Viral News: నాలుగు నెలలుగా ఇంటి అద్దె ఇవ్వడం లేదు. ఎందుకు ఇవ్వడం లేదు.. ఎప్పుడిస్తారు అని అడగడానికి వెళ్లిన ఓనర్‌ను దారుణంగా హతమార్చారు. ఈ ఘటన ఢిల్లీలోని ఘజియాబాద్‌లో చోటుచేసుకుంది. రాజ్ నగర్‌కి చెందిన దీప్షికా శర్మ అనే మహిళకు ఓ అపార్ట్‌మెంట్‌లో రెండు ఫ్లాట్లు ఉన్నాయి. ఒక ఫ్లాట్‌లో దీప్షిక.. ఆమె భర్త ఉంటున్నారు. మరో ఫ్లాట్‌ని అజయ్ గుప్తా, ఆకృతి గుప్తా అనే దంపతులకు అద్దెకు ఇచ్చారు. అజయ్ ట్రాన్స్‌పోర్ట్ వ్యాపారం చేస్తుంటాడు.
వీళ్లు నాలుగు నెలలుగా అద్దె ఇవ్వడం లేదు. దాంతో అప్పటికే అడిగి అడిగి విసిగిపోయిన దీప్షిక తాడో పేడో తేల్చుకుందామని అజయ్ ఉంటున్న ఇంటికి వెళ్లి నిలదీసింది. అదే సమయంలో దీప్షిక ఇంట్లో పని మనిషి కూడా ఉంది. అయితే ఎంత సేపైనా దీప్షిక ఇంటికి రాకపోవడంతో వెళ్లి అజయ్‌ని అతని భార్యను నిలదీసింది. వారు తమకి తెలీదని అసలు దీప్షిక తమ ఇంటికే రాలేదని సమాధానం చెప్పడంతో అనుమానం వచ్చి సీసీ కెమెరా పరిశీలించింది. అందులో దీప్షిక అజయ్ ఇంట్లోకి వెళ్లినట్లు ఉంది కానీ బయటికి వచ్చినట్లు లేదు. దాంతో అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఈ గ్యాప్‌లో అజయ్, ఆకృతిలు కలిసి దీప్షిక మృతదేహాన్ని ఓ సూట్‌కేసులో పెట్టి ఆటోలో ఎక్కించే ప్రయత్నం చేస్తుండగా దీప్షిక ఇంటి పని మినిషి వారిని అడ్డుకుంది. పోలీసులు వచ్చే వరకు ఎక్కడికీ వెళ్లడానికి లేదు అని చెప్పింది. ఇంతలో పోలీసులు చేరుకుని సూట్‌కేసును తీసి చూడగా అందులో దీప్షిక మృతదేహం లభ్యమైంది. ఇద్దరినీ అదుపులోకి తీసుకుని విచారించగా రెంట్ కోసం గొడవ పడ్డామని.. మాటా మాటా పెరగడంతో కుక్కర్‌తో తలపగలగొట్టి చున్నీతో మెడను బిగించి హతమార్చినట్లు ఒప్పుకున్నారు. అప్పటికీ దీప్షికను ఒంటరిగా వెళ్లద్దు అని తాను చెప్తూనే ఉన్నానని.. తాను కూడా వెళ్లి ఉంటే దీప్షిక బతికేదని పనిమనిషి వాపోయింది.





