Shiva Lingam from kailasam శంకరాచార్యుల వారు కైలాసం వెళ్లినప్పుడు ఐదు శివలింగాలను తెచ్చారు. చాలా శక్తిమంతమైనవి అవి. అవి భూమిపై ఇప్పటికీ రహస్యంగా ఎక్కడో ఉన్నాయి. అవి ఎక్కడ ఉన్నాయంటే.. సామాన్యంగా ఈ ప్రశ్న ఎవరినైనా అడిగితే.. శృంగేరి, కంచి, ద్వారక, పూరి వంటి పీఠాల్లో ఉన్నాయని చెప్తారు. ఎందుకంటే.. అవి శంకరాచార్యుల వారి అన్వయ పీఠాలు కాబట్టి అక్కడే లింగాలు ఉన్నాయని అనుకుంటారు. కానీ ఈ సమాధానం 40% మాత్రమే కరెక్ట్. శంకరాచార్యుల వారు కైలాసం నుంచి శివలింగాలు తేవడం అనేది మార్కండేయ సంహితలో ఉన్న ఓ కథ. ఆ తర్వాత శంకర విజయం అని శంకరాచార్యుల జీవిత చరిత్రల్లో కూడా ఉంది. శంకరాచార్యుల వారు పరమేశ్వరుడి పిలుపు మేర శశీరంగా కైలాసానికి వెళ్లారు.
అప్పుడు పరమేశ్వరుడు ఆయనపై ప్రీతితో ఐదు శివలింగాలను ఇచ్చి నాయనా ఇవి చాలా పవిత్రమైన శివలింగాలు.. వీటిని భూమిపైకి తీసుకెళ్లి ఐదు ప్రదేశాల్లో పెట్టు. అవి పూజలు అందుకున్నంత కాలం సనాతన ధర్మానికి లోటు లేదు అని చెప్పి పంపించాడు. అప్పుడు అమ్మవారు.. ఆయనకు ఓ గ్రంథాన్ని ఇచ్చి .. భూమి మీద జనం కష్టాలతో అల్లాడిపోతున్నారు.. ఇది నా రహస్యమైన పత్రం.. ఇది ధర్మార్ధకామాన్ని, మోక్షాన్ని ఇస్తుంది.. ఈ 100 శ్లోకాలను శ్రద్ధగా పారాయణ చేయగలిగితే మంచి జరుగుతుందని చెప్పారట. దాంతో శంకరాచార్యుల వారు వెనక్కి వస్తుండగా.. నందీశ్వరుడు ఆపాడు. నాయనా.. ఇక్కడి నుంచి వెళ్తున్నావు కదా ఏం తీసుకెళ్తున్నావ్ అని అడిగారు.
కైలాసానికి ఉట్టి చేతులతో వచ్చి వెళ్లేటప్పుడు ఏం తీసుకెళ్తున్నావ్ అని అడిగితే.. తన చేతిలో ఉన్నవి చూపించారు. శివలింగాలను చూసి ఏమీ అనని నందీశ్వరుడు.. చేతిలో ఉన్న గ్రంథాన్ని చూసి ప్రశ్నించాడు. ఇంత గొప్ప తంత్రం మొత్తం భూమ్మీద అందకూడదు. ఎందుకంటే అది తీసుకునే స్థాయిలో ఇప్పుడు ప్రస్తుతానికి ప్రజలు లేరు. కాబట్టి ఈ 41 శ్లోకాలు మాత్రమే పట్టుకెళ్లు అని అందులోని 41 శ్లోకాలు శంకరాచార్యుల వారికి ఇచ్చి మిగతా శ్లోకాలను నందీశ్వరుడు ఉంచుకున్నాడు అని ఆ కథలో ఉంది. అప్పుడు శంకరాచార్యుల వారు అవి భూమి మీదకు తెచ్చి ఐదు చోట్ల పెట్టాడు. ఇంతకీ అవి ఎక్కడ ఉన్నాయంటే..
మొట్ట మొదటిది యోగలింగం – కంచి కామకోటి పీఠంలో ఉంది
రెండోది భోగ లింగం – శృంగేరి పీఠంలో ఉంది.
మూడోది మోక్ష లింగం – చిదంబరం ఆలయంలో ఉంది.
నాలుగోది వరలింగం – ఇది నేపాల్‌లోని నీలకంఠ క్షేత్రంలో ఉంది.
ఐదోది ముక్తి లింగం.. కేదార్నాథ్‌లో ఉంది.
ఇంకా చాలా చోట్ల శంకరాచార్యుల వారు కైలాసం నుంచి తెచ్చిన శివలింగం అని చెప్తూ ఉంటారు కానీ అది అబద్ధం. ఎలా వాటిని దర్శించుకోవాలంటే.. ఒక ప్రదేశంలో ఉన్న దానిని మన చాలా తేలిగ్గా చూడచ్చు. అది ఎక్కడ అంటే.. శృంగేరిలో. శృంగేరిలో చంద్రమౌళీశ్వర శివలింగం ఉంది కదా.. అది శంకరాచార్యుల వారు తెచ్చిందే. ఎక్కడుందంటే.. శృంగేరిలో ఉన్న బ్రిడ్జి దాటి వెళితే శృంగేరి మఠం ఉంది. ఆ మఠంలో ఈ లింగం ఉంది. ప్రతి రోజు రాత్రి దాదాపు 8 గంటలకు భారతి తీర్థస్వామి వచ్చి చంద్రమౌళీశ్వరుడిని ఆరాధిస్తారు. చూడటానికి రెండు కళ్లు చాలవు.