Woman Loses Job: కుక్కల్ని, పిల్లుల్ని పెంచుకోవడానికి చాలా మంది ఇష్టపడతారు. కొందరైతే వాటిని బాగా చూసుకోవడం కోసమే ఉద్యోగాలు చేస్తూ బాగా డబ్బులు సంపాదిస్తున్నారు కూడా. కానీ అవే పెంపుడు జంతువుల వల్ల ఉద్యోగం పోతే? ఓ మహిళకు ఇలాంటి పరిస్థితే ఎదురైంది. చైనాకు చెందిన ఓ మహిళ ఏకంగా 9 పిల్లుల్ని పెంచుకుంటోంది. అవంటే ఆమెకు ఎంతో ఇష్టం. వాటి కోసమని ఎక్కువ జీతం ఇచ్చే ఉద్యోగం వెతుక్కుందామని అనుకుంది. ఈ నేపథ్యంలో రాజీనామా చేస్తున్నట్లు మెయిల్ కూడా సిద్ధం చేసి పెట్టుంది.
మెయిల్ అయితే సిద్ధం చేసుకుంది కానీ వెంటనే పంపలేదు. ఎందుకంటే ఆమెకు కంపెనీ నుంచి బోనస్ రావాల్సి ఉంది. ఆ బోనస్ వచ్చాక రిజైన్ చేస్తున్న మెయిల్‌ను పంపాలనుకుంది. అయితే.. తాను రాసిన మెయిల్‌లో ఏమైనా తప్పులు ఉన్నాయేమో అని చూసుకుంటుండగా.. ఓ పిల్లి ఉన్నట్టుండి ల్యాప్‌టాప్ పైకి దూకింది. దాంతో పిల్లి కాలు ఎంటర్ బటన్‌పై పడి నొక్కుకుపోయింది. ఆ మెయిల్ కాస్తా బాస్‌కి వెళ్లిపోయింది. వెంటనే ఆమె తన బాస్‌కి ఫోన్ చేసి తాను ఆ మెయిల్ పంపాలనుకోలేదని.. దయచేసి ఆ మెయిల్‌ను పట్టించుకోవద్దని కోరింది. కానీ ఇలా పిల్లి ల్యాప్‌టాప్ మీదకి దూకి మెయిల్ పంపించేసింది అంటే ఎవరూ నమ్మరుగా..! దాంతో ఆమె చెప్పే విషయాలేవీ నమ్మని ఆ బాస్ వెంటనే రాజీనామాను అంగీకరించారు. పాపం ఏ బోనస్ కోసమైతే మెయిల్ పంపకూడదు అనుకుందో ఆ బోనస్ కూడా రాలేదు. అందుకే ఇంట్లో వర్క్ చేసుకునే సమయాల్లో చిన్న పిల్లలు, పెంపుడు జంతువులు ల్యాప్‌టాప్లు, కంప్యూటర్లతో ఆడకుండా జాగ్రత్తపడాలి అనేది. ఇప్పుడు ఆ మహిళ వేరే ఉద్యోగం వెతుక్కుంటోందట. (Woman Loses Job)