Raavi Chettu: మీరెప్పుడైనా ఇంటి గోడల్లో నుంచి రావిచెట్టు చిగురించడం గమనించారా? చాలా మంది రావి చెట్టు ఉంటే మంచిదని.. గోడ కూడా చూడటానికి బాగుంటుందని వదిలేస్తుంటారు. కానీ వాస్తు శాస్త్రం ప్రకారం.. రావి చెట్టు ఇంటి గోడల నుంచి మొలిస్తే అశుభం అని మీకు తెలుసా? రావి చెట్టు అత్యంత పవిత్రమైనది. కానీ అది పెరిగే ప్రదేశం కూడా అంతే పవిత్రంగా ఉండాలి. రావి చెట్టు అనేది కేవలం ఆలయాల్లో, ఆలయాల పరిసరాల్లో మాత్రమే ఉండాలి.
ఇంట్లో కానీ.. ఇంటి గోడలు, ఇంటి మేడ పైన పెంచినా.. దానంతట అదే మొక్కగా మొలిచినా ఆ నివాసంలోని వారికి పితృ దోషం ఉన్నట్లే. దీని వల్ల ఆర్థిక సమస్యలు, కుటుంబ కలహాలు వస్తాయి. ఒకవేళ ఇంట్లో రావి చెట్టు మొలుస్తోందంటే దానిని ఎలా పడితే అలా పీకేయకూడదు. ముందు ఆ మొక్కకు పూజ చేయాలి. త్వరలో పితృ దోష నివారణ పూజలు చేయించుకుంటానని మొక్కుకుని ఆ తర్వాత ఆ మొక్కను తొలగించాల్సి ఉంటుంది. సోమవారాలు, శనివారాలు మాత్రం మొక్కను తొలగించకూడదు. ఆదివారం రోజు మాత్రమే ఈ తొలగింపు ప్రక్రియ చేపట్టాలి.





