BRS: 2023 ఎన్నికల్లో కూడా మేమే కొడతాం.. ముచ్చటగా మూడోసారి తెలంగాణ ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తారు అని గులాబి దళం మితిమీరిన నమ్మకంతో ఉంది. తీరా చూస్తే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి దాదాపు రెండేళ్లు అవుతున్న నేపథ్యంలో ఎప్పటికప్పుడు BRS వర్కింగ్ ప్రెసిడెంట్‌తో పాటు ఇతర కీలక నేతలు కూడా తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పాలన పట్ల ఊహించినట్లుగానే అసహనంతో ఉన్నారని.. సంతృప్తికరంగా లేరని చెప్తున్నారు.
ఉచిత బస్సు పథకం తప్ప రాష్ట్రంలో కాంగ్రెస్ ఇచ్చిన మిగతా గ్యారెంటీలు అమల్లో లేవని అంటున్నారు. ఇదిలా ఉండగా.. BRS పార్టీకి చెందిన దివంగత నేత మాగంటి గోపీనాథ్ మరణంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వచ్చింది. ఇతర తెలంగాణ ప్రాంతాల్లో ప్రజలు తమను ఓడించినప్పటికీ గ్రేటర్ హైదరాబాద్‌లో మాత్రం ప్రజలు బీఆర్ఎస్‌కే పట్టం కట్టారు. దాంతో ఈసారి ఉప ఎన్నికలో కూడా గెలిచేది BRS పార్టీనే అని KTR కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. తీరా చూస్తే కాంగ్రెస్ నేత నవీన్ యాదవ్ BRS అభ్యర్ధి మాగంటి సునీతపై 25 వేల ఓట్ల మెజార్టీతో గెలిచి షాక్ ఇచ్చారు. ఇంత జరిగిన తర్వాత కూడా అధికారంలో ఏ పార్టీ ఉంటే ఉప ఎన్నికలో కూడా ఆ పార్టీనే గెలవడం సాధారణం అని BRS తమకు తాము సర్దిచెప్పుకుంటున్నారు.
ఇక త్వరలో GHMC ఎన్నికలు రాబోతున్నాయి. అందులో కూడా గెలిచేది కాంగ్రెసే అని ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బల్లగుద్ది చెప్తున్నారు. దాంతో బీఆర్ఎస్‌లోనూ భయం మొదలైంది. దాంతో పార్టీ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి KCR పార్టీపై పూర్తిస్థాయి ఫోకస్ పెట్టారు. ఇప్పటికే దెబ్బ మీద దెబ్బ తగలడంతో KCR పక్కా ప్రణాళికను రచిస్తున్నారు. లేకపోతే వచ్చే GHMC ఎన్నికల్లో కూడా పార్టీ ఓడిపోతుందనే సమాచారం ఉండటంతో KCR కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారట. ఇప్పటివరకు కమిటీలతోనే పార్టీ నడిపిన ఆయన త్వరలోనే రాష్ట్ర స్థాయి వరకు కొత్త నాయకత్వాన్ని బలోపేతం చేయాలనుకుంటున్నారట.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఘోర ఓటమి ఆయన్ను కలచివేసింది. దాంతో పార్టీని ప్రక్షాళన చేసే పనిలో ఉన్నారు పెద్దాయన. కేడర్ బలంగా ఉన్నప్పటికీ పూర్తిస్థాయిలో గ్రౌండ్ లెవల్‌లో ఎన్నికల ప్రచారంలో యాక్టివ్ అవ్వలేదని ఆయన అభిప్రాయపడ్డారట. ఆ కారణంతోనే ఇంత పెద్ద స్థాయిలో ఓటమి చవిచూసిందని కేడర్‌తో అన్నారట.





