Lionel Messi: ప్రముఖ అర్జెంటినా ఫుట్బాల్ ప్లేయర్ లియెనెల్ మెస్సీ GOAT టూర్లో భాగంగా భారతదేశం రాబోతున్నారు. ఆయన్ను చూసేందుకు యావత్ భారతదేశంలోని అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇక అభిమాన ప్లేయర్ కళ్ల ముందు ఉంటే సెల్ఫీలు, షేక్ హ్యాండ్స్ ఇవ్వాలని ఏ అభిమాని మాత్రం కోరుకోడు చెప్పండి.
దీనిని ప్రాఫిట్గా మార్చుకోవాలని చూస్తున్నారు ఈవెంట్ ఆర్గనైజర్లు. ఇందుకోసం మెస్సీతో గ్రీట్ అండ్ మీట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసారు. అయితే.. ఈ ఈవెంట్లో మెస్సీతో ఫోటో దిగాలన్నా షేక్ హ్యాండ్ ఇవ్వాలన్నా రూ.10 లక్షలు చెల్లించాలట. డిసెంబర్ 13న మెస్సీ కలకత్తాకు చేరుకుంటాడు. దాదాపు నాలుగు పెద్ద నగరాల్లో మెస్సీ తన టూర్ ప్లాన్ చేసుకున్నాడు. ఈ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం కలకత్తాలోని హయత్ రీజెన్సీ హోటల్లో జరగనుంది.
అయితే రూ.10 లక్షలు చెల్లిస్తే కేవలం ఫోటో, షేక్ హ్యాండ్ మాత్రమే కాదు.. ఢిల్లీలో జరగబోయే కార్యక్రమానికి విమాన టికెట్, హోటల్లో ప్రీమియం లోంజ్, ప్రత్యేకమైన చెఫ్స్తో వండించిన వంటకాలతో భోజనాలు ఉంటాయి. మెస్సీ 48వ ట్రోఫీ అందుకున్న సందర్భంగా ఈ టూర్ ప్లాన్ చేసారు. ఈ టూర్లో భాగంగా మెస్సీ ప్రధాని నరేంద్ర మోదీతో పాటు వివిధ పరిశ్రమలకు చెందిన సెలబ్రిటీలను కూడా కలుస్తాడు.





