Kareena Kapoor Saif Ali Khan: బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్‌పై ఓ దుండగుడు దాడి చేసిన సంగతి తెలిసిందే. గురువారం రాత్రి 2 గంటల సమయంలో ముంబైలోని బాండ్రాలో ఉన్న సైఫ్ నివాసంలో ఓ దుండగుడు చోరీకి వచ్చి దొరికిపోయే సరికి ఆరు కత్తిపోట్లు దింపాడు. దాంతో వెంటనే సైఫ్‌ను రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న లీలావతి హాస్పిటల్‌కు తరలించారు. సైఫ్ వెన్నెముకలో 2 అంగుళాల కత్తి ముక్క ఇరుక్కోవడంతో వెంటనే సర్జరీ చేసి దానిని తొలగించారు. ప్రస్తుతం ఆయన హాస్పిటల్‌లోనే కోలుకుంటున్నారు.
అయితే.. సెలబ్రిటీలు కూడా సామాన్యుల మాదిరిగానే బీమాలు చేయించుకుంటూ ఉంటారు. సైఫ్ కుటుంబానికి కూడా ఆరోగ్య బీమా ఉంది. అయితే.. ఆయనకు జరిగిన చికిత్సకు గానూ ఎంత బీమా క్లెయిమ్ చేసుకున్నారో సైఫ్ వ్యక్తిగత ఇన్స్యూరర్ వివరాలను వెల్లడించారు. సైఫ్ మొత్తం రూ.35.95 లక్షల వరకు బీమా క్లెయిమ్ చేసుకోగా.. రూ.25 లక్షల వరకు వచ్చిందట. మిగతా మొత్తం డిశ్చార్జి అయ్యాక బిల్లులు సబ్మిట్ చేస్తే అప్పుడు ఇస్తారట. లీలావతి హాస్పిటల్‌లోని వీఐపి స్వీట్‌లో సైఫ్‌కు చికిత్స అందిస్తున్నారు. ఈ నెల 21న సైఫ్ డిశ్చార్జ్ అవ్వనున్నారు.
దొంగతనం జరగలేదు
ఈ కేసుని విచారిస్తున్న ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు కరీనాను కొన్ని గంటల పాటు విచారణ చేసారు. అసలు ఏం జరిగింది అని అడగ్గా.. తాను తన భర్త సైఫ్‌తో 11వ అంతస్తులో ఉన్నానని.. ఇంతలో తమ ఇంట్లో పని చేసే ఆయా అరుపులు విని సైఫ్ కిందకి పరిగెత్తుకుంటూ వచ్చాడని తెలిపింది. తాను వెనకే వెళ్లి చూసేసరికే ఆ దుండగుడు సైఫ్‌ని పొడుస్తూ కనిపించాడని.. ఆ సమయంలో సైఫ్‌ని కాపాడుకోవాలన్న ఆలోచన మరే ఆలోచన రాలేదని అన్నారు. అయితే తమ ఇంట్లో ఏ వస్తువు కూడా చోరీకి గురికాలేదని.. అప్పటికే సైఫ్ పట్టుకోవడం.. తనని గాయపరిచి అతను పారిపోవడం జరిగిపోయాయని అన్నారు. సైఫ్ పెద్ద కుమారుడు ఇబ్రహీం అలీ ఖాన్ సమయానికి కారు డ్రైవర్లు లేకపోవడం.. ఎవ్వరికీ ఆటోమేటిక్ కార్లు డ్రైవ్ చేయడం రాకపోవడంతో ఆటోలో హాస్పిటల్‌కు తరలించినట్లు తెలిపారు. ఆ తర్వాత షాక్‌లో ఉన్న తనను తన పిల్లల్ని అక్క కరిష్మా కపూర్ తన ఇంటికి తీసుకెళ్లిందని.. అక్కడ పిల్లల్ని వదిలి తాను వెంటనే లీలావతికి వచ్చానని కరీనా వెల్లడించారు. (Kareena Kapoor Saif Ali Khan)
అదుపులో నిందితుడు
సైఫ్ అలీ ఖాన్‌పై ఎటాక్ చేసిన వ్యక్తిని ఎట్టకేలకు పోలీసులు పట్టుకున్నారు. దాడి జరిగిన 50 గంటల వరకు నిందితుడు ఎక్కడెక్కడ తిరిగాడో సీసీ కెమెరాల్లో రికార్డ్ అయివున్నా కూడా పోలీసులు పట్టుకోలేకపోయారు. ఛత్తీసగడ్‌లోని దుర్గ్ రైల్వే స్టేషన్‌లో నిందితుడిని గుర్తించినట్లు రైల్వే పోలీసులు ముంబై పోలీసులకు సమాచారం అందించారు. వారు వచ్చే వరకు రైల్వే పోలీసులు నిందితుడిని తమ ఆధీనంలో ఉంచుకున్నారు. నిందితుడి పేరు ఆకాశ్ కైలాశ్ కన్నోజియా అని పోలీసులు తెలిపారు. జ్ఞానేశ్వర్ ఎక్స్‌ప్రెస్‌లో నిందితుడు ఆకాశ్ ప్రయాణిస్తూ దొరికినట్లు తెలిపారు. అతన్ని ముంబైకి తీసుకొచ్చేందుకు పోలీసులు విమానంలో రాయ్‌పూర్ బయలుదేరారు. మిగతా విషయాలను పోలీసులు రేపు ప్రెస్‌మీట్‌లో వెల్లడించే అవకాశం ఉంది.