ్రీను వైట్ల కామెడీ సినిమాలంటే ఇష్టం. ఇప్పుడు శ్రీను వైట్ల వెంకీ, దుబాయ్ శీను సినిమాల్లో చేసినంత కామెడీని ఇప్పుడు పండించలేకపోతున్నాడు. అసలు కామెడీ సినిమాలే రావడం మానేసాయ్ అని చెప్పాలి టాలీవుడ్‌లో. అప్పుడెప్పుడో జాతిరత్నాలతో కాస్త ఫ్రెష్ కామెడీ కంటెంట్ దొరికింది అని చాలా మంది ఎంజాయ్ చేసారు. ఇప్పటికీ ఆ సినిమాలోని డైలాగులు మీమ్స్ రూపంలో ఎంటర్‌టైన్ చేస్తున్నాయి. కథ చెప్పే ట్రెండ్ మారిపోయింది. కామెడీని పండించలేక రోత డైలాగులు.. బూతు సీన్లు పెట్టే సినిమాలే ఎక్కువైపోయాయి. అయినా సరే నేను ఎంచుకున్న కామెడీ జోనర్‌లోనే సినిమాలు తీస్తాను అంటూ సంక్రాంతికి వస్తున్నాం (Sankranthiki Vastunnam) సినిమాతో ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చారు అనిల్ రావిపూడి.
సినిమా రివ్యూలు మాత్రమే ఓ రేంజ్‌లో ఉన్నాయి. ఈ సంక్రాంతికి హాయిగా కుటుంబం అంతా కలిసి ఎంజాయ్ చేసే సినిమాను తీసిందనందుకు ఫ్యామిలీ ఆడియన్స్ అనిల్ రావిపూడిని ఆకాశానికెత్తేస్తున్నారు. ఎందుకంటే ఈరోజుల్లో కుటుంబంతో కలిసి చూసే సినిమాలు రావడం లేదు. రేపు వస్తాయో రావో కూడా తెలీదు. ఈ GEN Z కాలంలో ఇంకా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్లు ఎవడు చూస్తాడయ్యా అని కామెంట్ చేసే వారికి సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఓ చెంప పెట్టు లాంటిదనే చెప్పాలి. సరిలేరు నీకెవ్వరు, F2, F3 సినిమాలు కూడా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్లే. కానీ ఆ సినిమాల్లో క్రింజ్ కంటెంట్ తప్ప కామెడీ ఏమీ లేదని కొట్టిపారేసారు. అలాగని అవి ఫ్లాప్ సినిమాలా అంటే బాగానే హిట్ అయిన సినిమాలు. చిన్నప్పుడు పిల్లలు చెప్పుకునే జోకుల్లా ఇప్పటికీ అవే ఎంజాయ్ చేస్తున్నారేంట్రా అని జనాలు ఓ రేంజ్‌లో ట్రోల్ చేసారు. డబుల్ మీనింగ్ వచ్చేలా పేలే పంచ్‌ల కంటే ఇలా క్రింజ్‌లా కనిపించే కామెడీనే బాగుంది అని ఫ్యామిలీ ఆడియన్స్ అంటున్నారు. (Anil Ravipudi)
అయితే.. అనిల్ రావిపూడి విషయంలో ఎందుకు ట్రోలింగ్ ఎక్కువగా అవుతందంటే.. ఆయన సినిమా షూటింగ్ సమయంలో చేసే హడావుడి అలా ఉంటుంది. సంక్రాంతికి వస్తున్నాం సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఆయన విక్టరీ వెంకటేష్ చేత కామెడీ రీల్స్ చేయించడం.. డైలాగులు చెప్పించడం వంటివి చేయడంతో బాగా ట్రోల్ చేసారు. షూటింగ్ సమయంలోనే ఇంత క్రింజ్ ఉందంటే ఇక సినిమా ఏ రేంజ్‌లో ఉంటుందో అన్నారు. కానీ ఈరోజు సంక్రాంతికి వస్తున్నాం సినిమా చూసిన వారిలో చాలా మంది అనిల్ రావిపూడి క్రింజ్ కాదు కింగ్ అని చెప్తున్నారు. సోషల్ మీడియాలో ఓ అబ్బాయి పెట్టిన కామెంట్ వైరల్ అయ్యింది. ఒరేయ్ సినిమా టికెట్లు బుక్ చేయరా అని ఆ అబ్బాయి వాళ్ల అమ్మ అడిగితే.. రామ్ చరణ్ సినిమాకా.. అల్లు అర్జున్ సినిమాకా.. వెంకటేష్ సినిమాకా అని ఆ అబ్బాయి అడిగాడట. అప్పుడు వాళ్ల అమ్మ.. హీరో పేర్లు కాకుండా అనిల్ రావిపూడి సినిమాకు అందంట. ఇంతకు మించిన రివ్యూ ఓ దర్శకుడికి అవసరం లేదని అనిల్ రావిపూడి ఈరోజు ప్రూవ్ చేసేసారనే చెప్పాలి.