Viral News: ఎలుక అంతరిక్షం నుంచి భూమి పైకి రావడమేంటి.. పిల్లలకు జన్మనివ్వడం ఏంటి అనుకుంటున్నారా? ఇది నిజం. చైనీస్ స్పేస్ స్టేషన్ చేపట్టిన ఓ ప్రయోగం ఇప్పుడు సంచలనంగా మారింది. అసలు మ్యాటర్ ఏంటంటే.. చైనాకు చెందిన టియాన్‌గాంగ్ స్పేస్ స్టేషన్‌లోకి నాలుగు ఎలుకలను పంపారు. దాదాపు రెండు వారాల పాటు ఆ నాలుగు ఎలుకలు అంతరిక్షంలోనే ఉన్నాయి. ఇటీవల అవి భూమి మీదకు వచ్చాయి. ఏ ఒక్క ఎలుకకూ ఎలాంటి అనారోగ్య సమస్య లేదు. అదీకాకుండా అందులోని ఓ ఎలుక గర్భం దాల్చి.. భూమి మీదకు వచ్చిన రెండో రోజే 9 పిల్లల్ని కంది. వాటిలో 6 పిల్లలు మాత్రమే బతికాయి.
టియాన్‌గాంగ్ స్పేస్ స్టేషన్ చేపట్టిన ప్రయోగాల్లో విజయవంతమైన తొలి కాన్పు ఇదేనట. అంతరిక్షంలో సంతానోత్పత్తి ఎలా ఉండబోతోంది అనే అంశంపై ఈ పరిశోధన జరిగింది. భవిష్యత్తులో మనుషులు అంతరిక్షానికి వెళ్లాలనుకున్నా.. అక్కడ గర్భం దాలిస్తే శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయి అనే దానిపై రీసెర్చ్ చేస్తున్నారు. గతంలోనూ టియాంగాంగ్ స్పేస్ స్టేషన్ ఎలుకలపై ఇలాంటి ప్రయోగాలు చేసినప్పటికీ సంతానోత్పత్తి తగ్గిపోవడం.. పుట్టిన ఎలుక పిల్లల్లో లోపాలు ఉండటం వంటి సమస్యలు కనిపించాయి. కానీ ఇటీవల చేసిన ప్రయోగంలో మాత్రం ఇలాంటివేవీ లేవు. 2030 నాటికి చైనా చంద్రుడిపై లూనార్ బేస్‌ను నిర్మించనుంది. దీని ద్వారా మనుషులు చంద్రుడిపై ఉండి పనులు చేసుకునే అవకాశం ఉండబోతోంది.





