Pakistan On BCCI: పాకిస్థాన్ మాజీ క్రికెటర్ బసిత్ అలి (Basit Ali) పాకిస్థాన్ క్రికెట్ బోర్డును రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌కి పాకిస్థాన్ ఆతిథ్య దేశంగా వ్యవహరిస్తోంది. కానీ రాజకీయ పరిణామాల దృష్ట్యా పాకిస్థాన్, ఇండియాకు మధ్య జరగాల్సిన మ్యాచ్‌లు మాత్రం దుబాయ్‌లో జరుగుతాయి. టీమిండియా పాకిస్థాన్‌లో క్రికెట్ ఆడే ప్రసక్తే లేదని BCCI ఎప్పటి నుంచో అంటోంది. ఇందుకు ముందు నుంచి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఒప్పుకోవడం లేదు. చాలా కాలం తర్వాత పాకిస్థాన్‌లో అంతర్జాతీయ టోర్నమెంట్ జరుగుతుండడంతో అన్ని మ్యాచ్‌లు లాహోర్‌లోనే జరగాలని చెప్పింది.
ఇందుకు BCCI ఒప్పుకోలేదు. ICCతో మాట్లాడుకున్న భారత పాక్ మధ్య జరగాల్సిన మ్యాచ్‌ల వెన్యూను దుబాయ్‌కి మార్పించుకుంది. ఇక పాకిస్థాన్ క్రికెట్ బోర్డు కూడా ఏమీ చేయలేక ICC చెప్పినదానికి ఒప్పుకుంది. అంతా బాగానే ఉంది అనుకున్న సమయంలో పాకిస్థాన్‌లో జరగాల్సిన ఓపెనింగ్ కార్యక్రమానికి టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ వెళ్లలేకపోవడం మరో రచ్చకు దారితీసింది. అంతేకాదు.. టీమిండియా జెర్సీలపై ఆతిథ్య దేశం పేరు కచ్చితంగా ఉండాలన్నది ఎప్పటి నుంచో ఉన్న సంప్రదాయం. అంటే ఇప్పుడు జెర్సీలపై పాక్ పేరు ఉండాలి. ఇందుకు కూడా BCCI ఒప్పుకోలేదు. ఇలా ప్రతిదానికి BCCI వంకలు పెడుతుండడంతో పాక్ క్రికెట్ బోర్డు కూడా సహనం కోల్పోతోంది. (Pakistan On BCCI)
దీనిపై పాక్ మాజీ క్రికెటర్ బసిత్ అలి స్పందించారు. పాక్ క్రికెట్ బోర్డు ఇప్పుడు ప్రశాంతంగా ఉండాలని.. 2026లో జరగనున్న T20 వరల్డ్ కప్ సమయంలో తమ సత్తా చూపించాలని అన్నారు. ఇప్పుడు BCCI పెడుతున్న వంకలన్నింటికీ వడ్డీతో సహా వరల్డ్ కప్ సమయంలో తిరిగిస్తామని రెచ్చగొడుతున్నారు. 2026 వరల్డ్ కప్ ఇండియాలో జరుగుతుంది కాబట్టి.. అప్పుడు పాక్ క్రికెటర్లు జెర్సీలపై ఇండియా పేరు వేయించుకోకూడదని.. అక్కడ మ్యాచ్‌లకు వెళ్లకుండా వేరే దేశానికి మార్పించుకోవాలని.. ఓపెనింగ్ కార్యక్రమానికి వెళ్లకూడదంటూ లేనిపోని సలహాలు ఇస్తూ విద్వేషపూరిత వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇప్పుడు భారత్ పాక్ పట్ల ఎలా ప్రవర్తిస్తోందో.. వరల్డ్ కప్ సమయంలో పాక్ భారత్ పట్ల అదే విధంగా ప్రవర్తించి టిట్ ఫర్ ట్యాట్ అనిపించాలంటూ బసిత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు.