రాజకీయాల్లో ఒక పార్టీపై మరో పార్టీ నేతలు విమర్శలు చేసుకోవడం సర్వసాధారణం.ఇక ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అయితే ఇంట్లో వారిని కూడా ఇన్‌వాల్వ్ చేసి మరీ నోటికొచ్చిన మాటలు అనేస్తుంటారు. ఇలాంటి వాటిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత ఆర్కే రోజా ముందుంటారు. ఇది చాలా తప్పు.
ఇది తప్పు అని ఆ పార్టీ అధినేత అయిన జగన్ మోహన్ రెడ్డి కూడా చెప్పడు. ఏమన్నా అంటే.. వాళ్లకి తమ ప్రియతమ నేతను ఒక మాట అంటే కోపం వచ్చి అలా మాట్లాడారే తప్ప వేరే ఉద్దేశంతో కాదు అని అంటుంటారు. సరే.. ఈ విషయాన్ని పక్కన పెడితే.. ఇప్పుడు అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం మాత్రం చేస్తోంది ఏంటి?
కూటమి ప్రభుత్వంలో ఉన్న పెద్ద పెద్ద వాళ్లంతా మీడియా ముందుకు వచ్చి అనవసరంగా ప్రతిపక్ష పార్టీ నోళ్లల్లో నోళ్లు పెట్టడం ఎందుకు అని సైలెంట్ అయిపోతున్నారు. కానీ పార్టీ కార్యకర్తలుగా ఉన్నవారు మాత్రం కాస్త రెచ్చిపోతున్నారు. ఎవరి గురించో మీకు ఆల్రెడీ అర్థం అయిపోయుంటుంది. అతనే కిర్రాక్ ఆర్పీ. జబర్దస్త్ కామెడీ షోతో పాపులర్ అయిన కిర్రాక్ ఆర్పీ ఇప్పుడు తెలుగు దేశం పార్టీ కార్యకర్తగా రాజకీయాల్లోకి రావాలని అనుకుంటున్నాడు. అందులో తప్పు లేదు. ఎవరి ఇష్టం వారిది.
కానీ మద్దతుగా ఉన్న పార్టీ అధికారంలో ఉంది కదా అని ఎలా పడితే అలా మాట్లాడితే ఇక ప్రతిపక్ష పార్టీలో నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నవారికి అధికార పార్టీకి మద్దతు తెలుపుతున్నవారికి తేడా ఏముంటుంది? ఇప్పుడు అసలు మ్యాటర్ ఏంటంటే.. తిరుమలలోని గోశాలలో వందలాది ఆవులు చనిపోయాయని మాజీ టిటిడి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసారు. ఆ తర్వాత పలువురు కూటమి నేతలు దమ్ముంటే గోశాలకు వచ్చి నిరూపించు అని సవాల్ విసిరారు.
భూమన తన కుమారుడు అభినయ్, మాజీ మంత్రి రోజాతో పాటు పలువురు కార్యకర్తలను వేసుకుని గోశాలకు వెళ్లేందుకు యత్నించారు. కానీ పోలీసులు అడ్డుకుని వారిని హౌజ్ అరెస్ట్ చేయడంతో రోడ్డుపైనే బైఠాయించారు. ఆ తర్వాత దొరికిందే ఛాన్స్ అన్నట్లు రోజా మైక్ ఉంది కదా అని నోటికొచ్చినట్లు మాట్లాడారు. శ్రీవారితో పెట్టుకుంటే అలిపిరిలో చంద్రబాబు నాయుడు పట్ల ఏం జరిగిందో అందరికీ తెలిసిందే.. ఇటీవల పవన్ కళ్యాణ్ కూడా రుచి చూసారు అన్నారు. అంటే.. పవన్ చిన్న కుమారుడు సింగపూర్‌లోని ఓ స్కూల్‌లో అగ్ని ప్రమాదంలో గాయపడటం శ్రీవారు నేర్పిన గుణపాఠం అన్నట్లు ఆమె మాట్లాడారు. దీనిపై కిరాక్ ఆర్పీ స్పందిస్తూ.. శ్రీవారు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌కి గుణపాఠం చెప్పడం కాదు.. మీ పార్టీకి 11 సీట్లు ఇచ్చి ఆయన పవరేంటో చూపించారు. ఆయన నామాలే ఆ 11 సీట్లు అని గుర్తుంచుకోండి అన్నాడు. ఇదేం విడ్డూరం?
జగన్ పార్టీకి వచ్చిన సీట్లను శ్రీవారి నామంతో పోలుస్తూ ఆ మాటలేంటి? ఇలా మాట్లాడే కార్యకర్తలను నోరు అదుపులో పెట్టుకుని కేవలం సబ్జెక్ట్‌పై మాట్లాడండి అని చెప్పాల్సిన బాధ్యత అధికార పార్టీలకు లేదా?