Vijaya Sai Reddy: వైసీపీలో ఉన్నప్పుడు చెలరేగిపోయిన విజయసాయి రెడ్డి ఈ ఏడాది జనవరిలో రాజ్యసభ ఎంపీ పదవికి రాజీనామా చేసి పార్టీకి గుడ్‌బై చెప్పారు. ఉత్తరాంధ్ర వైసీపీ ఇన్‌ఛార్జిగా చక్రం తిప్పిన విజయ సాయి.. రాజీనామా చేసిన తర్వాత కొంతకాలం ఇటు వైపు రాలేదు. కానీ ఈ మధ్య తరచూ వైజాగ్‌కు వచ్చి వెళ్తున్నారు.
రాజకీయాలకు దూరంగా ఉండి వ్యవసాయం చేసుకుంటానని ప్రకటించిన విజయసాయి రెడ్డి కొన్ని రోజులుగా విశాఖలోనే మకాం వేయడాన్ని పరిశీలిస్తే ఇక్కడ రాజకీయాల్లో ఏదో జరుగుతోంది అన్న చర్చ సాగుతోంది. వైసీపీ, కూటమి నేతలతో రహస్య నేతలతో రహస్యంగా భేటీ అవుతున్న సందర్భాలు చూస్తుంటే ఈయన వ్యవహారంపై అనుమానం రాకుండా ఉండదు.
త్వరలోనే ఓ రాజకీయ పార్టీలో చేరడానికి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారని అందుకే తన అనుచరులు, శ్రేయోభిలాషులతో మంతనాలు సాగిస్తున్నారని పొలిటికల్ సర్కిల్స్‌లో జరుగుతున్న చర్చ. విశాఖ వైసీపీ నేతల్లో కొందరు విజయసాయి రెడ్డిని కలవడం మరికొందరు ఈ మాజీ ఎంపీతో భేటీ అవ్వడం చూస్తుంటే రాజకీయంగా ఏవో పరిణామాలు జరుగుతున్నాయన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. కుమారుని మృతితో దుఃఖ సాగరంలో ఉన్న భీమిలికి చెందిన వైసీపీ సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు కుటుంబ సభ్యులను విజయసాయి పరామర్శించారు.ఇలా ఏ పార్టీ వారైనా బాధలో ఉన్నప్పుడు పరామర్శించడంలో తప్పు లేదు.
దీనిని రాజకీయ కోణంలో చూడాల్సిన అవసరం లేదు. కానీ విజయసాయిని వైసీపీ కీలక నేతలతో పాటు కూటమిలోని ఒక ఎమ్మెల్యే కలవడం పొలిటికల్ హీట్ పెంచుతోంది. విజయసాయి రెడ్డి ఉత్తరాంధ్ర వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్‌గా ఉన్నప్పుడు విశాఖ రాజకీయాలను శాసించారు. అన్నీ తన కనుసన్నల్లోనే జరిగేలా చక్రం తిప్పారు. 2021 మార్చిలో జరిగిన జీవీఎంసీ ఎన్నికల్లో ఫ్యాన్ పార్టీ విజయం వెనుక ఈయన వ్యూహం ఉంది అనడంలో సందేహం లేదని ఇప్పటికీ వైపీపీ నేతలు చెప్తారు. ఫ్యాన్ పార్టీ కార్పొరేటర్లలో విజయసాయి ఫ్యాన్స్ ఎక్కువగా ఉన్నారన్నది బహిరంగ రహస్యం.
ప్రస్తుత మేయర్ దురగాని హరివెంకట కుమారి కూడా ఈయన అభిమానే. అయితే కూటమి కార్పొరేటర్లు ఈమెపై అవిశ్వాస తీర్మానం పెట్టడం అదే సమయంలో విజయసాయి రెడ్డి విశాఖ రావడంతో వైసీపీని కలవరపెడుతోంది. కూటమి నేతలతో మంతనాలు జరపడం ఫ్యాన్ పార్టీని మరింత ఆందోళనకు గురిచేసింది. విజయసాయి విశాఖకు రాకముందు వరకు మేయర్‌పై అవిశ్వాస తీర్మానం అంశాన్ని పెద్దగా పట్టించుకోని వైసీపీ నేతలు ఒక్కసారిగా అలెర్ట్ అయ్యారు.
వాస్తవానికి కూటమి కార్పొరేటర్లు అవిశ్వాస తీర్మానం నోటీస్ ఇచ్చే సమయానికి ఒకరిద్దరు సభ్యుల బలం తక్కువగా ఉంది. అయితే.. ఈ అంశంపై కౌన్సిల్‌లో చర్చ జరిగే సమయానికి వైసీపీ సభ్యులు వస్తారని భావించింది. తమ బలం మరింత పెరిగి అవిశ్వాస తీర్మానం సులభంగా నెగ్గుతారని అనుకున్నారు. తమ కార్పొరేటర్లను కూటమిలోకి పంపే ప్రయత్నంలో విజయసాయి ఉన్నారన్న భయంతో అప్రమత్తమైన వైసీపీ నేతలు తమ వారిని కాపాడుకునేందుకు బెంగళూరులో క్యాంప్ ఏర్పాటు చేసారు.
అయితే విజయసాయి రాక వ్యక్తిగతమే తప్ప రాజకీయ ప్రాధాన్యత లేదని ఈయన అభిమానులు చెప్తున్నారు. నగరానికి వచ్చినప్పుడు శ్రేయోభిలాషులను కలవడంలో తప్పు లేదని అంటున్నారు. అయితే విజయసాయి చెప్పిన మాటకు కట్టుబడరు అన్న విమర్శలు ఉన్నాయి. అబద్ధాలు చెప్తారని అంటున్నారు. మేయర్ పీఠాన్ని నిలబెట్టుకోవడానికి వైసీపీ, కూటమి పోరాడుతున్న సమయంలో విజయసాయి రెడ్డి విశాఖకు ఎందుకు వచ్చారనేది అవిశ్వాస తీర్మానం ఫలితం వచ్చిన రోజు తెలుస్తుంది.