POCSO మనకు పోక్సో చట్టం గురించి తెలుసు. కోర్ట్ సినిమా తర్వాత ఈ చట్టం గురించి ఇంకా బాగా తెలిసి ఉంటుంది. అయితే.. ఈ పోక్సో చట్టంలో రోమియో జూలియట్ క్లాజ్ గురించి తెలుసా? చట్టాల్లో ఇలాంటి చరిత్రలో నిలిచిపోయిన ప్రేమికుల పేరు ఎందుకు పెట్టారు? అనుకుంటున్నారా? అయితే.. ఈ క్లాజ్ గురించి తెలుసుకోవాల్సిందే.
నిజానికి ఇప్పటివరకు పోక్సో చట్టంలో ఈ రోమియో జూలియట్ క్లాజ్ అనేది లేదు. కానీ దీనిని పోక్సో చట్టంలో ఒక క్లాజ్‌గా అంటే ఒక వ్యాలిడ్ పాయింట్‌గా చేర్చాలని సర్వోన్నత న్యాయస్థానం కేంద్రాన్ని కోరుతోంది. ఎందుకంటే.. మన భారతదేశ రాజ్యాంగం ప్రకారం.. ఒక అమ్మాయి, అబ్బాయి పరస్పర అంగీకారంతో ప్రేమలో, లివ్ ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉంటే అది తప్పేమీ కాదు. అయితే.. ఇది మేజర్లకు మాత్రమే వర్తిస్తుంది. కానీ మైనర్ల విషయంలో మాత్రం ఈ రూల్‌ను అడ్వాంటేజ్‌గా తీసుకుని తప్పుడు కేసులు పురమాయిస్తున్నారు.
అంటే.. ఇద్దరు మైనర్లు ప్రేమలో ఉండి పరస్పర అంగీకారంతో ఏం చేసుకున్నా కూడా దానిని నేరంగా పరిగణించకూడదని చెప్తున్నారు. వారిని రోమియో జూలియట్‌గా చూడాలని.. ఒకవేళ తప్పు లేకపోయినా రేప్ కేసు బనాయిస్తే ఈ రోమియో జూలియట్ క్లాజ్ కింద ఆలోచించి తీర్పు ఇవ్వాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు వెల్లడించింది. పోక్సో చట్టం ప్రకారం.. మైనర్లు లైంగిక చర్యలకు పాల్పడటం తప్పు. వారిపై కేసు నమోదవడం జువెనైల్‌కు తరలించడం వంటివి జరుగుతాయి. ఎందుకంటే 18 లోపు లైంగిక చర్యలో అమ్మాయి ఇష్టంతో పాల్గొన్నప్పటికీ ఆమె అంగీకారం చెల్లదు.
రోమియో జూలియట్ రూల్ ప్రకారం
అమ్మాయి, అబ్బాయి మధ్య వయసు వ్యత్యాసం 2 నుంచి 5 ఏళ్ల వరకు ఉంటే తప్పులేదు.
ఇద్దరి వయసు 16 ఉండాల్సిందే
దీనిని అమెరికాలో అమలు పరిచారు. NGO డేటా ప్రకారం అమ్మాయి, అబ్బాయి పరస్పర అంగీకారం ఉన్నప్పటికి కూడా 24% వరకు తప్పుడు కేసులు పెడుతున్నారు. వాటిలో 80% కేసులు తల్లిదండ్రులే పెడుతున్నారు. అమ్మాయి తన ఇష్టంతోనే రిలేషన్‌లో ఉన్నాను అని అంగీకరించినప్పటికీ అబ్బాయిలపై తప్పుడు కేసులు పెడుతున్నారు. అయితే.. ఈ రోమియో జూలియట్ క్లాజ్ అమలు విషయంలో ఇంకా కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.





