Doctors Hand Writing వైద్యులు ప్రిస్క్రిప్షన్ రాయడం ప్రతి ఒక్కరు చూసే ఉంటారు. అసలు ఆ మందుల చీటీలో ఏం రాసారో ఏం మందులు రాసారో అర్థం కాక తల గోక్కోవాల్సిందే. ఆ డాక్టర్ చేతి రాతను ఒక్క మెడికల్ షాపుల్లో పనిచేసే వారికి తప్ప మరొకరికి అర్థం కాదు. ఇప్పటికే డాక్టర్ల చేతి రాతపై బోలెడన్ని మీమ్స్ కూడా వైరల్ అయ్యాయి. ఓ పేషెంట్ డాక్టర్ రాసిన మందుల చీటీలో ఏం మందు రాసారో తెలీక ఆ డాక్టర్‌ను సంప్రదిస్తే.. ఇది మందు పేరు కాదయ్యా నా సంతకం అని అన్నాడట. ఇలా ఎన్నో మీమ్స్ వైద్యుల చేతి రాతపైనే ఉన్నాయి.
ఎందుకలా?
అసలు వైద్యుల చేతి రాత అలా ఎందుకు ఉంటుంది అని ఎప్పుడైనా ఆలోచించారా? ఆలోచించే ఉంటాం కానీ మనకి సమాధానం దొరికి ఉండదు. అసలు వైద్యుల చేతి రాత అలా ఎందుకు ఉంటుందో వైద్యుల మాటల్లో తెలుసుకుందాం.
ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ దిలీప్ భానుశాలి ఈ విషయంపై స్పందించారు. వైద్య పరీక్షలు రాసేవారిలో దాదాపు 10% మంది రాసే సమాధానాలు కూడా అర్థం కావట. మెడికల్ ఫీల్డ్‌లో ప్రతి క్షణం నోట్ టేకింగ్ అనేది ఉంటుంది. దీని వల్ల చేతి రాతలో మార్పు వస్తుందని ఆయన తెలిపారు. అలాగని అందరు డాక్టర్ల చేతి రాత చెత్తగా ఉంటుంది అనడానికి లేదట.
కొందరు వైద్యులు చక్కగా ప్రిస్క్రిప్షన్స్ రాస్తుంటారట. మరికొందరు తమ హ్యాండ్ రైటింగ్ తమకే అర్థం కాకపోవడంతో ఐప్యాడ్స్‌లో రాసి పంపుతుంటారట. మరికొందరు వైద్యులకు ఆంగ్లం రాకపోవడం వల్ల సరిగ్గా రాయలేకపోతుంటారు. అయితే.. ఢిల్లీకి చెందిన ఓ ఆర్థోపెడిక్ వైద్యుడు మాత్రం ఒక సర్‌ప్రైజింగ్ విషయాన్ని వెల్లడించారు. కొందరు వైద్యులకు అసలు పేషంట్‌కి ఉన్న సమస్య, ఏం మందులు రాయాలో తెలీక అలా కోడి గెలికినట్లుగా ప్రిస్క్రిప్షన్ రాసి ఇస్తుంటారట. ఇది నమ్మశక్యం కాని అంశమైనా.. చాలా మంది వైద్యులు ఈ విషయాన్ని ధృవీకరించారు.
అయితే వైద్యుల చేతి రాత బాగోకపోవడానికి ప్రధాన కారణం మాత్రం విపరీతమైన పని, అలసటే. వారికి ఉన్న షిఫ్ట్‌లో కనీసం 100 పేషంట్లను చూడాల్సి ఉంటుంది. అదీ కాకుండా.. మనం రాసేప్పుడు చెయ్యి, భుజం, మెడ దగ్గర ఉండే దాదాపు 30 కండరాలు పనిచేస్తాయట. అంతేకాదు.. మన చెయ్యి కంటే ముందు బ్రెయిన్ ఆలోచిస్తుంది కాబట్టి.. బ్రెయిన్ స్పీడ్‌ని అందుకోవడం చేతికి కుదరదు. అందుకే ఎక్కువ సేపు ఏదైనా రాసేటప్పుడు మొదట రాసినంతగా చివరి పేజీల్లో అక్షరాలు నీట్‌గా ఉండవు. అంత మంది పేషంట్లను చూసాక నీరసించిపోవడం.. పదే పదే రాయడం వల్ల చెయ్యి తిరగకపోవడం వల్ల వైద్యుల చేతి రాత అలా ఉంటుందని నిపుణులు చెప్తున్నారు.
పరిష్కారం ఏంటి?
కొన్ని పెద్ద పెద్ద హాస్పిటల్స్‌లో కంప్యూటర్లలో ఏం మందులు వాడాలో టైప్ చేస్తుంటారు. దీని వల్ల ఎలాంటి సమస్య ఉండదు. కానీ చిన్న చిన్న క్లీనిక్స్ నడిపే వారు అటెండర్స్‌ని పెట్టుకుంటే మంచిది. అప్పుడు డాక్టర్ చెప్పింది విని అటెండర్లు ప్రిస్క్రిప్షన్ రాసే అవకాశం ఉంటుంది. ఇప్పుడంతా ఆర్టిఫిషియల్ యుగం నడుస్తోంది కాబట్టి.. వైద్యుల ప్రస్క్రిప్షన్‌ను చదివి అర్థమయ్యేలా చెప్పే ఏఐ టూల్స్ వచ్చేసాయి. ఇవి కూడా చాలా మటుకు ఉపయోగరకంగా మారుతున్నాయి.